Sunday, December 28, 2025
E-PAPER
Homeకవర్ స్టోరీనూతన మనిషిగా మారదాం...

నూతన మనిషిగా మారదాం…

- Advertisement -

కాలం నిరంతరం చలనంలో ఉండటంతో పాటు, ముందుకు సాగుతూనే ఉంటుందన్నది ఎంత సత్యమో, కాలం ఎవ్వరి కోసం కాసేపు కూడా ఆగదన్నది అంతే సత్యం. కాలంతో పాటు మన జీవన పయనం ఎలా సాగుతున్నది అన్నది మాత్రం, మన ఆలోచనలు, ఆచరణలు మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు ఆ రోజుకి కావాల్సిన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వటంలో ఎంతటి కీలక పాత్రను పోషిస్తుందో, నూతన సంవత్సరం కూడా అంతే. కొత్త సంవత్సరం… ఇది కేవలం కేలండర్‌లో ఏటా మారే కాలమానం కాదు. ఇది మనలో ఒక కొత్త ఉదయం, ఒక కొత్త ఆశ, ఒక కొత్త ఆలోచనలని జాగతం చేసుకునే శక్తివంతమైన కాలం.

గడిచిపోయిన కాలాన్ని భవిష్యత్‌ కాలాన్ని సుసంపన్నం చేసుకోడానికి ఉత్ప్రేరకంగా మార్చుకోవాలి. రోజులు, సంవత్సరాలు మారటం అన్నది కాలగమనంలో వచ్చే మార్పులకి సంకేతం. మార్పు అనేది ఒక్క రోజుతో సాధ్యమయ్యేది కాదు, రోజువారీ లక్ష్యాలను చేరుకోడానికి మన జీవన విధానంలో మనం చేసుకునే మార్పులే పెనుమార్పుకు దోహాదపడతాయి. రోజులాగే నూతన సంవత్సరం మన జీవితంలో నూతన అధ్యయనానికి వేదిక మార్చుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. నూతన సంవత్సరం అనేది మన లక్ష్యాలను పునర్విమర్శించే సమయం. విద్య, వ్యక్తిత్వ వికాసం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ, రాజకీయం రంగం ఏదయినా సరే, ఈ కొత్త సంవత్సరం మనల్ని మనం పునర్నిర్మించుకోడానికి ఒక నూతన అవకాశంగా భావించాలి. దాని కోసం మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన తరుణమిది.



నూతన సంవత్సరం రాగానే చాలా మంది రానున్న రోజుల్లో చేయాల్సిన మంచి విషయాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకుంటారు. కొత్త ఏడాదిలో రోజూ వ్యాయామం చేయాలని, మంచి పుస్తకాలు చదవాలని, మంచి మంచి ప్రదేశాలు సందర్శించాలని ఎన్నెన్నో అనుకుంటారు. కానీ వాటిని ఆచరణలో పెట్టేది మాత్రం చాలా తక్కువ. సమయం సరిపోవటం లేదన్న సాధారణ సాకుతో చాలామంది తమ ప్రణాళికలను పక్కన పెట్టేస్తారు. అనుకున్నవి సాధించడానికి చాలా శ్రమ పడాలని మరికొందరు వారి ఆలోచనల్ని అటకెక్కిస్తారు. నిజానికి ధీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ప్రణాళికలు అమలు చేయటం కోసం తాత్కాలిక ఆనందాలను ఇచ్చే వాటిని పక్కన పెట్టగల సామర్ధ్యం లేకపోవటమే ప్రధాన కారణమని ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు జేమ్స్‌ ఎడుయార్డో అంటారు. అదేవిధంగా ఏర్పరచుకున్న ప్రణాళికల్ని ఖచ్చితంగా అనుకున్న సమయానికి అమలు చేయటం కూడా ప్రధానమే. దీనికి సమయపాలన అనేది చాలా ముఖ్యం. జీవితంలో దేన్ని అయినా తిరిగి సాధించగమేమో కానీ, గడిచిన పోయిన కాలాన్ని మనం తిరిగి పొందలేమన్నది మాత్రం వాస్తవం. రోజుకు మీ జీవితంలో 30 నిమిషాలు వధా చేస్తే సంవత్సరానికి 182 గంటలు విలువైన ఉత్సాదక సమయాన్ని మీరు కోల్పోయినట్లే. ఈ రకంగా ఏడాదికి ఎంత సమయాన్ని వధా చేసుకుంటున్నారో లెక్కగట్టండి. సమయంతో పాటు డబ్బు కూడా చాలా విలువైంది. వధా ఖర్చులు తగ్గించుకుని మదుపు వైపు ఆలోచనలు సారించండి. ఏఏ అంశాలకు ఎంత ఎంత ఖర్చు చేస్తున్నామన్నది ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. మనిషి జీవితంలో సమయంలాగే డబ్బు కూడా ఎంతో విలువైన పాత్ర పోషిస్తుందనటంలో ఎటువంటి సందేహాం లేదు. డబ్బును ఆదా చేయడానికి కూడా ప్రత్యేక ప్రణాళికలు అవసరం. మీ ఆదాయవ్యయాలకు అనుగుణంగా ఈ ప్రణాళికలను మీరు రూపొందించుకోండి.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను చేరుకోడానికి పనిచేసే ఉత్సాహాం. సంకల్పం ఉంటే సరిపోదు. వాటిని సాధించడానికి తగినంత నైపుణ్యాలను కూడా సంపాదించుకోవాలి. ఉదాహారణకి అనేక మందితో చర్చించి, అందుబాటులో ఉన్న సమాచారాన్ని అంతా విశ్లేషించి మనకి ఇష్టమైన ఒక కారు కొంటాం. కానీ మనకి కారు నడపటం రాకపోతే, డ్రైవర్‌ వచ్చేంత వరకు అది మన కారు గ్యారేజీ దాటి బయటకి రాదు. అదే మనకి కారు నడిపే నైపుణ్యం ఉంటే, కారు అందించే ఆనందాన్ని పూర్తిగా పొందవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ దైనందిన జీవితానికి కావాల్సిన కనీస నైపుణ్యాలను సంపాదించుకోడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. ఈ కొత్త ఏడాది నుండి ఏదో ఒక కొత్త పని చేయటమే. బంధాలు, భాందవ్యాలు మార్కెట్‌ వస్తువులుగా మారిపోతున్న తరుణంలో తిరిగి ఆ బంధాలను పునరుద్ధరించుకోవటం ఎంత ముఖ్యమో, వాటికి ధీటుగా మనల్ని మనం సమాయత్తం చేసుకోవటం అంటే ముఖ్యం. కొన్ని వ్యాపకాలు, కొన్ని జ్ఞాపకాలు వాటి చుట్టూ అల్లుకుని సాగే జీవితం మనకి మాత్రమే సొంతమైన జీవితం ఉంటుంది. దాన్ని ఆస్వాదించడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. మీరు కలలు కంటున్న జీవితాన్ని జీవించడానికి వయసు మీద పడే దాకా ఎదురు చూడకండి. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు పరిస్థితులు అన్నీ మనకి అనుకూలంగా ఉండాలని పొరపడకండి. కొత్తగా ఏ పనిని ప్రారంభించాలన్నా తక్షణమే మొదలు పెట్టండి. ఏదైనా పనిని మొదలు పెట్టడానికి మొదటి అత్యుత్తమ సమయం నిన్నటి రోజు.. రెండో అత్యుత్తమ సమయం ‘ఇప్పుడే’.



మనల్ని ఉత్తేజితుల్ని చేసే అంశాలపైనే ఎక్కువగా దష్టి సారించండి. చిన్న చిన్న అంశాలకు నిరాశా, నిస్పహాలకి లోనయితే సమస్యలని ఎదుర్కొనే మానసిక బలం తగ్గిపోతుంది. జీవితంలో ఏ సందర్భంలోను మానసిక బలాన్ని కోల్పోకూడదు. అధిగమించని సమస్యలంటూ జీవితంలో ఏవీ ఉండవని తెలుసుకుంటే చాలు, వాటి నుండి బయట పడడానికి దారులు కనిపిస్తాయి. సమస్యలు లేని మనిషంటూ ఆ లోకంలో ఎవరూ ఉండరు. కానీ సమస్యలు సష్టించే అడ్డంకుల్ని అధిగమించి ముందుకు సాగిన వారే విజేతలుగా, మిగిలిన వారికి దారిదీపాలుగా మారతారు. అననుకూల పరిస్థితుల్లో సర్వం కోల్పోయినా చిగురించే లక్షణాన్ని కోల్పోని చెట్టుని ఆదర్శంగా తీసుకోవాలి. అకాలంలో ఆకులన్నీ రాలిపోయి, మోడుగా మారినా అది నిటారుగా నిలబడి తిరిగి పునర్జీవం పొందుతుంది. అననుకూల పరిస్థితుల్లో బెదిరిపోకుండా, తిరిగి మంచి కాలం కోసం ఎదురు చూసే తత్వాన్ని మనం చెట్టు నుండి మనం అలవాటు చేసుకోవాలి. జంతువుల్లో కూడా ఈ లక్షణం ఉంది. అననుకూల పరిస్థితుల్లో అన్ని జీవనక్రియల స్థాయిని తగ్గించుకోని, దాదాపు నిర్జీవ స్థితిని చేరుకుంటాయి. జీవనక్రియలకి సంబంధించిన అన్ని వనరుల లభ్యత తగ్గిపోయినప్పుడు, మళ్లీ తిరిగి వనరులు పుష్కలంగా లభించేంత వరకు ఈ రకమైన స్థితిలో జీవులు జీవిస్తాయి. పని చేయటమే. జీవులు అనుసరించే ఈ స్థితిని ‘సుప్తావస్థ’ అంటారు. తిరిగి అనుకూల పరిస్థితులు రాగానే మనం విజయం వైపు అడుగులు వేయాలి.

