Monday, March 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభగత్‌ సింగ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం

భగత్‌ సింగ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం

- Advertisement -

అమెరికా ఏది చెప్తే అదే అన్నట్టు వ్యవహరిస్తున్న మోడీ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
పటాన్‌చెరు నుంచి బీరంగూడ కమాన్‌ వరకు బైక్‌ ర్యాలీ

నవతెలంగాణ-పటాన్‌చెరు
భగత్‌ సింగ్‌ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడంతోపాటు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. భగత్‌ సింగ్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక్‌ భవన్‌ నుంచి బీరంగూడ కమాన్‌ వరకు తలపెట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చుక్కరాములు మాట్లాడుతూ.. భగత్‌ సింగ్‌ 23 ఏండ్ల వయస్సులోనే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ధీరుడని చెప్పారు. ప్రజా భద్రత చట్టం, పారిశ్రామిక వ్యవహారాల చట్టాలు రెండూ ఆనాడు ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి వచ్చాయని, వాటికి నిరసనగా భగత్‌ సింగ్‌ పార్లమెంటులో పొగబాంబు విసిరాడని గుర్తు చేశారు. పార్లమెంటులో భారత ప్రజానీకానికి ఎవరికీ ప్రాణ నష్టం జరగకూడదన్న ఉద్దేశంతోనే పొగ బాంబు వేశారన్నారు. భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుకుదేవ్‌ ముగ్గురూ గొప్ప స్వాతంత్య్ర ఉద్యమ వీరులని కొనియాడారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. ప్రపంచంలో అమెరికా- ఇజ్రాయిల్‌ కలిసి ఇరాన్‌ మీద పెద్దఎత్తున యుద్ధం చేస్తూ మారణ హోమం సృష్టిస్తున్నాయని అన్నారు. యుద్ధం విషయంలో మన దేశ ప్రధానమంత్రి మోడీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అమెరికా- ఇజ్రాయిల్‌ కలిసి ఇరాన్‌లోని పాఠశాలలపై బాంబులు విసరడంతో దాదాపు 1,000 మందికిపైగా విద్యార్థులు మృతిచెందడంపై ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశ విదేశాంగ విధానంలో అమెరికా తలదూర్చడటం ఏంటని ప్రశ్నించారు.

దేశానికి గతంలో ఇరాన్‌ నుంచి పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ సరఫరా అయ్యేదని, ప్రస్తుతం అమెరికా ఏది చెప్తే అదే అన్నట్టు ట్రంప్‌ కనుసన్నల్లోనే ప్రధాని మోడీ నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు భగత్‌ సింగ్‌ కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని, భగత్‌ సింగ్‌ ఆశయాల కనుగుణంగా పోరాడాలని ప్రజానీకానికి పిలుపుని చ్చారు. అందుకోసం ఎర్రజెండా నాయకత్వంలో ప్రజా ఉద్యమాలను మరింతగా బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.రాజయ్య ఏ.మాణిక్యం, పటాన్‌చెరు డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి.నాగేశ్వరరావు, ఎండి వాజిద్‌ అలీ, పి.పాండురంగారెడ్డి, బి.పెంటయ్య, జి.జార్జ్‌, బి.అర్జున్‌, సత్తిబాబు, ఎస్‌.సురేష్‌ కుమార్‌, జె.పోచయ్య, జయరాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -