Sunday, April 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకులాన్ని నిర్మూలిద్దాం... సమసమాజాన్ని నిర్మిద్దాం

కులాన్ని నిర్మూలిద్దాం… సమసమాజాన్ని నిర్మిద్దాం

- Advertisement -

– పలువురు వక్తల పిలుపు
– ఎస్వీకే-టీపీఎస్‌కే ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మానవహారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కులాన్ని నిర్మూలిద్దామనీ, సమసమాజాన్ని నిర్మిద్దామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే), తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్‌కే) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో మానవహారం నిర్మించారు. కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుల, మత రహిత వివాహాలు చేసుకున్న ఆదర్శ దంపతులు పాల్గొన్నారు. ‘చేయి చేయి కలుపుదాం… కుల నిర్మూలన మానవహారాన్ని నిర్మిద్దాం’అని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ మాట్లాడుతూ దేశంలో కులం ఉన్నంతకాలం అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితం అవుతుందని చెప్పారు. సామాన్యులకు అభివృద్ధి ఫలాలు అందబోవని అన్నారు. ప్రతిభకు విలువ ఉండబోదన్నారు. కులానికి గుర్తింపు ఉన్నచోట ప్రగతి ఉండదని అన్నారు. రాజకీయ, ఆర్డిక, సామాజిక, సాంస్కృతిక రంగాలతోపాటు ఐటీ, తినే తిండి, కట్టే బట్టలోనూ కులం ఇమిడి ఉందని వివరించారు. శ్మశానం వద్ద, దేశ జీడీపీలోనూ కూడా కులం ఉందన్నారు. దేశ అధోగతికి మూలం కులమేనని అన్నారు. కులాన్ని కూకటివేళ్లతో పెకిలించకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు విమలక్క మాట్లాడుతూ రేపటితరం ప్రశ్నించకముందే అందరం కులాన్ని ప్రశ్నించాలని అన్నారు. కులాన్ని వదులుదాం మనుషులుగా బతుకుదాం అని ఆమె పిలుపునిచ్చారు. కులాన్ని కూల్చే వరకు పాట, ఆట ఆగబోదని స్పష్టం చేశారు. టీపీఎస్‌కే అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో నెల్సన్‌ మండేలా నల్లజాతి చైతన్యం ఎలా తెచ్చారో ఇక్కడ కుల వ్యతిరేక చైతన్యం తేవడం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. మనుస్మృతి చీకట్లను ఎదిరించిన ఫూలే, అంబేద్కర్‌ కలలుగన్న నవసమాజం నిర్మించడమే ఏకైక లక్ష్యమని అన్నారు. ఉమ్మడి లక్ష్యం కోసం కలిసొచ్చే ప్రజా, సామాజిక సంఘాలతో ముందుకుపోతున్నామని వివరించారు. కులం శ్రమ విభజన మాత్రమే కాకుండా శ్రామికులను విభజిస్తున్నదని చెప్పారు. కులగోడల్ని కూల్చడమే లక్ష్యమన్నారు. సాంస్కృతిక ప్రతిఘటన చేస్తామని అన్నారు. ఆట,పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, జీఎంపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌, ఎస్వీకే ప్రతినిధులు జి బుచ్చిరెడ్డి, ఎన్‌ సోమయ్య, సుజావతి, నో క్యాస్ట్‌ ఇండియా ప్రతినిధి విప్లవ్‌, డీబీఎఫ్‌ నేత శంకర్‌, కుల నిర్మూలన సంఘం నాయకులు వాహిద్‌, గుత్తా జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -