సాయంత్రం సమయంలో చాలా మందికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. ఎక్కువ మంది మిర్చీ బజ్జీలు, పునుగులు, వడలు వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే పిల్లలు మాత్రం కాస్త వెరైటీ కావాలని పేచీ పెడతారు. అలాంటప్పుడు చాట్ వంటివి ఇంట్లోనే చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. అలాంటి రకరకాల చాట్‌లను ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం…
మసాలా కార్న్ చాట్
కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ గింజలు – రెండు కప్పులు, పసుపు – పావు టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, బటర్ – అర టీస్పూను, జీలకర్ర పొడి – పావు టీస్పూను, కారం – పావు టీస్పూను, చాట్ మసాలా – పావు టీస్పూను, బ్లాక్ సాల్ట్ – పావు టీస్పూను, క్యారెట్ – ఒకటి, కీరాదోస – చిన్న ముక్క, క్యాప్సికం – పావు భాగం, ఉల్లిగడ్డ – ఒకటి(చిన్నది), టమాటా – ఒకటి(చిన్నది), అల్లం ముక్క – చిన్నది, పచ్చిమిర్చి – ఒకటి, కొత్తిమీర – కొద్దిగా.
తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నాలుగు కప్పుల నీరు పోసి మరిగించుకోవాలి. అందులో కార్న్ గింజలు వేసుకోవాలి. ఆపై అందులోకి పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలి. కార్న్ సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ గిన్నెలోకి నీటిని వడకట్టాలి. ఇప్పుడు చాట్‌లోకి అవసరమయ్యే ఉల్లిగడ్డ, క్యాప్సికం, కీరా, టమాటా, పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్, అల్లంపై పొట్టు తీసేసి సన్నగా తురుమి పక్కన ఉంచాలి. మిక్సింగ్ బౌల్‌లోకి ఉడికించిన చాట్ వేసుకోవాలి. అందులోనే బటర్, కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కారం, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డ, క్యారెట్, క్యాప్సికం, టమాటా, పచ్చిమిర్చి, కీరా, అల్లం, కొత్తిమీర తరుగు వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా కార్న్‌చాట్ రెడీ.
కట్ మిర్చీ బజ్జీ చాట్
కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిర్చి – 15, శనగపిండి – రెండు కప్పులు, బియ్యప్పిండి – నాలుగు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి తగినంత, వాము – రెండు టేబుల్ స్పూన్లు, వంటసోడా – అరటీస్పూను, ఉల్లిగడ్డ – రెండు(మీడియం సైజ్‌వి), కొత్తిమీర తరుగు – కొద్దిగా, కారం, ఉప్పు – కొద్దిగా, చాట్ మసాలా – రెండు టీస్పూన్లు, నిమ్మకాయ – ఒకటి.
తయారీ విధానం: ముందుగా బజ్జీ మిర్చీని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. మిర్చీల చివర్లు కొద్దిగా కట్ చేశాక వాటిని వన్ సైడ్ మధ్యలోకి చాకుతో కట్ చేసి లోపల ఉన్న గింజలను తీసేయాలి. ఇప్పుడు వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యప్పిండి, రుచికి తగినంత ఉప్పు, వాము, కొద్దిగా వంటసోడా, పసుపు వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అవసరం మేరకు తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అయితే పిండి దోశల పిండి కంటే కాస్త గట్టిగానే ఉండేలా చూసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. వేడయ్యాక మంటను తగ్గించి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బజ్జీ మిర్చీని కలిపి పెట్టుకున్న పిండిలో ముంచి కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి. కాసేపు కాలనిచ్చి అటు ఇటు తిప్పేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో అవి 70శాతం వేగే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత బజ్జీలను అర అంగుళం నుంచి అంగుళం గ్యాప్‌లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని నూనెలో వేసి మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా మారేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఆవిధంగా బజ్జీ ముక్కలను వేయించుకున్నాక వాటిని ఒక వెడల్పాటి ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత వాటిల్లో వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు, కొద్దిగా ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకోవాలి. ఇక చివరగా నిమ్మరసం పిండి అవన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు.
బఠాణీ చాట్
అవసరమైన పదార్థాలు: కప్పు – తెల్ల బఠాణీలు, ఒకటి – మీడియం సైజ్ ఆలూ, అరటీస్పూన్ – పసుపు, టేస్ట్‌కి సరిపడా – ఉప్పు, రెండు టేబుల్ స్పూన్లు – నూనె, టీస్పూన్ – జీలకర్ర, మూడ్నాలుగు – పచ్చిమిర్చి, టీస్పూన్ – అల్లం పేస్ట్, ఒకట్రెండు – ఉల్లిగడ్డలు, టమాటా – ఒకటి, అరటీస్పూన్ – కారం(తగినంత), టీస్పూన్ – చాట్ మసాలా, టీస్పూన్ – ధనియాల పొడి, అరటీస్పూన్ – జీలకర్ర పొడి, టీస్పూన్ – ఆమ్‌చూర్ పొడి, అరటీస్పూన్ – గరంమసాలా, అరటీస్పూన్ – బ్లాక్ సాల్ట్(ఆప్షనల్), నిమ్మరసం – అర చెక్క, కొద్దిగా – సన్నని కొత్తిమీర తరుగు.
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో తెల్ల బఠాణీలను(ఎండు బఠాణీలు) తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 12 గంటలపాటు నానబెట్టుకోవాలి. చాట్ తయారు చేసే ముందుకు అందులోకి అవసరమైన ఆలూను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ గిన్నె తీసుకొని అందులో బాగా నానిన బఠాణీలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలు, అరటీస్పూన్ ఉప్పు, పావుటీస్పూన్ పసుపు వేసుకున్నాక మూడు కప్పుల నీళ్లు పోసి ఒకసారి కలపాలి. కుక్కర్ మూతపెట్టి లో ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఈలోపు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిలను సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి. ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్‌లో ప్రెషర్ మొత్తం బయటకు వెళ్లిపోయాక మూత తీసి గరిటెతో కాస్త మెదుపుకోవాలి. అలాగని మరీ మెత్తగా మెదుపుకోవద్దు. అలా చేస్తే మెత్తని పేస్ట్‌లా మారి తినడానికి రుచిగా వుండదు. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. కొద్దిగా వేడయ్యాక జీలకర్ర, ముందుగా కట్ చేసుకున్న సన్నని పచ్చిమిర్చి తరుగు, అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు వేయించాలి. కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిగడ్డ తరుగు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు జత చేసి మగ్గించుకోవాలి. రుచికి తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరంమసాలా, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్‌చూర్ పొడి, బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బఠాణీల మిశ్రమం వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తగినన్ని నీళ్లను పోసుకోవాలి. చాట్ పలచగా కావాలనుకుంటే కొద్దిగా నీరు ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. మిశ్రమం మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక ఉడుకు వచ్చే వరకు వుంచాలి. అలా ఉడికించుకున్నాక ఒకసారి కలిపి చివరగా సన్నని కొత్తిమీర తరుగు చల్లుకొని, నిమ్మరసం పిండి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు.
పాలక్ చాట్
కావల్సిన పదార్థాలు: పాలకూర – మూడు కప్పులు, సెనగపిండి – అరకప్పు, పసుపు – చిటికెడు, ఇంగువ – చిటికెడు, కారం – చిటికెడు, సోంపు – చిటికెడు, వాము – పావు టీ స్పూను, ఉప్పు – తగినంత, బియ్యప్పిండి – టేబుల్ స్పూను, నీరు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, ఉల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు – చిన్న కప్పు, గ్రీన్ చట్నీ – చిన్నకప్పు, స్వీట్ చట్నీ – చిన్నకప్పు, సేవ్ – తగినంత, మెత్తగా పొడి చేసిన పూరీలు లేదా పాపడ్ – అరకప్పు, దానిమ్మ గింజలు – పావు కప్పు, చాట్ మసాలా – తగినంత, గసగసాలు – కొద్దిగా, వేయించిన జీలకర్రపొడి – తగినంత, ఉప్పు – తగినంత, నిమ్మరసం – రెండు టీ స్పూన్లు.
తయారీ విధానం: పాలకూరను శుభ్రంగా కడిగి, తడిపోయే వరకు పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి. ఒక పాత్రలో సెనగపిండి, పసుపు, ఇంగువ, కారం, జీలకర్ర పొడి, గసగసాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేసి మిశ్రమాన్ని బజ్జీల పిండిలా కలపాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పాలకూరను సెనగపిండి మిశ్రమంలో ముంచి బజ్జీల మాదిరిగా వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి తీయాలి. సర్వింగ్ ప్లేట్‌లో పాలక్ పకోడీలు వేసి, వాటి మీద గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ వేయాలి. పైన ఉల్లితరుగు, పెరుగు వేయాలి. తగినంత చాట్ మసాలా, జీలకర్ర పొడి, కారం, ఉప్పుపైన చల్లాలి. చివరగా సేవ్, పాపడ్ పొడి వేసి కొత్తిమీర తరుగు, దానిమ్మ గింజలతో అలంకరించి వెంటనే సర్వ్ చేయాలి.