కలిగంజ్ నుంచి బరిలో సబీనా యాస్మిన్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు పోరుకు సిద్ధం
కొల్‌కతా : త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ సోమవారం 192 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. వీరిలో పార్టీ అనుభవజ్ఞులతో పాటు యువ నాయకులకు కూడా చోటు లభించింది. అలాగే ఈ తొలి జాబితాలో 17 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ జాబితాలో అతిముఖ్యంగా చెప్పుకోవాల్సింది నదియా జిల్లాలోని కలిగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా సబీనా యాస్మిన్‌ను బరిలోకి దింపడం. గతేడాది జూన్‌లో టీఎంసీ గూండాల దాడిలో సబీనా యాస్మిన్ కుమార్తె, తొమ్మిదేండ్ల తమన్నా ఖాతున్ మృతి చెందింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిందనే అక్కసుతో సబీనా యాస్మిన్ నివాసంపై టీఎంసీ గుండాలు బాంబులతో దాడి చేయడంతో తమన్నా అక్కడిక్కడే మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అలాగే, మహిళా యువనేత మీనాక్షి ముఖర్జీ ఉత్తరపరా నుంచి, దుమ్‌దుమ్ ఉత్తర్ నుంచి దిప్సితా ధార్‌ను సీపీఐ(ఎం) పోటీలో నిలిపింది. జాదవ్‌పూర్ నుంచి కొల్‌కతా మాజీ మేయర్ బికాష్ రంజన్ భట్టాచార్య, రాణిబంధ్ నుంచి సీనియర్ మైనార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కూడా డెబ్లినా హెంబ్రామ్ వంటి ప్రముఖులు తొలి జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థుల్లో ఉన్నారు. లెఫ్ట్‌ఫ్రంట్‌లో సీపీఐ(ఎం)తో పాటు, సీపీఐ, సీపీఐ(మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్‌ఎఫ్), ఆల్-ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఎఐఎఫ్‌బీ), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌సీపీఐ), మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ (ఎంఎఫ్‌బీ) ఉన్నాయి. వీటిలో తొలిజాబితాలో ఎఐఎఫ్‌బీ 19 స్థానాల నుంచి అభ్యర్థులను నిలిపింది. సీపీఐ 12 స్థానాల నుంచి, ఆర్‌ఎస్‌పి 11 స్థానాల్లో నుంచి పోటీ చేస్తోంది.
ఎంఎఫ్‌బీ ఒక్క స్థానం నుంచి, ఆర్‌సీపీఐ ఒక్క స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి. ఈ తొలి జాబితాలో 148 స్థానాల నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తొలిజాబితాలో సీపీఐ(మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్, ఐఎస్‌ఎఫ్‌లు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. అలాగే, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఎజెయూపీ) కూడా సీపీఐ(ఎం)తో చర్చలు జరుపుతోంది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో లెఫ్ట్‌ఫ్రంట్‌తో ఆ పార్టీ పొత్తు కుదుర్చుకోలేదు. కాబట్టి కాంగ్రెస్, లెఫ్ట్‌ఫ్రంట్ మధ్య దాదాపు దశాబ్ధ కాలంగా కొనసాగుతున్న అవగాహన ముగిసినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.



