- తక్షణమే స్పందించి భక్తులకు రక్షణ కల్పించాలి
– మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నవతెలంగాణ ఆర్మూర్
పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్దుల గుట్టపై చిరుత పులి సంచారం తీవ్ర కలకం సృష్టించింది. సిద్ధులగుట్టపై చిరుతపులి సంచరిస్తున్నట్లు గమనించిన కొందరు ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో భక్తులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అటవీశాఖ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి చిరుతపులి కదలికలు కనిపెట్టాలని, పులిని బంధించి అడవిలో వదిలేలా చర్యలు తీసుకుని భక్తులకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా చిరుతపులి సంచారం పై సంబంధిత అధికారులు ప్రకటన చేసే వరకూ సిద్దులగుట్టపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని జీవన్ రెడ్డి సూచించారు.
