న్యాయవాదులతో టీజీజేఎల్‌ఏ చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో క్రమబద్ధీకరణ అయిన అధ్యాపకుల హక్కుల పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల సంఘం (టీజీజేఎల్‌ఏ-475) నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లో హైకోర్టు న్యాయవాది జీవీఎల్ మూర్తి, టీజీజేఎల్‌ఏ గౌరవ సలహాదారు అందె సత్యం ఆధ్వర్యంలో అన్ని విషయాలపై చర్చించింది. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ట్రాల్లో పీజీ చేసిన వారి విషయంలో వారికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటిని ఎదుర్కోవడానికి న్యాయవాదుల బృందం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎవరూ అధైర్యపడొద్దని కోరారు. క్రమబద్ధీకరణ కాని కాంట్రాక్టు అధ్యాపకుల విషయంలో ఈ మధ్యకాలంలో వచ్చిన సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పులపైనా చర్చించామని పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ అయిన అధ్యాపకులకు వ్యతిరేకంగా హైకోర్టులో కొంత మంది వేసిన కేసులో ఇంప్లీడ్ అయ్యామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పటిష్టంగా కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ లెక్చరర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఉదయభాస్కర్, సునీల్ నవీన్, ఇతర నాయకులు, డిగ్రీ, ఒకేషనల్ కాంట్రాక్టు అధ్యాపక నాయకులతోపాటు ఆశ్రమ పాఠశాలల సీఆర్టీల సంఘం గౌరవ లీగల్ సలహాదారు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.