మనువాదాన్ని పెంచిపోషిస్తున్న నేటి పాలనలో మహిళలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కాలరాయబడుతున్నాయి. స్త్రీలను మళ్లీ ఇంటికే పరిమితం చేయజూస్తున్నారు. లైంగిక దాడులకు గురిచేస్తున్నారు. రక్షణ కరువైన సమాజంలో బతుకుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అఖిల భారత మహాసభలు ఈ నెల 25 నుండి పోరాటాల గడ్డ తెలంగాణలో జరగబోతున్నాయి. తన భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించుకోబోతున్న ఈ సభలు జయప్రదం కావాలనీ, ఐక్యంగా మహిళా సమస్యలపై ఉద్యమిద్దామంటూ మహిళా నేతలు ఐద్వాకు అండగా నిలబడ్డాయి.
చాలా అవసరమైన సభలు ఇవి
నాకు అత్యంత ఇష్టమైన హైదరాబాద్ నగరంలో ఐద్వా ఆలిండియా మహాసభలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మహాసభలకు అత్యంత ప్రాధాన్యం వుంది. ఇప్పుడు మహిళా లోకానికి చాలా అవసరమైన మహాసభలు ఇవి. మహిళల గొంతు ఇంకా బలంగా వినిపించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంట్లోనే కాదు సమాజంలో కూడా. మనందరం కలిసి ఐక్యంగా ఉంటే అవగాహన పెంచుకోవడమే కాదు సమస్యలకు పోరాడే శక్తి కూడా వస్తుంది. ఈ మహాసభలు అలాంటి ఉత్సాహాన్ని ఇస్తాయని నమ్ముతూ మరో సారి ఐద్వాకు అభినందనలు తెలియజేస్తున్నాను. -సుహాసిని, ప్రముఖ సినీనటి.
ఐక్యంగా ఉద్యమిద్దాం
ఐద్వా జాతీయ మహాసభలు తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగరమైన హైదరాబాదులో నిర్వహించడం సంతోష దాయకం. ఒకపక్క ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, అందులో భాగంగా మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోపక్క అమెరికన్ సామ్రాజ్యవాదం తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తుంది. దేశ అధ్యక్షులనే అపహరించుకుపోతున్నారు. ఇక భారతదేశంలో కొనసాగుతున్న పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలకు ఎలాంటి హక్కులు లేకుండా పోతున్నాయి. పోరాడి సాధించుకున్న హక్కులు కూడా హరించివేస్తున్నారు. స్త్రీని వంటగదికి, సంతాన ఉత్పత్తికి, పురుషునికి సేవ చేసే సేవకురాలిగా పరిమితం చేయాలని చూస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో స్త్రీలపై అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నారు. ఇలాంటి వికృత సమాజంలో ఉన్న మనం అభ్యుదయ ఆలోచనలతో ప్రజా ఉద్యమాలు నిర్మించవలసిన అవసరం ఉన్నది.
సంప్రదాయాలు, ఆచారాల పేరుతో మహిళా శక్తిని నిర్వీర్యం చేస్తున్న కేంద్రపాలకవర్గాలపై తిరగబడాల్సిన సమయం ఇది. మనువాద భావజాలంపై, స్త్రీలపై పెరుగుతున్న హింసపై ఐక్య మహిళా ఉద్యమాలను ఉధృతం చేయవలసిన అవసరం ఉంది. ఆత్మగౌరవం, ఆర్థిక అభివృద్ధి కొరకు ఉద్యమిస్తూనే చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం. భాగ్యనగరంలో జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. దేశ నలుమూలల నుండి హాజరౌతున్న ప్రతినిధులందరికీ విప్లవ శుభాకాంక్షలు. భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తూ ఏర్పడే నూతన నాయకత్వానికి శుభాకాంక్షలు, అభినందనలు.
-నేదునూరి జ్యోతి, ప్రధాన కార్యదర్శి తెలంగాణ మహిళా సమాఖ్య ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు
ఐక్య ఉద్యమాలకై ఐద్వా కదం కదపాలి
మొట్టమొదటిసారిగా చారిత్రక హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అఖిల భారత ప్రజాస్వామిక మహిళా సంఘం (ఐద్వా) ఆలిండియా మహాసభలకు హృదయ పూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మంది రైతు మహిళలు తుపాకీ చేతబట్టి పోరాడటమే గాకుండా, అలనాటి వర్గ పోరాటాల్లో ముందు నిలిచిన వీరనారి ఐలమ్మలను కన్న నేల ఇది. సమాజం విముక్తితోనే స్త్రీ విముక్తి ముడిబడి ఉందన్న లక్ష్యం గల వామపక్ష ఉద్యమాలన్నీ ఐక్య పోరాటాలకు సిద్ధపడాల్సిన సమయంలో ఐద్వా మహాసభలు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నాను.
ఇంటా బయట సహజ వనరులను కొల్లగొట్టడానికి సామ్రాజ్యవాదులు, కార్పొరేట్ శక్తులు సృష్టిస్తున్న అధర్మ యుద్ధాల్లో ప్రధానంగా స్త్రీలు, పసిపిల్లలు బలవుతున్నారు. మన దేశంలో కార్పోరేట్ హిందుత్వ శక్తులు కూడా స్త్రీలను కుల, మత సంకెళ్లతో అదుపు చేస్తూ మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. 33 శాతం మహిళ రాజకీయ రిజర్వేషన్లు అంటూ పార్లమెంటు నిర్ణయం కూడా పితృస్వామ్య అధికారం చుట్టూ గిరికీలు కొడుతుంది. అందుకే సమాజ విముక్తి కోసం జరిగే పోరాటంలో భాగమవుతూనే అన్ని రంగాల్లో మేమెంతో మాకంత అనే సామాజిక న్యాయ పోరాటాంలోనూ మహిళల ఐక్య పోరాటాల ఆవశ్యకతకు ఈ ఆలిండియా మహాసభలు చర్చించి, తీర్మానిస్తాయని ఆశిస్తున్నాను. -అరుణోదయ విమలక్క, ప్రజా కళాకారిణి
ఐద్వా బాధ్యత మరింత పెరిగింది
ఐద్వా పట్ల మొదటి నుండి నాకు ఎంతో మమకారం. స్త్రీల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్న గొప్ప సంఘం ఐద్వా. తమ తరపున మాట్లాడే వాళ్లు లేక చాలా మంది మహిళలు ఒంటరిగా బాధపడుతున్నారు. అలాంటి వారికి ఐద్వా లాంటి సంఘం గొంతుకగా ఉంది. ఎంత సాధించినా మహిళలంటే సమాజంలో చిన్నచూపు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవరసం ఉంది. అలాగే నేడు కులాలు, మతాల పేర మనుషులను చీల్చుతున్నారు. అందులో మహిళలు ఎక్కువగా బలైపోతున్నారు. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఐద్వా కృషి మరింత పెరగాల్సిన అవసరం ఉంది.
నేను రాసే రచనలు కూడా స్త్రీల సమస్యలపైనే కాబట్టి ఐద్వా లాంటి సంఘం నన్నెంతో ఆకర్షించింది. వారు నడిపే చైతన్య మానవికి కూడా ఎన్నో వ్యాసాలు రాశాను. ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పని చేయలేకపోయినా రాతల్లో అయినా నా అభిప్రాయాలు చెప్పినందుకు కొంత తృప్తి చెందుతున్నాను. మానవిలో నేను రాసినవి చూసి కొంత మంది ప్రత్యక్షంగా వచ్చి నన్ను కలిసేవారు. అలా ఐద్వా ద్వారా కొంత మంది మిత్రులు కూడా నాకు దొరికారు. మహిళా సమస్యలపై నిక్కచ్చిగా పని చేస్తున్న ఐద్వాతో నేను ఎప్పటికీ ఉంటాను. ఐద్వా అఖిల భారత మహాసభలు జరుపుకోబోతున్న సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. -శిలాలోలిత, ప్రముఖ రచయిత్రి
ఐక్య స్వరం కావాలి
14వ మహాసభలు జరుపుకుంటున్న ఐద్వాకు అభినందనలు. ప్రారంభం నుండి దేశ వ్యాప్తంగా అనేక అంశాలపై ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఐద్వాకు ఉంది. అసంఘటిత రంగంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల మాట్లాడే సంఘం ఐద్వా అని నా అభిప్రాయం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఐద్వా పాత్ర చాలా పెరిగింది. సోషల్ మీడియా పెరిగిన తర్వాత మహిళల హక్కులు దుర్వినియోగం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఐద్వా బాధ్యత మరింత పెరిగిందని నా అభిప్రాయం. వివిధ రంగాల్లో ఉన్న మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మల్లు స్వరాజ్యం ఉన్నప్పుడు మద్య నిషేధం, సారా నిషేధం, అధిక ధరలు ఇలా ప్రతి సమస్యలపై ఆమె పులిలా గాండ్రిస్తూ తన గొంతు వినిపించేవారు.
అలాంటి ఐక్య స్వరం ఆవశ్యత నేడు చాలా ఉంది. సోషల్ మీడియాలో మహిళలపై భయంకరమైన విష ప్రచారం జరుగుతుంది. వస్త్రధారణపై, సెక్స్‌వాలిటీపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే బాధపడాల్సిన మరో విషయం ఏమిటంటే ఈ పితృస్వామ్య భావజాలంలో మహిళలు కూడా కొట్టుకుపోవడం. ఇలాంటి సమస్యలపై ఐద్వా మరింత విస్తృతంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ మహాసభల్లో అలాంటి తీర్మానాలు చేస్తారని ఆశిస్తున్నాను. నేను కానీ, మా భూమిక కానీ ఐద్వాతో ఎప్పుడూ ఉంటుంది. ఐద్వాతో కలిసి ఇప్పటికే ఎన్నో ఐక్య ఉద్యమాలు చేశాము. ఇకపై కూడా చేస్తాము. -కొండవీటి సత్యవతి, భూమిక