మనిషి లోకంలో ఎంత మంది మధ్య ఉన్నా, ఏకాకి గానే బతుకుతాడు. అందరి మధ్యలో ఉన్నా తనలో తానే సంభాషిస్తాడు, తనకు తానుగా సంతోషిస్తాడు. ఆ సంభాషణను, ఆ సంతోషాలను మరింత విస్తతం చేసుకోడానికి మనకి మనం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఎంత మంది చుట్టూ ఉన్నా మనకంటూ ఒక లోకం ఉండాలి. ఆ లోకంలో మనదైన ఒక జీవితం ఉండాలి. ఆ జీవితం మిగిల్చిన అనుభూతులు, మనకి మాత్రమే సొంతమైన కొన్ని జ్ఞాపకాలు, అని అందించే ఆనందాలు అన్నీ కలగలిసి ఉండాలి. వాటిని మదిలో మదింపు చేసుకోడానికి, అవి మిగిల్చిన ఆర్తిని తడిమి చూసుకోడానికి కాసింత ఏకాంతం కావాలి. ప్రతీ సందర్భంలోంచి మనల్ని మనం వెతుక్కోడానికి ఒక ప్రయత్నం కూడా కావాలి. జీవితము అన్ని ఇవ్వదు అన్నది ఎంత వాస్తవమో, ఇచ్చినవన్నీ మనకి నచ్చినవి కాదు అన్నది వాస్తవం. అందుకే జీవితం అందించిన ఆ కొన్ని జ్ఞాపకాలనైనా పదిలపరుచుకోడానికి మనకంటూ ఒక రోజను, కాసింత సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడే జీవితంలో మరిన్ని మధుర క్షణాలను పోది చేసుకోగలుగుతాము. మనల్ని మనం ప్రేమించుకోవటం ఎప్పటి నుండి మొదలు పెట్టాలి.. మనకు నచ్చినట్టు జీవిచటం ఎక్కడి నుండి మొదలు పెట్టాలి.. ఏ వయస్సులో ప్రారంభించాలి అనే సవాలక్ష ప్రశ్నలకి ఒక్కటే సమాధానం ‘ఇప్పుడే’. ఈ క్షణం నుండే మీకు మీరు కొంత సమయాన్ని, కొంత ఏకాంతాన్ని ఏర్పరచుకోండి. అప్పుడే మీకు నచ్చినట్టు మీకోసం మీరు జీవిస్తారు. కారు, సొంత ఇల్లు, పదోన్నతి వంటి కోరికలతోనో, వస్తువులతోనో మీ సంతోషాలను లెక్కగట్టటం మానుకోండి. ఆనందమనేది మనకి మనం మాత్రమే అనుభవించే ఒక స్వీయ మాససిక అలౌలికానందస్థితి. దాన్ని పొందడానికి ఏ వస్తువు, ఏ డబ్బు అవసరం లేదని తెలుసుకోండి.

ఎప్పుడూ పచ్చగా ఉండే పరిసరాలు జీవితాలకు కొత్త ఉత్తేజాన్ని అందిస్తాయి. మానవునితో పాటు సష్టిలోని సమస్త జీవరాశులకు జీవన చైతన్యాన్ని అందించేది ప్రకతే. జీవ పరిణామ క్రమంలో ఎంతో ఉదాత్తమైన పాత్రను పోషిస్తున్న పర్యావరణాన్ని కాపాడి, భావి తరాలకు భద్రంగా అందించాల్సిన భాద్యతను గుర్తెరిగి పర్యావరణ హిత జీవన శైలిని అలవరుచుకోవాలి. ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు కాకుండా జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. ప్రకతి రమణీయతను ఆస్వాదించడానికి కొత్త ప్రదేశాలను సందర్శించండి. ప్రకతి మనకు తెలియని అనేక అంశాలను తెలియచేస్తుంది, జీవుల పట్ల ప్రేమను పెంపొదింప చేస్తుంది. ప్రతీరోజూ ప్రశాంతంగా ఉండే పచ్చని ప్రదేశాల్లో వాకింగ్‌ చేయండి. మీకు నచ్చిన ప్రదేశాలను తరుచుగా సందర్శించండి. భారతదేశం అనేక వైరుధ్యాలు, వైవిధ్యాలు కలిగిన దేశం. ఆయా కాలాలకి అనుగుణంగా అనంతమైన అనుభూతులు మిగిల్చే అనేక సుందర ప్రదేశాలు, సందర్శనీయ స్థలాలు అనేకం ఉన్నాయి. ఈ కొత్త మీ అభిరుచికి తగిన విధంగా కొన్ని ప్రదేశాలు సందర్శించుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి.
పుస్తకాలు మానవ మస్తిష్కాలకు ప్రియమైన నేస్తాలు అంటారు. మనకు తెలియని అనేక అంశాలను, వివిధ ప్రాంతాలకు చెందిన వింతలను, విశేషాలను మనకు తెలియచేయటంతో పాటు మనల్ని మనం మరింత విస్తత పరుచుకోడానికి పుస్తకాలు దోహదపడతాయి. మన కళ్ల ముందు కదలాడుతున్న జీవితాలను ఇతివత్తాలుగా రచించిన పుస్తకాలు మానవ జీవన గమనంలోని అనేక పార్వ్శాలను విప్పి చెప్పడానికి దోహాదపడతాయి. అందుకే ఈ కొత్త సంవత్సరం పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోండి. పుస్తక పఠనం వల్ల మానసిక వికాసమే కాకుండా, మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయి.

కదిలే కాలం అడుగుల సవ్వడే సంవత్సరాలుగా జీవితాలను లెక్కగడుతున్న తరుణంలో మన జీవితాల్లోకి మరొక కొత్త సంవత్సరం అడుగుపెట్టబోతుంది. మానవ జీవితమంటే గతం, వర్తమానాల మేలు కలయికే. గతం ఇచ్చిన అనుభూతులను, ఆనందాలను జ్ఞాపకాలుగా, అదే సమయంలో గతం చేసిన గాయాలను తడుముకుంటూ, అది మిగిల్చిన విషాదాలను మోసుకుంటూ ముందుకు సాగటమే జీవితం. గతం, భవిష్యత్తు ఇవి రెండూ మన చేతిలో ఉండవు. కానీ మనం జీవిస్తున్న వర్తమానం మన చేతుల్లోనే ఉంటుంది. మనకు నచ్చినట్టు మనం ఈ వర్తమానంలో జీవించడానికి ఈ కొత్త సంవత్సరం వేదికగా మలుచుకోవాలి. కొత్త సంవత్సరమంటే క్యాలెండర్‌లో మారే తేదీ మాత్రమే కాదు, మన ఆకాంక్షలకి, కలలకీ అనుగుణంగా మన జీవితాన్ని అందమైన రంగులతో చిత్రికరించుకోడానికి సిద్ధంగా ఉన్న ఒక అందమైన కాన్వాస్‌. రోజులన్నీ ఒకేలా ఉండనట్టే… జీవితాలు కూడా ఒకేలా ఉండవు. కలలు, కన్నీళ్లు, ఆశలు, నిట్టూర్పులు, గెలపులు, అనుభవాలు, పోరాటాలు, విషాదాలు అన్ని కలిస్తేనే జీవితము. అనుభవాలు మిగిల్చిన అనుభూతులు నుండి విషాదరేవులు దాటుకుంటూ ఆనంద తీరాలను చేరుకోవటమే మనం ఇప్పుడు చేయాల్సింది. కాలంతో పోటీ పడి పరుగులు తీసే జీవితాలకు కొన్ని మెరుపు తళుకులని, కొన్ని ఆనంద తరకల్ని అద్దుకోవాల్సిన తరుణమిది. రండి.. ఈ నూతన సంవత్సరం నాడు మన జీవితాలను మరింత సుసంపన్న చేసుకోడానికి వడివడిగా అడుగులు వేద్దాం..

డా|| కె. శశిధర్‌, 94919 91918

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -