Wednesday, January 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపాఠం నేర్వరా?

పాఠం నేర్వరా?

- Advertisement -

హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం మరోసారి నగర భద్రతా వ్యవస్థలోని లోపాలను మరోసారి బయటపెట్టాయి. గతేడాది మేలో బేగంబేజార్‌లోని గుల్జార్‌హౌస్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది చిన్నారులతో సహా పదిహేడు మంది నిండు ప్రాణాలను బలిగొంది. తాజాగా నాంపల్లిలోని ఫర్నీచర్‌షాపు భవన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు అగ్నికి అహుతయ్యారు. ఇది రెండో ఘటన. ఈ ప్రమాదాలు చూపించిన మూలకారణాలు నిర్లక్ష్యం, నియంత్రణా లోపం, ప్రభుత్వం, అధికారుల బాధ్యతారాహిత్యం.
నాంపల్లి ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదం వాణిజ్యకార్యకలాపాలు సాగుతున్న భవనంలో చోటుచేసుకుంది. విద్యుత్‌ వైర్‌ల లోపాలు, ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్ల లేమి, అత్యవసరంగా వెళ్లేమార్గాల మూసివేత, భవన నిర్మాణ లోపాలు వంటి అంశాలతో ప్రమాద తీవ్రతను పెంచింది. అందుకే శనివారం ఉదయం మొదలైన మంటలు ఆదివారం ఉదయానికిగానీ అదుపులోకి రాలేదు. సహాయక చర్యలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. బేగంబజార్‌లోని గుల్జార్‌ హౌస్‌లో జరిగిన ప్రమాదంలో ఇరుకైన గల్లీలు, అక్రమ నిర్మాణాలు, గోదాములు, దుకాణాలు ఒకే భవనంలో ఉండటం, అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోవడంలో ఎదురైన అవరోధాలు సహాయక చర్యలను తీవ్రంగా ఆలస్యం చేశాయి. వ్యాపారుల జీవితాలే బూడిదయ్యాయి. ఇలాంటివి నగరంలోనూ, చుట్టుపక్కల జరిగిన అగ్నిప్రమాదాలెన్నో. ఎన్నో విలువైన వందల ప్రాణాలు కోల్పోవల్సి వస్తోంది. సిగాచీ కంపెనీలో కార్మికుల ఆఖరిచూపునకూ నోచుకోలేదు.

”అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది” అనే ఒకే ఒక వాక్యంతో ముగుస్తున్నా.. ఇలాంటి ప్రమాదాలు యాధృచ్ఛికంగా జరగడం లేదు. వ్యవస్థాపక లోపాలు, మౌలిక సదుపాయాల కొరత, సమిష్టి బాధ్యతలో ఉన్న వైఫల్యాల కారణంగా పదేపదే సంభవి స్తున్న దుస్థితికి ఇవి నిదర్శనం. ఫైర్‌సేఫ్టీ అనుమతులు కేవలం కాగితాలకే పరిమితం కావడం, భవనాల అనుమతులు ఇచ్చే సమ యంలో తనిఖీలు జరగకపోవడం, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోకుండా తూతూమంత్రంగా వ్యవహరించడం మరిన్ని ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ పెద్దలు, ఉన్నాతాధికారులు హడావిడి చేయడం, మీడియా ఎదుట గంభీరమైన ప్రకటనలు చేయ డం ఎన్నో ఏండ్లుగా సాగుతున్న తంతు. ఇదే అక్రమార్కులకు అవకాశమైంది. ప్రతి ప్రమాదం తర్వాత కమిటీలు, నివేదికలు వస్తున్నా, వాటి సిఫార్సులు అమలు అంతంతమాత్రమే.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వాణిజ్యీకరణ, జనసాంద్రత పెరుగు తోంది. అయితే దానికి తగ్గట్టుగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారింది. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు, ఆస్పత్రులు, పరిశ్రమలు, గోదాములు, కట్టెల దుకాణాలు అగ్ని ప్రమాదాలకు అధికంగా గురవుతున్నాయి. ఫైర్‌ సేఫ్టీ అనుమతులు తీసుకోకపోవడం, తీసుకున్నా వాటిని అమలు చేయకపోవడం, అత్యవసర మార్గాలను మూసివేయడం, నాణ్యత లేని ఎలక్ట్రిక్‌ వైరింగ్‌ వాడటం వంటి అంశాలు ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తిస్తున్నారు. ఆ దిశగా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఘటన తర్వాత దాని గురించి చర్చే ఉండకపోవడం గమనార్హం. అదేవిధంగా ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ వద్ద సరిపడా సిబ్బంది, ఆధునిక పరికరాలు లేకపోవడం కూడా ఒక కారణం. ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ను ఆధునికీకరిం చడం, స్పందన వేగాన్ని పెంచడం అత్యవసరం.

నాంపల్లి, బేగంబజార్‌ అగ్నిప్రమాదాలు హైదరాబాద్‌కు ఇచ్చిన స్పష్టమైన హెచ్చరికలు. ఇవి చివరిగా మిగలాలంటే, మాటలకన్నా చేతలు అవసరం. అగ్నిప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోని నగరం, అదే ప్రమాదాలను మళ్లీ మళ్లీ ఎదుర్కోవాల్సిందే. సురక్షితమైన నగరంగా నిలపాలని ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దలు ప్రజల ప్రాణభద్రతే కేంద్రంగా అభివృద్ధి ఆలోచనలు సాగినప్పుడే హైదరాబాద్‌ నిజమైన సురక్షిత నగరంగా మారగలదు. అగ్నిభద్రతకు సంబంధించిన నియమాలు, నిబంధనలు, నిపుణుల సూచన లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కావలసింది ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిల నుండి సాధారణ పౌరుల వరకు అందరిలో నిబద్ధత, చట్టాలను పటిష్టంగా అమలు చేసే సంకల్పం. అదేవిధంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు ఇచ్చే నష్టపరిహారం చెల్లించే విషయంలో మీనవేషాలు అక్కర్లేదు. రూ. రెండు లక్షలో, ఐదు లక్షలో కాదు. ఎక్కువ మొత్తంలో పరిహారం అందించి ఆ కుటుంబాలకు భద్రత కల్పించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -