నవతెలంగాణ – కంఠేశ్వర్
వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహం ఎదుట సీపీఐ(ఎం), సిపిఐ, న్యూ డెమోక్రసీ, సిపిఎంఎల్ మాస్ లైన్, ఆర్.ఎస్.పి, లిబరేషన్ పార్టీల ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టంలో మార్పులను నిరసిస్తూ నిరసన ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు తీసుకొచ్చేముందు ప్రజల్లో గాని, పార్లమెంట్లో గానీ సమగ్ర చర్చ జరపకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి వి బి జి రాంజీ తీసుకురావడం ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి తగ్గి మరింత పేదరికంలోకి నెట్టబడతారని వారు విమర్శించారు.
గతంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిపి వాటి ఒత్తిడితో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మారుస్తూ నూతనంగా తెచ్చిన జీవో మూలంగా రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పెరిగి నిధుల కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ఫలితంగా గ్రామీణ ప్రజల్లో ఉపాధి తగ్గి ఆర్థికంగా కుటుంబాలు చితికి పోతాయని వారు అన్నారు. మాత్మ గాంధీ పేరు మార్చడం వలన స్వాతంత్ర సమరయోధులను కించపరచటం అవుతుందని వారు తెలిపారు. కూలీలు అధిక వేతనం పొందడం ఇష్టం లేకనే ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని కేంద్రం వాటాను తగ్గించి రాష్ట్రాలపై భారాలు మోపటానికి పూనుకున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆ చట్ట సవరణను ఉపసంహరించుకొని వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని కల్పించడానికి అదేవిధంగా రోజుకు రూ.600 కూలీ చెల్లించటానికి కేంద్ర ప్రభుత్వం నిధులను పెంచాలని వారు డిమాండ్ చేశారు.
లేనియెడల బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వివరిస్తూ బిజెపి విధానాలను ఎండగడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అన్వర్, ఆర్ఎస్పీ నాయకులు అనిల్ లిబరేషన్ నాయకులు కాజా మొయినుద్దీన్ మరియు సీపీఐ(ఎం) నాయకులు పెద్ది వెంకట్ రాములు, వెంకటేష్, అనసూయమ్మ, అనిత, గంగాధర్ డెమోక్రసీ నాయకులు శ్రీధర్, భూమన్న, మల్లికార్జున్, మాస్ లైన్ నాయకులు సుధాకర్, నరేందర్, వెంకన్న ఆర్ఎస్పీ నాయకులు రాములు, నరేష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు.



