Tuesday, July 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుతక్కువ పని గంటలు..ఎక్కువ ఉత్పత్తి

తక్కువ పని గంటలు..ఎక్కువ ఉత్పత్తి

- Advertisement -

జపాన్‌లో నాలుగు రోజుల పని
40 శాతం పెరిగిన ఉత్పాదకత
మైక్రోసాఫ్ట్‌ ప్రయోగం 92 శాతం ఉద్యోగుల సంతృప్తి
నవ తెలంగాణ – బిజినెస్‌ డెస్క్‌

సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి చెందిన దేశాలు తమ కార్మికులు, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గిస్తుంటే.. దీనికి భిన్నంగా భారత్‌లో కార్మికులపై పని గంటలను మరింత పెంచుతూ బానిసలను చేసే ప్రయోగాలు ముమ్మరం చేస్తున్నారు. జపాన్‌లో దిగ్గజ ఐటి కంపెనీ మైక్రోసాఫ్ట్‌ పని గంటల తగ్గింపు ప్రయోగంతో భారీగా ఉత్పత్తి పెరిగింది. మైక్రోసాఫ్ట్‌ 2019 ఆగస్టులో ”వర్క్‌-లైఫ్‌ ఛాయిస్‌ ఛాలెంజ్‌ సమ్మర్‌ 2019” అనే ప్రయోగాన్ని జపాన్‌లో నిర్వహించింది. ఇందులో ఉద్యోగులకు వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేసింది. ఐదవ రోజు పైగా చెల్లింపు సెలవుగా ఇచ్చింది. ఈ ప్రయోగం 2,300 మంది ఉద్యోగులపై నిర్వహించబడింది. ఫలితంగా ఉత్పాదకత 40 శాతం పెరిగింది. ఇది ”లెస్‌ టైమ్‌, మోర్‌ అవుట్‌పుట్‌ (తక్కువ సమయం, ఎక్కువ ఉత్పత్తి)” సూత్రాన్ని రుజువు చేసింది. ఈ కార్యక్రమం జపాన్‌లోని సుదీర్ఘ పని గంటల సంస్కృతిని సవాలు చేయడానికి రూపొందించింది. ఇక్కడ ”కరోషి” (అధిక పని వల్ల మరణం) ఒక తీవ్రమైన సమస్యగా ఉండటంతో మైక్రోసాఫ్ట్‌ ఈ కొత్త విధానాన్ని ప్రయోగించింది.


సమావేశాలకు కోత..
దిగ్గజ ఐటి కంపెనీ మైక్రోసాఫ్ట్‌ ప్రయోగ వివరాలు.. ఉద్యోగులకు శుక్రవారాలు సెలవు ప్రకటించారు. అలాగని వారి జీతంలో ఎటువంటి కోత పెట్టలేదు. సమావేశాలను 30 నిమిషాలకు పరిమితం చేశారు. ఆన్‌లైన్‌ సమావేశాలను ప్రోత్సహించడం ద్వారా పని సామర్థ్యాన్ని మెరుగుపరిచారు. ఫలితంగా సమావేశాల సంఖ్య 46 శాతం తగ్గింది. ఉద్యోగులు పనిలో ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. సగటు ఉద్యోగి ఉత్పాదకత, అమ్మకాలు 39.9 శాతం పెరిగింది. విద్యుత్‌ వినియోగం 23.1 శాతం తగ్గింది. కాగితం ముద్రణ 58.7 శాతం తగ్గడంతో పర్యావరణ ప్రయోజనాలు పెరిగాయి.


ఉద్యోగుల్లో సంతోషం..
మైక్రోసాఫ్ట్‌ చేపట్టిన ఈ ప్రయోగంలో 92.1 శాతం మంది ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పని వారాన్ని ఇష్టపడినట్లు తెలిపారు. ఇది వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ను మెరుగుపరిచింది. ఈ విధానం ఉద్యోగుల మానసిక ఒత్తిడిని తగ్గించింది.


అదే బాటలో ఇతర కంపెనీలు..
జపాన్‌లో సాంప్రదాయకంగా ఎక్కువ పని గంటలు, అధిక పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. 2016 గణాంకాల ప్రకారం.. జపాన్‌లో 20 శాతం ఉద్యోగులు వారానికి 49 గంటలకు పైగా పని చేసేవారు. ఇది అమెరికా పని గంటలతో పోల్చితే 16 శాతం, ఫ్రాన్స్‌లోని పని గంటలతో పోల్చితే 12 శాతం ఎక్కువ. పని ఒత్తిడితో ఆత్మహత్యలు చోటు చేసుకునేవి. దీంతో అక్కడి ప్రభుత్వం 2019లో ”వర్క్‌ స్మైల్‌ రిఫార్మ్‌” చట్టాలను అమలు చేసింది. ఓవర్‌టైమ్‌ను పరిమితం చేయాలని, సెలవులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్‌ జపాన్‌ ఈ ప్రయోగాన్ని శాశ్వతంగా అమలు చేయడానికి పరిశీలిస్తోంది. ఇతర జపనీస్‌ కంపెనీలు కూడా ఈ మోడల్‌ను అనుసరించాలని భావించాయి. ఈ ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు నాలుగు రోజుల పని వారాన్ని పరీక్షించడానికి ప్రేరణగా నిలిచాయి. ఇది ఉత్పాదకత, ఉద్యోగుల శ్రేయస్సును మెరుగుపరుస్తుందని చూపింది.


భారత్‌లో బానిస వ్యవస్థకు బాటలు..
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు కార్మికులు, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గిస్తుంటే భారత్‌లోని మోడీ సర్కార్‌ భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. ఇక్కడి బీజేపీ ప్రభుత్వం కార్మికులపై మరింత పని గంటలు, భారం పెంచి బానిసలుగా మార్చే విధానాలను ప్రవేశపెట్టడం ఆందోళనకరం. సాధారణంగా శాస్త్ర, సాంకేతిక పురోగతి మూలంగా 8గంటల పని, 7గంటలు, 6గంటల పనిదినంగా మారాలి. దీనికి భిన్నంగా 10, 12, 14 గంటలంటూ సమయాన్ని పెంచే కుయుక్తులు జరుగుతున్నాయి. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి వంటి వారు ఏకంగా వారానికి 70గంటలు పనిచేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ పరిణామాలు 8 గంటలు పని విధానం హక్కును గుంజుకునే ప్రయత్నాల్లో భాగమేనని కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళనకు దిగుతోన్న విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -