Friday, September 12, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినేపాల్‌ నేర్పుతున్న పాఠాలు!

నేపాల్‌ నేర్పుతున్న పాఠాలు!

- Advertisement -

హిమాలయ ప్రాంత దేశమైన నేపాల్‌లో సోమవారం నాడు పిడుగుపాటు మాదిరి జడ్‌ తరం యువత ఆగ్రహ జ్వాలకు అక్కడి ప్రభుత్వమే కూలిపోయింది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం చొరవ తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. సంపాదకీయం రాసిన సమయానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి, తాజా ఆందోళనల వెనుక ఉన్నట్లు చెబుతున్న ఖాట్మండు స్వతంత్ర మేయర్‌ బాలెన్‌ షా, విద్యుత్‌రంగ నిపుణుడు కుల్మాన్‌ ఘీషింగ్‌ పేర్లు ముందుకు వచ్చాయి. ఒకరినే నియమిస్తారా లేక ముగ్గురితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్నది స్పష్టం కాలేదు. సామాజిక మాధ్యమాలపై కెపి శర్మ ఓలీ ప్రభుత్వం విధించిన ఆంక్షలకు వ్యతిరేకత పేరుతో వీధుల్లోకి వచ్చిన యువత ఆగ్రహం అనేక అవాంఛనీయ పరిణామాలకు దారితీసింది. ఇప్పటి వరకు 31 మంది మరణించినట్లు, ఆరువందల మందికి పైగా గాయపడినట్లు వార్త లొచ్చాయి. మాజీ ప్రధాని జల్నాద్‌ ఖనాల్‌ సతీమణి రాజ్యలక్ష్మిని మూకలు హత్య చేయటం తీవ్రమైన ఘటన. వాటి వెనుక ఎలాంటి సంఘటిత సంస్థలేదు అని చెబుతున్నప్పటికీ జరిగిన ఘటనలను చూస్తే అదృశ్యశక్తి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు, బంగ్లాదేశ్‌ ప్రధాని నివాసాలు, పార్లమెంట్లపై జరిగిన దాడుల్లాగే నేపాలీ యువత కూడా అదే పనిచేసిందని కొందరు చెప్పినదాని ప్రకారం చూసినప్పటికీ సోమవారం నాటి పరిణామాల వెనుక ఒక శక్తి ఉందన్నది స్పష్టం. ఎవరు ఏమిటి, ఎందుకనే మధనం జరుగుతున్నది. ఇప్పటివరకైతే నిర్దిష్ట సమాచారం లేదనే చెప్పాలి. ఆ వివరాలు ఎలా ఉన్నప్పటికీ ఈ ఉదంతం నుంచి తీసుకోవాల్సిన గుణపాఠాలు చాలానే ఉన్నాయి.

నేపాలీ నిరంకుశ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించిన నేపాలీ కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ఆయుధాలు పట్టిన మావోయిస్టులు ఎవరెంత దోహదం చేశారనేదాన్ని పక్కన పెడితే 2008లో రాచరికాన్ని తొలగించి ఫెడరల్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌గా నేపాల్‌ అవతరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న రాచరిక వ్యతిరేక పార్టీలు, వ్యక్తులందరూ యువత, కష్టజీవుల ఆకాంక్షలను నెరవేర్చటంలో, మౌలిక మార్పులను తీసుకురావటంలో వైఫల్యం తాజా పరిణామాలకు దారితీసిందని చెప్పవచ్చు. విపరీతమైన అవినీతి, అధికారంలో ఉన్న కుటుంబాలకు చెందిన వారి భోగలాలసత, పెరుగుతున్న నిరుద్యోగం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పటికీ లాటిన్‌ అమెరికా వామపక్ష ప్రభుత్వాల వైఫల్యాలనుంచి గుణపాఠాలు తీసుకున్నట్లు కనిపించదు. ఈ కాలంలో నేపాల్‌ ప్రభుత్వ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు చైనాకు దగ్గర కావటం, యువతలో ఉన్న అసంతృప్తి, ప్రభుత్వాల వైఫల్యాలను విదేశీ శక్తులు ముఖ్యంగా అమెరికా వినియోగించుకోవటంలో సఫలమైనట్లు ప్రస్తుతానికి కనిపిస్తున్న దాన్ని బట్టి చెప్పవచ్చు.

భారత్‌, చైనాలను దెబ్బతీసేందుకు, సిక్కింను ఒక స్వతంత్ర రాజ్యంగా మార్చి పాగా వేసేందుకు ప్రయత్నించిన అమెరికాను 1970వ దశకంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ వమ్ము చేసి మనదేశంలో ఒక రాష్ట్రంగా విలీనం చేశారు. అప్పటి నుంచి నేపాల్‌ మీద అమెరికా కన్నుపడింది. భౌగోళికంగా నేపాల్‌కు ఉన్న ప్రాధాన్యతను బట్టి అటు చైనా ఇటు మనదేశం, బయటి నుంచి అమెరికా కూడా తమ ప్రభావం చూపేందుకు నిరంతరం ప్రయత్నించటం బహిరంగ రహస్యం. ప్రభుత్వాల వైఫల్యాలను ఆసరా చేసుకొని గతకాలపు రాచరిక వ్యవస్థను తీసుకురావాలని మితవాదశక్తులు ప్రయత్ని స్తున్నాయి. మరోవైపు గోముఖ వ్యాఘ్రం మాదిరి అమెరికా తన అనుకూల శక్తులను ప్రతిష్టించేందుకు చూస్తున్నది. ఈ రెండూ కూడా యువత ఆకాంక్షలను నెరవేర్చేవి కాదు.
గాయకుడు, రచయితగా ప్రాచుర్యమై ఖాట్మండు మేయర్‌గా గెలిచిన బాలెన్‌ షాను తదుపరి ప్రధానిగా ముందుకు తెస్తున్నారని వార్తలు. అతగాడు పక్కా భారత వ్యతిరేకి. గతేడాది చివరిలో అమెరికా రాయబారి డీన్‌ ఆర్‌ థాంప్సన్‌తో భేటీ అయిన తర్వాత తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అతగాడు ప్రధానిగా గద్దెనెక్కితే పశ్చిమదేశాల కనుసన్నల్లో పని చేసే బంగ్లాదేశ్‌ నేత మహమ్మద్‌ యూనిస్‌ లేదా ఉక్రెయిన్‌ తోలుబొమ్మ జెలెన్‌స్కీ మాదిరి మారవచ్చనే అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. అందువలన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు తమ వైఫల్యాల నుంచి పాఠాలు తీసుకొని తిరిగి యువత, యావత్‌ కష్టజీవులకు దగ్గరకావటం, వారిలో విశ్వాసాన్ని పాదుకొల్పే నూతన కార్యాచరణకు పూనుకోవటం తప్ప మరొక ప్రత్యామ్నాయం కనిపించటం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -