– జనవరి ఏడో తేదీ వరకు నిరసనలు
– 8 నుంచి 18 వరకు జిల్లా స్థాయి జాతాలు
– 19న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు
– ‘వికసిత్ భారత్ జీ రాం జీ వద్దు..నరేగా చట్టమే కావాలి
– లేబర్‌కోడ్‌లను వ్యతిరేకించండి
– కార్పొరేట్ అనుకూల జాతీయ విత్తన బిల్లును రద్దు చేయాలి
– 2025 విద్యుత్ సవరణ చట్టం అత్యంత ప్రమాకరం
– అణుబిల్లు పర్యావరణానికి ప్రమాదకరం
– ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ పెట్టుబడులంటే వాటిని అప్పగించడమే : సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజలకు తీవ్ర నష్టం చేకూరుస్తూ కార్పొరేట్లకు, భూస్వాములకు లాభం చేకూర్చే కేంద్ర ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకిస్తూ జనవరి ఏడో తేదీ వరకు గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల నేతలు సంయుక్తంగా పిలుపునిచ్చారు. జనవరి ఎనిమిదో తేదీ నుంచి 18 వరకు జరిగే జిల్లా స్థాయి జాతాలను జయప్రదం చేయాలని కోరారు. జనవరి 19న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయనున్నట్టు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, సుధా భాస్కర్, పద్మశ్రీ, కార్యదర్శి మల్లికార్జున్, కోశాధికారి వంగూరి రాములు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో మంది పేదల పొట్టగొట్టే వికసిత్ భారత్ జీ రాం జీ చట్టం వద్దనీ, దాని స్థానంలో నరేగా చట్టాన్నే పునరుద్ధరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల దోపిడీకి మరింత అవకాశం కల్పించేందుకే నాలుగు లేబర్ కోడ్‌లు అని చెప్పారు. లేబర్ కోడ్‌లతో కార్మికుల హక్కులు హరించిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవి అమలైతే పర్మినెంట్ ఉద్యోగ వ్యవస్థ పోయే ప్రమాదముందని హెచ్చరించారు. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేలా ఆ కోడ్‌లు ఉన్నాయని చెప్పారు. జాతీయ విత్తన బిల్లు కార్పొరేట్లకు విత్తనంపై గుత్తాధిపత్యం కల్పించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాసిరకం విత్తనాలతో నష్టపోయే రైతులకు ఇచ్చే పరిహారం గురించి చట్టంలో ఎక్కడ కూడా లేదని ఎత్తిచూపారు. విత్తన కంపెనీలకు లాభాలు కట్టబెట్టడం గురించి రైతులకు మేలు చేసే అంశాలు ఆ చట్టంలో లేవని విమర్శించారు. అణు బిల్లు అత్యంత ప్రమాదకమైనదని హెచ్చరించారు. ఆ బిల్లుతో పర్యావరణం దెబ్బతినే ప్రమాదముందని చెప్పారు. ప్రమాదాలు జరిగితే కంపెనీల బాధ్యత కాదని ఆ చట్టంలో పేర్కొనటం దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. పర్యావరణం దెబ్బతిన్నా…మనుషులు చచ్చినా సరేగానీ కార్పొరేట్ల లాభాలే ముఖ్యమన్నట్టు మోడీ సర్కారు వ్యవహరించడం తగదన్నారు. ఇప్పటివరకూ విద్యుత్ పంపిణీ వ్యవస్థ 99 శాతం ప్రభుత్వ ఆధీనంలో నడిచేదనీ, దాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే విద్యుత్ సవరణ చట్టాన్ని మోడీ సర్కారు చేసిందని విమర్శించారు. ఈ చట్టం వల్ల క్రాస్ సబ్సిడీ ఎగిరిపోతుందనీ, రైతులు, పేదలు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కోల్పోతారని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోకి వంద శాతం విదేశీ సంస్థల పెట్టుబడులకు అనుమతించడం అంటే వాటిని అప్పగించడమే అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా చేస్తున్న చట్టాలు దేశ ప్రయోజనాలకు విఘాతంగా మారబోతున్నాయని హెచ్చరించారు. ఆ చట్టాలను దేశ పౌరులందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
ప్రజా వ్యతిరేకచట్టాలను తిప్పికొడదాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



