Saturday, March 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుయుద్ధోన్మాది అమెరికా చర్యలను ఖండిద్దాం

యుద్ధోన్మాది అమెరికా చర్యలను ఖండిద్దాం

- Advertisement -

శాంతి చర్చలే… దేశాల అభివృద్ధికి ఆనవాళ్లు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
దాడిని వ్యతిరేకిస్తూ విక్టోరియా బ్లాంకెట్‌ హాల్‌ నుంచి ర్యాలీ, నిరసన
నవతెలంగాణ-వనపర్తి

ప్రపంచ పోలీసుగా తనకు తానే ప్రకటించుకుని యుద్ధోన్మాదిగా వ్యవహరిస్తున్న అమెరికా చర్యలను యావత్‌ భారత దేశ ప్రజలంతా ఖండించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజనగరంలోగల విక్టోరియా సెమినార్‌ హాల్‌లో సీపీఐ(ఎం) నాయకులు బాల్‌రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ వనపర్తి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ బీకర దాడిని ఖండిస్తూ వనపర్తి పట్టణంలోని విక్టోరియా బ్లాంకెట్‌ హాల్‌ నుంచి భగీరథ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన అధ్యక్షులు ట్రంప్‌ ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలపై సహజ వనరుల దోపిడీ కోసం ఏకంగా యుద్ధాలను ప్రకటిస్తుండటం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు.

ఇటీవల కాలంలో మిత్ర దేశాలతోనూ శత్రుత్వాలు పెంచుకునేలా వ్యవహరిస్తూ సమాజంలో యుద్ధ వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నారని తెలిపారు. వెనిజులా అధ్యక్షులు మధురో, ఆయన భార్య అరెస్టు మరవకముందే ఇరాన్‌పై దాడిచేసి ఆ దేశ సుప్రీం లీడర్‌ ఖమేనీని హత్య చేశారని అన్నారు. అయినా ఇజ్రాయిల్‌, అమెరికాను ఎదురొడ్డుతూ వారి బెదిరింపులకు లొంగక ధైర్యంగా యుద్ధ ట్యాంకులతోనే ఎదుర్కొంటున్న ఇరాన్‌కు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు. దేశంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోతూ ఇరాన్‌పై దాడిని ఖండించడం లేదని విమర్శించారు. దేశంలో గతంలో ఉన్న ఉపాధి హామీ చట్టానికి కేంద్రం 90 శాతం నిధులను కేటాయిస్తే రాష్ట్రం 10 శాతం నిధులను కేటాయించి నిరుపేదలైన కూలీలకు పనులు కల్పించేదని జాన్‌వెస్లీ అన్నారు.

కానీ నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీఆర్‌ఏఎం జీ తో రాష్ట్రం 40శాతం నిధులు, కేంద్రం 60శాతం నిధులు కేటాయించాలని ఉందని అన్నారు. పైగా ఈ నిబంధనలో రాష్ట్రాలు తమ నిధులు ఖర్చు చేశాకే కేంద్రం భరించాల్సిన 60 శాతం నిధులను విడుదల చేస్తుందని పేర్కొనడం అత్యంత దారుణమన్నారు. ఇలాంటి నిబంధనలతో ఉపాధి హామీ నిర్వీర్యానికి కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర గ్రామంలో జాతరలో పెత్తందారులు హత్య చేసిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జబ్బార్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. రాజు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -