పాశ్చాత్య దేశాల్లోని అధునికతను, గాంభీర్యాన్ని తన నటనలో అనన్య సామాన్యంగా వెండితెరపై ఆవిష్కరించిన భారతీయ సౌందర్యరాశి లీలా నాయుడు. ఆమెకిది ఇండో-యూరోపియన్ మూలం నుండి వచ్చిన లక్షణం. ఈ లక్షణమే1960ల నాటి సమకాలీన భారతీయ సినీ ప్రముఖులైన నర్గీస్, మీనా కుమారి, వహీదా రెహమాన్‌ల వరుసలో ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. విద్యావంతుల కుటుంబానికి చెందినప్పటికీ ఆమె తన వ్యక్తిత్వాన్ని, నటనను విడివిడిగా కాకుండా ఏక సూత్రంలో కలగలిపి జీవించిన ప్రత్యేకమైన జీవన లక్షణాన్ని కలిగిన నటి.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన ప్రఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ రామయ్య నాయుడు, స్విస్-ఫ్రెంచ్ భార్య మార్తే దంపతులకు 1940లో జన్మించిన లీల బాల్యంలోనే సంగీతాన్ని ఇష్టపడేది. ఆమె తల్లి గీతాలను పాడేది. పియానో వాయిద్యంలో ఆమెది అందే వేసిన చేయి. బాల్యంలో రేడియోలో ప్రసారమయ్యే హిందీ, ఆంగ్లం ఆమెను ఆకర్షించాయి. ఐదేండ్ల వయసులో పోలిష్ స్వరకర్త ఫ్రెడెరిక్ ఫ్రాంకోయిస్ చోపిన్ సంగీతం ఆమెను బలంగా ప్రభావితం చేసింది. ఆమె పియానో నేర్చుకోవడం ప్రారంభించింది. జెనీవాలోని మ్యూజిక్ అకాడమీలో అతి పిన్న వయసులో చేరింది. ఆ తర్వాత నత్యం వైపు మళ్లిన లీల ఎనిమిదేళ్ల వయసులో బ్యాలెట్ నేర్చుకుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరిథమిక్స్‌లో ఆమె నత్య శిక్షణ జరిగింది. అక్కడ ఆమె తొమ్మిదేళ్ల వయసులో ఒక డాక్యుమెంటరీ చిత్రీకరణలో తొలుత పాల్గొన్నది.
1950లో ఆమె జెనీవా పాఠశాలలో లీలా ‘ఐ ది సోల్ హూ వాంటెడ్ టు ఈక్వల్ ది గాడ్స్’ అనే నాటకంలో నటించింది. ఆమె పాఠశాల మిత్రుల్లో ఒకరు ఆమె నటనకు ఆకర్షితులై ఆ తరువాత అతను తన ప్రయోగాత్మక చిత్రాలలో ఒకటైన ‘బర్త్ ఆఫ్ ఎ సోల్’ లో ఆమెను చూపించాడు. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గుర్తింపు పొందింది. లీల తన యూరోపియన్ పాఠశాలలో ఫ్రెంచ్, ఇంగ్లీష్ నాటకాల్లో పాల్గొన్నది. అయితే తరచుగా ఇండియాకు వచ్చిపోయేది.
1954లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నప్పుడు లీల ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ”లీలా నాయుడు అందంతో బాటు తన తల్లి నుండి యూరోపియన్ సౌందర్యాన్ని, తన తండ్రి నుండి విలువల కోసం నిలబడాలనే సంకల్పాన్ని కలబోసుకుని తనను తాను రూపుదిద్దుకున్నదని” ఆమె జీవిత చరిత్ర రాసిన టి.జె.ఎస్.జార్జ్ రాశాడు. ‘వోగ్’ మ్యాగజైన్ జైపూర్ మహారాణి గాయత్రి దేవితో పాటు ప్రపంచంలోని అత్యంత అందమైన 10 మంది మహిళలలో ఒకరిగా లీలా నాయుడును చేర్చింది. ఈ ఒక్క అంశం చాలు లీల ప్రావీణ్యతను అందాన్ని అంచనా వేయడానికి.

లీలా నాయుడును హషికేష్ ముఖర్జీ ‘అనురాధ’ (1960) చిత్రంతో నటిగా సినిమా రంగానికి పరిచయం చేశాడు. ముఖర్జీ ఆమెను మనదేశంలోని ఒక మారుమూల గ్రామంలో ఒంటరి గహిణి (అనురాధ) పాత్రకు ఎంచుకోవడం ద్వారా గొప్ప అంతర్ దష్టిని ప్రదర్శించాడు. ఆమె భర్త డాక్టర్ నిర్మల్ చౌదరి (బలరాజ్ సాహ్ని) తో కలిసి ఆ పాత్రను పోషించింది. ముఖర్జీ దర్శకత్వంలో లీలా నాయుడు తన పాత్రను సమతుల్యతతో పోషించింది. ఈ చిత్రం హిందీ సినిమా క్లాసిక్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. పండిట్ రవిశంకర్ ఈ చిత్రానికి అందించిన సంగీతం నేటికీ శ్రోతలను అలరిస్తోంది. ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును (1961) గెలుచుకుంది. అంతేకాకుండా బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవం (1961) లో గోల్డెన్ బేర్‌కు నామినేట్ చేయబడింది. ఆమె తదుపరి చిత్రం ‘ఉమ్మీద్’ (1962). దీనికి ప్రఖ్యాత దర్శకుడు నితిన్ బోస్ దర్శకుడు. ఉమ్మీద్ చిత్రంలో లీలా, జారు ముఖర్జీ, అశోక్ కుమార్ లతో నటించింది.
ఆర్. కె. నయ్యర్ క్రైమ్ థ్రిల్లర్ ‘యే రాస్తే హై ప్యార్ కే’ (1963) తో లీలా నాయుడుకి సినిమా పరిశ్రమలో పెద్ద బ్రేక్ వచ్చింది. ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఈ కథ 1959లో బొంబాయిలో జరిగిన వాస్తవిక జీవన హత్యకు అనుసరణ. నానావతి హత్య కేసుగా పిలువబడే ఈ కేసులో ఉన్నత స్థాయి నావికాదళ కమాండర్ నానావతి తన స్నేహితుడు ప్రేమ్ అహుజాను తన ఇంగ్లీష్ భార్య సిల్వియా ప్రేమికుడని తెలుసుకుని చంపాడు. ఇది భారతదేశం అంతటా సంచలనం సష్టించింది. ఈ కేసు భారతీయ న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఎందుకంటే ఇది బ్రిటిష్ రాజ్ వారసత్వాలలో ఒకటైన జ్యూరీ వ్యవస్థను రద్దు చేసింది. ఈ కేసు సంచలనాత్మకత నయ్యర్ ‘యే రాస్తే హై ప్యార్ కే’ గా నిర్మించడానికి దారితీసింది. లీలా నాయుడు పాశ్చాత్య రూపాలు నీనా (నానావతి భార్య) పాత్రకు బాగా సరిపోతాయి. నానావతి పాత్ర పోషించిన సునీల్ దత్ లాంటి హీరో ప్రేమ్ అహుజా పాత్ర పోషించిన రెహమాన్ విలన్ పాత్రలను అంగీకరించడం అసాధారణం కాదు. అయితే, లీలా నాయుడు పరిస్థితి అసాధారణమైనది. ఎందుకంటే ఆమె మాత్రమే నానావతి నమ్మకద్రోహ భార్యగా నటించడానికి అంగీకరించడం ద్వారా రిస్క్ తీసుకుంది. 1960ల నాటి చాలా మంది హీరోయిన్లు ఈ పాత్రను తిరస్కరించారు. అదష్టవశాత్తు ఆమె ధైర్యం ఫలించింది. ‘యే రాస్తే హై ప్యార్ కే’ వాణిజ్యపరంగా విజయవంతమైంది కూడా. నాయుడును భారతదేశంలో మహిళా విముక్తికి ఒక సంకేతమైంది. ఈ చిత్రంలో రఫీ ఆశ పాడిన ”ఏ ఖామోషియా ఏ తన్హాయియా మొహబ్బత్‌కి దునియా ఇతని జవా” పాడిన పాట నేటికీ అతి గొప్ప హిందీ రొమాంటిక్ గీతాలలో ఒకటిగా నిలిచిపోయింది.
లీలా నాయుడు విమర్శకుల ప్రశంసలు పొందిన మరో చిత్రం ‘ఘర్బార్’ (ది హౌస్ హోల్డర్ 1963). మర్చంట్ ఐవరీ ప్రొడక్షన్స్ వారి చిత్రం. దీనికి జేమ్స్ ఐవరీ దర్శకత్వం వహించారు. నిర్మాత ఇస్మాయిల్ మర్చంట్ దర్శకుడు ఐవరీల మొదటి కాంబినేషన్ ఇది. పూర్తిగా ఢిల్లీలో రూపొందిన ‘ది హౌస్‌హోల్డర్’ అనేది ప్రేమ్ (శశి కపూర్), అతని చిన్న భార్య ఇందు (నాయుడు) చుట్టూ తిరిగే హాస్య చిత్రం. ఇందు అనే దిగువ మధ్యతరగతి అమ్మాయి పాత్రను పోషించడం లీలానాయుడు ప్రజ్ఞకు మరో గీటు రాయి. ‘ది హౌస్‌హోల్డర్’కు సంగీతం చేసినవాడు డైరెక్టర్ సత్యజిత్ రే. ఆయన లీలా నాయుడు నటనకు ఆకర్షితుడై ఆ తర్వాత మార్లన్ బ్రాండో, శశి కపూర్‌లతో ఒక ఇంగ్లీష్ సినిమాను చెయ్యాలనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.

నటిగా లీలానాయుడు క్లాసిక్ నటన శ్యామ్ బెనెగల్ ‘త్రికాల్’ (1985) లో ఆమె తన భర్త చనిపోయాడని నమ్మడానికి నిరాకరించే కలత చెందిన వితంతువు సోరెస్ పాత్రను పోషించింది. ఆమె ఎప్పుడూ తన రాకింగ్ కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చుని గ్రామ్‌ఫోన్‌లో పాటను వింటుంది. పాట ముగిసినప్పుడు, ఆమె తన యువ పనిమనిషికి దానిని మళ్ళీ వినిపించమని తన చేతితో సైగ చేసింది. లీలా నాయుడు అసాధారణంగా అసాధారణమైన నటన ప్రతిభకు నిదర్శనం ఈ దశ్యం.
”లీలా నాయుడుతో కలిసి పనిచేయడం ఒక హదయ విదారకమైన అనుభవం, ఆమె నటనలో అమాయకత్వం ప్రశాంతతను మనం గమనించవచ్చు” అని శ్యామ్ బెనెగల్ అన్నారు. 1965లో డేవిడ్ లీన్ ఆమెను ఒక ప్రతిభావంతమైన టైమింగ్స్ కలిగిన నటిగా ప్రశంసించాడు.
డేవిడ్ లీన్ ఆమె డాక్టర్ జివాగోలో టోన్యాగా నటించాలని కోరుకున్నాడు. సాల్వడార్ డాలీ ఆమెను మడోన్నాకు మోడల్‌గా ఉపయోగించుకున్నాడు. సత్యజిత్ రే ఆమెతో, మార్లన్ బ్రాండోతో సినిమా తీయాలని కోరుకున్నాడు. రాజ్ కపూర్ ఆమెను నాలుగు చిత్రాలలో నటింప చేయాలనుకున్నాడు. కానీ డాలీ విజయం సాధించాడు. లీన్, రే అలా చేయలేదు. ఆమె రాజ్ కపూర్‌ను తిరస్కరించింది.
లీలా సినిమాల్లో చేరినప్పుడు మనసులో వున్న తన సందేహాలను అలాగే ఉంచుకుంది. ఆమె కెరీర్‌ను అడ్డుకున్నవి అవేనేమో. నిజానికి లీలా నాయుడు తన నటనలోని సహజత్వాన్ని ఎప్పుడూ తగ్గించుకోలేదు. ప్రతిభ, అంకితభావం, నిబద్ధత ఉన్నప్పటికీ ఆమె కొన్ని చిత్రాలలో మాత్రమే నటించింది. స్టీరియో టైప్‌లతో నిండిన చిత్ర పరిశ్రమలో, ఆమె వ్యక్తిత్వం, సహజ జీవనశైలి ప్రతికూలతలుగా, లోపాలుగా మారాయి. అంతేకాకుండా ఆధునిక భారతీయ నటీమణుల మాదిరిగా కాకుండా, ఆమె శిక్షణ పొందిన నత్యకారిణి కాకపోవడంతో విజరు ఆనంద్ ‘గైడ్’ (1965)లో రోజీ పాత్రకు ఎంపిక కాలేకపోయింది. ఆ పాత్ర వహీదాకి దక్కింది.
లీలా నాయుడు 1964లో రామ్ దయాల్ దర్శకత్వంలో ప్రదీప్ కుమార్ సరసన ‘బాఘీ’ చిత్రంలో నటించింది. విజయ చౌదరి, ముంతాజ్ కూడా ఈ చిత్రంలో నటించారు. అయితే, ఈ చిత్రం ఫ్లాపయ్యింది. ఈ చిత్రం తర్వాత హిందీ చిత్రాలలో ఆమె కెరీర్ మందగించడం ప్రారంభమైంది.
నాయుడు వ్యక్తిగత జీవితం దాదాపుగా వొడుదుడుకుల మయంగానే సాగింది. ఆమె ఒబెరారు గ్రూప్ ఆఫ్ హోటల్స్ సంపన్న వారసుడు టిక్కీ ఒబెరారును వివాహమాడింది. టిక్కీ ఒబెరారుతో జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్న లీల కలలన్నీ తలకిందులైనది. టిక్కీ లీల పట్ల పాశవికంగా ప్రవర్తించేవాడు. భౌతికంగా ఆమెను దుర్మార్గంగా హింసించేవాడు. ఇలాంటి గహహింసను అనుభవిస్తూనే ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది. ఇక ఆ బంధంలో ఉండలేక ఆమె ఒబెరారుతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కవి, రచయిత డోమ్ మోరేస్‌ను వివాహం చేసుకుంది. కానీ అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి. ఆమె జీవితం పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయింది. ఇతడు కూడా లీల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఈ బంధం కూడా ఆమెను ఎంతో కాలం మొరిస్ తో కలిపి ఉంచలేకపోయింది. చివరికి ఇతనితో కూడా విడాకులు తీసుకుంది. వ్యక్తిగత జీవితంలో ఇంత సంఘర్షణకు గురవుతూ కూడా వెండితెరపై ఆమెకు ప్లేన్‌గా కనిపించడం ఎలా సాధ్యమైందో అర్థం కాదు. రెండు విఫలమైన వివాహాలు, పిల్లలను అదుపులో ఉంచుకోవడంలో ఆమె చెందిన వైఫల్యం ఆమెను ముక్కలు చేసింది. ఆమె ఒక రకంగా తనది విఫల జీవనం అన్న భావనలో కుంగి పోయింది. చివరికి మిగిలిన ఒంటరితనంతో పోరాడటానికి, ఆమె లండన్‌లోని జిడ్డు కష్ణమూర్తి తాత్విక బోధనలలో ఓదార్పు పొందింది. తరువాత, లీలా నాయుడు చివరి చిత్రం ప్రదీప్ కష్ణన్ దర్శకత్వం వహించిన ‘ఎలక్ట్రిక్ మూన్’ (1992) వచ్చింది. ముంబైలోని కొలాబాలో ఏకాంత జీవితాన్ని గడిపుతూ 2009 జూలై 28న మరణించిందామె. వెండితెర వెలుగు నీడలలో మౌనరాగాల నిశ్శబ్ద జీవన గీతంలా లీలా నాయుడు జీవితం ముగిసిపోయింది.
(వ్యాసకర్త సినీ చరిత్ర పరిశోధకుడు)
– హెచ్ రమేష్ బాబు, 7780736386



