Tuesday, December 30, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుచట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీక

చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీక

- Advertisement -

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : ఉప ముఖ్యమంత్రి భట్టి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శాసన మండలి, శాసనసభ రెండు చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, మంత్రులపై ఉంటుందని చెప్పారు. సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్‌ అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలనీ, పారదర్శకంగా, వేగంగా మంత్రులకు, సభ్యులకు సమాచారం అందించాల్సి ఉంటుందని వివరించారు. సోమవారం శాసనసభ ప్రాంగణంలోని మొదటి సమావేశ మందిరంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబుతో కలిసి సీనియర్‌ అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ అత్యంత ప్రజాసామికంగా సభ జరపాలంటూ ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచన చేస్తున్నదనీ, ప్రజలకు, సభ్యులకు జవాబుదారీగా ఉండాలన్న దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశాలకు మంత్రులు చాలా సీరియస్‌గా ప్రిపేర్‌ అయి వస్తున్నందున అధికారులు కూడా అందుకు అనుగుణంగా పూర్తి సమాచారంతో సభలు జరిగినన్ని రోజులు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు అత్యంత పవిత్రమైనవనీ, ఈ సభకు వచ్చే సభ్యులు గొప్ప ఆశయాలు, లక్ష్యాలతో వస్తున్నారన్న విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలని సూచించారు.

ప్రజలకు ఏదో మేలు చేయాలన్న తపనతో ప్రతి సభ్యుడు సభకు వస్తారనీ, ప్రజల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదో ఒక సమాధానం రాబట్టాలన్న ఆలోచనలతో సభ్యులు ఉంటారు కాబట్టి అధికారులు అన్ని ప్రశ్నలకూ పారదర్శకంగా, పూర్తి సమాచారంతో సభకు హాజరై మంత్రులకు తాను వెంటనే సమాచారం ఇచ్చి సభ ద్వారా సంతృప్తికర సమాధానాలు వెళ్లేలా అధికారులు అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సభ జరిగే సమయంలో లైవ్‌ ప్రసారాల ద్వారా సభను రాష్ట్రంలోని ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నవారు ఆసక్తిగా చూస్తారనీ, బయట ప్రభుత్వం ఎంత విజయవంతంగా పరిపాలన అందిస్తుందో అదే తరహాలో సభలోనూ ప్రతిభను చూపాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. అందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఉభయ సభలకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ధ్రువపరుచుకోకుండా మీడియాలో ఇష్టారీతిన ప్రచురణ లేదా ప్రసారం చేస్తే అది చట్టసభల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పారు. సమావేశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన సమాచారంపై సమాచార శాఖ అధికారులు పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

చట్టసభల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచేలా సభలు నిర్వహిద్దాం : శ్రీధర్‌బాబు
చట్టసభల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచేలా ఉభయ సభలు నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందనీ, అందుకు అధికారుల నుంచి సంపూర్ణ సహకారం ఉండాలని ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అధికారులకు సూచించారు. ప్రతిరోజు ఉదయాన్నే మీడియాలో వచ్చిన వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి సభ్యులు ప్రశ్నలు లేవనెత్తితే మంత్రులు సమాధానం ఇచ్చేందుకు పూర్తి సమాచారంతో సభలో అందుబాటులో ఉండాలని కోరారు. జీరో అవర్‌లో సభ్యుల ప్రశ్నలకు అవసరమైన సమాధానాలు అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధం చేయాలని సూచించారు.

పెండింగ్‌ నివేదికలు, హామీలకు సంబంధించిన అంశాల పూర్తి సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. అసెంబ్లీ, మండలి కార్యదర్శులు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, శాసనమండలి కార్యదర్శి నరసింహచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి, సీనియర్‌ అధికారులు వికాస్‌రాజ్‌, దానకిషోర్‌, జయేష్‌ రంజన్‌, రఘునందన్‌రావు, శ్రీధర్‌, నదీమ్‌ అహ్మద్‌, శైలజ రామయ్యర్‌, యోగితారానా, లోకేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -