Friday, April 3, 2026
E-PAPER
Homeఆటలుఎన్వోసీ కోసం న్యాయ పోరాటం

ఎన్వోసీ కోసం న్యాయ పోరాటం

- Advertisement -

శ్రీలంక క్రికెట్‌ బోర్డుపై నువాన్‌ దావా

కొలంబో : శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) బోర్డుపై ఆ దేశ క్రికెటర్‌ నువాన్‌ తుషార కోర్టుకెక్కాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడాల్సిన నువాన్‌ తుషార.. ఎస్‌ఎల్‌సీ నుంచి ఇప్పటివరకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) అందుకోలేదు. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక పేలవ ప్రదర్శన కారణంగా విదేశీ టీ20ల్లో ఆడే క్రికెటర్లు ఫిట్‌నెస్‌ పరీక్ష పాస్‌ కావాలనే నిబంధన తీసుకొచ్చారు. ఫిట్‌నెస్‌ పరీక్షలో నువాన్‌ తుషార ఫెయిల్‌ కాగా.. అతడికి ఎన్వోసీ నిరాకరించారు. ఐపీఎల్‌ 2026 మార్చి 28న ఆరంభం కాగా.. అప్పటికే తుషార ఎన్వోసీని రెండు సార్లు బోర్డు తిరస్కరించింది. దీంతో శ్రీలంక క్రికెట్‌పై నువాన్‌ తుషార న్యాయస్థానంలో దావా వేశాడు. శ్రీలంక క్రికెట్‌తో వార్షిక కాంట్రాక్టు మార్చి 31, 2026న ముగియగా.. ఆ తర్వాత బోర్డు నిబంధనలు తనకు వర్తించవని నువాన్‌ తుషార న్యాయస్థానంలో పిటిషను దాఖలు చేశారు.

ఎన్వోసీ నిరాకరించి, తన జీననోపాధిని దెబ్బతీస్తున్నారని పిటిషనులో నువాన్‌ తుషార వాపోయారు. ఈ పిటిషను ఏప్రిల్‌ 9న విచారణకు రానుంది. శ్రీలంక క్రికెట్‌ అధ్యక్షుడు షమ్మి సిల్వ, కార్యదర్శి బందుల డిస్సానాయకె, కోశాధికారి సుజీవలను తుషార ప్రతివాదులుగా పేర్కొన్నారు. విదేశీ లీగ్‌ల్లో ఆడే క్రికెటర్లు తమ దేశ క్రికెట్‌ బోర్డు నుంచి ఎన్వోసీ తీసుకోవటం తప్పనిసరి చేస్తూ ఐసీసీ రూల్స్‌ ప్రవేశపెట్టింది. కానీ ఎన్వోసీ జారీకి పాటించాల్సిన రూల్స్‌ను ఐసీసీ నిర్దేశించలేదు. శ్రీలంక క్రికెట్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలో ఐదు అంచెలు ఉన్నాయి. 2 కిమీ రన్‌, 20 మీటర్ల స్ప్రింట్‌, 5-0-5 ఏజిలిటీ టెస్టు, స్కిన్‌ఫోల్డ్‌ టెస్టు, కౌంటర్‌ మూవ్‌మెంట్‌ జంప్‌ (సిఎంజె) అందులో భాగం. ఈ ఐదింటికి గరిష్టంగా 29 పాయింట్లు ఉండగా.. 17 పాయింట్లు సాధిస్తే ఫిట్‌నెస్‌ పరీక్షలో పాసైనట్టు. తుషార ఈ పరీక్ష పాసవలేదు. గతంలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ శంషి సైతం ఆ దేశ క్రికెట్‌ బోర్డుతో ఎన్వోసీ వివాదంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తుషార మార్చి 31తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఆలోచనలో ఉండగా.. ఈ కేసుపై క్రికెటర్లలోనూ ఆసక్తి కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -