Monday, April 6, 2026
E-PAPER
Homeజాతీయంక్యూబాకు అండగా నిలబడదాం

క్యూబాకు అండగా నిలబడదాం

- Advertisement -

సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ

”అమెరికా నుంచి తీవ్రమైన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎదుర్కొంటున్న క్యూబాకు విరాళాలిచ్చి, సంఘీభావం ప్రకటించి, అండగా నిలబడాలని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈమేరకు విడుదల చేసిన ప్రకటనను దిగువన ఇస్తున్నాం.
”కేవలం కోటి జనాభా కలిగిన చిన్న దేశం క్యూబా… తనకు లొంగడం లేదని కక్షగట్టి ఆరు దశాబ్దాలుగా కత్తులు దూస్తోంది అమెరికా. ఇరాన్‌ తర్వాత క్యూబాపైనే దాడి అని బెదిరిస్తోంది. అమెరికా ప్రభుత్వం క్యూబా విప్లవయోధుడు ఫైడల్‌ కాస్ట్రోను చంపడానికి 638 సార్లు కుట్ర చేసి విఫలమైంది. బొలీవియాలో చేగువేరా, చిలీలో అలెండీ, ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌, లిబియాలో గడాఫీలను చంపింది. ఆప్ఘనిస్తాన్‌ను సర్వనాశనం చేసింది. ఇటీవల వెనుజులా అధ్యక్షుడు మదురో దంపతులను ఎత్తుకుపోయింది. ఇప్పుడు ఇజ్రాయిల్‌తో కలసి ఇరాన్‌పై యుద్ధం చేస్తోంది. వారి సుప్రీం లీడర్‌ ఖొమైనీని హత్య చేసింది. త్వరలో గ్రీన్‌లాండ్‌, లెబనాన్‌పై యుద్ధం అంటోంది. ఇరాన్‌ యుద్ధం తర్వాత సోషలిస్టు క్యూబాను స్వాధీనం చేసుకుంటామని బరితెగించి ప్రకటించింది. ఆయా దేశాలకు అణ్వాయుధాలు, టెర్రరిస్టులు, మాదకద్రవ్యాల ముద్రలు వేసి ప్రపంచాన్ని నమ్మబలికించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దుర్మార్గం వెనుక ఆయిల్‌ సంపదను, సహజ వనరులను స్వాధీనం చేసుకోవడమే అసలు రహస్యం.

కాస్ట్రో నాయకత్వంలో చిన్న కరేబియన్‌ దేశం సోషలిస్టు క్యూబా అనేక విజయాలు సాధించింది. విద్య, వైద్య రంగాల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. అమెరికా సామ్రాజ్యవాద దురహంకారానికి, హెచ్చరికలకు తలవంచ లేదు. స్వాభిమానంతో ధైర్యంగా తన సార్వభౌమాధికారాన్ని కాపాడు కుంటూ వస్తోంది. అలీనోద్యమానికి భారతదేశంతో కలిసి నాయకత్వం వహించింది. మన దేశానికి నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి కష్టమొచ్చినా ఆ చిన్న దేశం నుంచి వందల సంఖ్యలో డాక్టర్లు వెళ్ళి సేవలందించారు. కరోనా సమయంలో అనేక దేశాలకు వైద్యసేవలు, వ్యాక్సిన్లు అందించింది. అటువంటి పరోపకారి క్యూబాపై అమెరికా ఆంక్షలు పెట్టి లొంగదీసుకోవాలని విఫలయత్నం చేస్తోంది. ఇపుడు వెనుజులా, రష్యా, మెక్సికోల నుంచి క్యూబాకు వచ్చే చమురును అడ్డుకుంటోంది. ఫలితంగా క్యూబాను ప్రస్తుతం చీకటి అలుముకుంది. ఆసుపత్రుల్లో వైద్య సేవలకు, శస్త్ర చికిత్సలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పుట్టిన పసిపిల్లలు సైతం గిలగిలలాడాల్సిన దుస్థితి! పాఠశాలలు, కర్మాగారాలు, మంచినీటి సరఫరా, వ్యవసాయం, ప్రజా రవాణా స్తంభించిపోతున్నాయి. తీవ్ర ఆహార కొరత, మందుల కొరత ఏర్పడింది. ఇండియాతో సహా 185 దేశాలు అమెరికా ఆంక్షలను నిరసిస్తున్నా అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఏ మాత్రం మానవత్వం లేదు.
పాలస్తీనాలో 70 వేల మంది మరణానికి, ఇపుడు ఇరాన్‌లో వేల మంది మరణానికి కారణమౌతున్న అమెరికా యుద్ధోన్మాదం వల్ల మన దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, స్టీల్‌, సిమెంట్‌ సహా అన్ని ధరలు పెరిగిపోయాయి. చిన్న హోటళ్ళ, వీధి వ్యాపారాలు ఆగిపోయాయి. భవిష్యత్‌లో మరిన్ని ఒడిదుడుకులుంటాయి. ధాన్యం, అరటి, రొయ్యలు, కోడిగుడ్లు, మొక్కజొన్న, పొగాకు, పత్తి, పండ్లు ఎగుమతులు ఆగిపోయి, ధరలు పడిపోయి రైతులు దెబ్బతింటున్నారు.

విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న క్యూబాకు సహాయం అందించడం, ఆదుకోవడం మనందరి మానవతా కర్తవ్యం. ప్రపంచానికే సాయం చేసిన చేతులకు కష్టకాలంలో స్నేహహస్తం అందించడం, సాయం చేయడం మన విధి. ఒక దేశం కష్టాల్లో ఉంటే ఆదుకోవడం మన బాధ్యత. అమెరికా వల్ల కష్టాల్లో ఉన్న క్యూబా కోసం మనం నిలబడితే మానవత్వం నిలబడుతుంది. తలవంచని క్యూబా ఊపిరి నిలుస్తుంది. ఆక్సిజన్‌ అందక గిలగిలలాడుతున్న పసి ప్రాణాలు నిలబడతాయి. చేతనైన సాయం చేద్దాం. మానవాభివృద్ధిలో ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న క్యూబాకు అండగా నిలుద్దాం. అమెరికా దుశ్చర్యలను నిరసిద్దాం. క్యూబా సంఘీభావ నిధికి విరాళాలివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -