Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి

- Advertisement -

శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభానికి ముందు హైదరాబాద్‌ గన్‌ పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు ప్లకార్డులను ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించినప్పటికీ రెండున్నరేండ్లు గడిచినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని తెలిపారు. మొదటి గవర్నర్‌ ప్రసంగంలోనే ఈ హామీ ఇచ్చారని, ప్రస్తుతం ఇది మూడో గవర్నర్‌ ప్రసంగం అయినప్పటికీ గ్యారంటీల అమలుపై స్పష్టత లేదన్నారు. ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రైతు సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ సంపదను దోచుకుని.. రైతులకు వెన్నుపోటు పొడుస్తూ రాహుల్‌ గాంధీకి వెయ్యి కోట్లు కప్పం కడుతున్నారని ఆరోపించారు. రైతులకు రైతుబంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పింఛన్ల సొమ్ము పెంపు, మహాలక్ష్మి పథకం మాట మరిచి మహిళలను నట్టేట ముంచారని కేటీఆర్‌ విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకుండా విపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు సుమారు రూ.10 వేల కోట్ల మేర ఉన్నాయని, వాటి విడుదలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో లోపాలు ఉన్నాయని తెలిపారు. అన్ని అంశాలపై బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజల తరపున సమాధానాలు కోరుతామని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ నిరసన నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -