వర్షాకాలంలో తరచూ కురిసే వానలతో వాతావరణం చల్లగా మారిపోతుంటుంది. దీనివల్ల చాలా మంది జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అయితే, ఈ కాలంలో అనారోగ్యం బారిన పడడానికి వాతావరణ మార్పులే కాకుండా.. మనం తీసుకునే ఆహారం కూడా కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ సీజన్‌లో ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి..
వేయించిన ఆహార పదార్థాలు :
ఈ సీజన్‌లో ఆయిల్‌లో వేయించిన ఫుడ్ ఐటమ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే.. వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందుకే ఆయిల్‌లో ఫ్రై చేసిన పదార్థాలు తినడం వల్ల ఈజీగా జీర్ణంకావు. దీనివల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అందుకే వానాకాలంలో నూనెతో చేసిన పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.
స్ట్రీట్ ఫుడ్ వద్దు!
ఎక్కువ మంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బయట దొరకే చాట్, పానీపూరీ, కట్‌లెట్, పావ్‌బాజీ.. వంటి పదార్థాలు తినడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ, వీటి తయారీలో కలుషితమైన నీరు ఉపయోగిస్తే.. విరేచనాలు, పచ్చకామెర్లు.. వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, వీలైతే ఇంట్లోనే చేసుకుని తినడానికి ప్రయత్నించండి. అలాగే పండ్ల రసాలు కూడా ఇంట్లోనే చేసుకుంటే మంచిది.
ఆకు కూరలు బాగా కడగాలి!
మార్కెట్లో ఆకుకూరలు నేరుగా భూమిలోంచి తీసి కట్టలు కట్టి అమ్ముతుంటారు. వాటిపై మట్టిలోని క్రిములు, పురుగులు చేరతాయి. కొన్నిసార్లు ఆకుల రంగులోనే కలిసిపోయిన ఈ పురుగులు కూడా ఉంటాయి. అందుకే ఒక్కో ఆకు పరిశీలించాకే తరుక్కోవాలి. అలాగే ఆకులను బాగా కడిగిన తర్వాత వండుకోవాలి.
ఎప్పటికప్పుడే కట్ చేసుకోవాలి :
కొంతమంది ఆఫీసులకు వెళ్లే మహిళలు కూరగాయలు, పండ్లు ముందురోజు రాత్రే కట్ చేసుకొని పెట్టుకుంటారు. అయితే వర్షాకాలంలో ఇలా చేయకూడదు. ఎందుకంటే కట్ చేసుకొని పెట్టుకున్న పండ్లు, కాయగూరల ముక్కల్ని ఎంత జాగ్రత్తగా భద్రపరచినా.. ఈ సీజన్‌లో వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల వాటిపై బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలొస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడే కట్ చేసుకోవడం మంచిది.
ఈ జాగ్రత్తలు పాటిద్దాం..
- Advertisement -
- Advertisement -