కార్పొరేట్ల ప్రయోజనాలకే కేంద్రం పాకులాట
పోరాటాల తీవ్రతను పెంచుదాం : సీఐటీయూ
రాష్ట్ర మహాసభలో అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్…ప్రతినిధులకు దిశా నిర్దేశం
మెదక్ నుంచి ఎస్.వెంకన్న
దేశ, విదేశీ కార్పొరేట్ల మ్యూజిక్కుకు ప్రధాని మోడీ డ్యాన్స్ చేస్తున్నారని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఎద్దేవా చేశారు. అందుకే ఆయన వారి ప్రయోజనాలకోసం పాకులాడుతున్నారని విమర్శించారు. ధిక్కరణ, ప్రతిఘటన అనే ఆయుధాలతో అలాంటి విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా పోరాటాలను తీవ్రతరం చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. మెదక్ పట్టణంలో కొనసాగుతున్న సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభలు సోమవారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చుక్క రాములు, ఎస్వీ రమ, భూపాల్, జె మల్లిఖార్జున్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ప్రతినిధుల సభనుద్దేశించి తపన్‌సేన్ ప్రారంభోపన్యాసం చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మహాసభలో చేసిన తీర్మానాల సందేశాన్ని ప్రతి కార్మికుడికి చేరేలా తగిన ప్లాన్ చేయాలని ఆయన సూచించారు. శ్రామికులు సృష్టించిన సంపద, ఖనిజాలను ప్రభుత్వంలోని తమ ఏజెంట్ల ద్వారా కార్పొరేట్లు కారు చౌకగా దోచుకుంటున్నారని చెప్పారు. అలాంటి వారికి వ్యతిరేకంగా దేశ కార్మిక వర్గాన్ని ఐక్యం చేయటమే కర్తవ్యంగా పని చేయాలని కోరారు. ‘దేశాన్ని, ప్రజలను రక్షించుకుందాం’ అనే స్ఫూర్తితో మహాసభల్లో తీర్మానాలు చేయాలని సూచించారు. 78 ఏండ్ల స్వతంత్ర భారతంలో సాధించుకున్న హక్కులను పాలకులు కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన పాలకులు స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల కోసమే నిర్ణయాలు చేస్తున్నారనీ, వారి స్వప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. ఇందుకు మీడియాను, ఇతర ఏజెన్సీలను సమర్థవంతంగా వినియోగించుకు ంటున్నారని దుయ్యబట్టారు. ఒక రకంగా చెప్పాలంటే నయాఫాసిస్టు ధోరణితో మోడీ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ తపన్‌సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో మన ఆలోచన, ఆచరణ మరింత స్పష్టంగా ఉండాలని మార్గదర్శనం చేశారు.
జూలై 9న సమ్మె సందర్భంగా కార్మికులు, విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజలు బాగా స్పందించారని గుర్తు చేశారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ సమరశీలతను ప్రదర్శించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. మారుతున్న పరిస్థితులను ఎదుర్కోవాలంటే.. ఖచ్చితమైన ప్రణాళిక అవసరమని అన్నారు. ఆ పోరాటాల్లో ఆర్థిక ప్రయోజనాల వరకే పరిమితం కాకుండా సాధారణ సర్వీసులు, వసతుల కల్పన విషయంలో శ్రద్ధ పెట్టాలని సూచించారు. పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాల సందర్భంగా కేసుల పాలవుతున్నాం, జైళ్లకు వెళ్తున్నాం, అయినా కార్మకులు మనల్ని ఎందుకు గుర్తించటం లేదో పరిశీలించుకోవాలని కోరారు. కార్మికుల మధ్య అనైక్యతను పెంచేందుకు కులం, మతం, ప్రాంతీయ విభేదాలను కేంద్రం సృష్టిస్తున్నదని చెప్పారు. ఈ కుట్రలను కార్మికులు, ప్రజలు అర్థం చేసుకునేలా విడమరిచి చెప్పాలని అన్నారు. యూనియన్లు లేకుండా స్వేచ్ఛాయుతమైన లాభార్జనకోసం కార్పొరేట్లకు అనుకూల పరిస్థితులను కల్పించటమే నేటి విషపూరిత పాలకుల ధ్యేయమని చెప్పారు. పెట్టుబడిదారి వ్యవస్థ గత 30 సంవత్సరాలుగా వ్యవస్థాగత పరాజయంలో ఉందని గుర్తు చేశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు దూకుడు పెంచిందని గుర్తు చేశారు. లేబర్ కోడ్‌లను ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించటానికి కారణం కార్మికుల ఐక్య పోరాటాలేనని చెప్పారు. ఇలాంటి పోరాటాలు మరిన్ని జరగాలని తపన్‌సేన్ ఆకాంక్షించారు. తద్వారా కార్పొరేట్లకు తాబేదార్లుగా ఉన్న పాలకుల కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం విశాఖలో నిర్వహించబోయే సీఐటీయూ అఖిల భారత మహసభలో తగిన కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
మోడీ విధానాలను ధిక్కరణ, ప్రతిఘటనతో తిప్పికొడదాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



