Tuesday, January 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులాను వదిలి రండి : పౌరులకు అమెరికా సూచన

వెనిజులాను వదిలి రండి : పౌరులకు అమెరికా సూచన

- Advertisement -

– అంతా ప్రశాంతం…భయం వద్దు : కారకాస్‌
వాషింగ్టన్‌ :
వెనిజులాలో నివసిస్తున్న తన పౌరులను వెంటనే ఆ దేశం విడిచి రావాలని అమెరికా సూచించింది. వెనిజులా సాయుధ దళాలు తమ దేశంలోని అమెరికా పౌరులను వెంటాడి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ మేరకు భద్రతాపరమైన అలర్ట్‌ జారీ చేసింది.
వెనిజులా ప్రభుత్వ అనుకూల మిలీషియాకు చెందిన సాయుధ సభ్యులు (వీరిని కొలెక్టివోస్‌ అంటారు) రోడ్లను దిగ్బంధించి, వాహనాలను తనిఖీ చేస్తున్నారని, వాటిలో అమెరికా పౌరులు లేదా ఆ దేశ మద్దతుదారులు ఉన్నారేమో చూస్తున్నారని వార్తలు వస్తున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. ‘వెనిజులాలో ఉంటున్న అమెరికా పౌరులు జాగరూకులై ఉండాలి. రోడ్లపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని చెప్పింది. వెనిజులా నుంచి కొన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమైనందున వెంటనే అక్కడి నుంచి బయటపడాలని సూచించింది.
మదురో దంపతుల అపహరణ తర్వాత వెనిజులాలో పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉన్నదో అమెరికా విదేశాంగ శాఖ జారీ చేసిన ప్రకటన తెలియజేస్తోంది. వెనిజులాలో ప్రభుత్వ మద్దతుదారులు వీధులలోకి వచ్చి అమెరికా సామ్రాజ్యవాద దుందుడుకు చర్యను తీవ్రంగా నిరసిస్తున్నారు. కాగా అమెరికా ప్రకటనపై వెనిజులా విదేశాంగ శాఖ స్పందిస్తూ దానిని కట్టుకథగా కొట్టిపారేసింది. వెనిజులాలో నివసిస్తున్న వారెవ్వరికీ ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. లేనిపోని భయాందోళనలు రేకెత్తించేందుకు అమెరికా ఇలాంటి ప్రకటనలు చేస్తోందని విమర్శించింది. వెనిజులాలో పరిస్థితి ప్రశాంతంగా, శాంతియుతంగా, సుస్థిరంగా ఉన్నదని చెప్పింది. ఆయుధాలన్నీ బొలీవియా ప్రభుత్వ అధీనంలో ఉన్నాయని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -