Friday, July 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమేడిగడ్డ బ్యారేజ్‌పైనే చర్చిద్దాం

మేడిగడ్డ బ్యారేజ్‌పైనే చర్చిద్దాం

- Advertisement -

– సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌
– దళితబంధు నిలిపివేతపై ఆగ్రహం
– ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సీఎం రేవంత్‌ రెడ్డి కూలిందని ఆరోపిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్‌ పైనే చర్చిందుకు సిద్ధమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. దమ్మ్నుంటే ముఖ్యమంత్రి తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన దళితబంధు సాధన సమితి సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ చర్చకు రా అని సవాల్‌ విసిరి పారిపోయిన సీఎం మరోసారి నాగార్జునసాగర్‌ కట్టపైన చర్చకు వస్తావా? అని తనకు సవాల్‌ విసిరారని ఎద్దేవా చేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల చివరి మడి వరకు నీళ్లిచ్చిన నాయకులు కేసీఆర్‌ అని తెలిసి కూడా సీఎం అబద్ధాలాడుతున్నారని విమర్శించారు. హామీలు అమలు చేయమంటే ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తప్పుపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాజకీయాల్లో బూతులు మాట్లాడటం తమకు ఇష్టం లేదనీ, కానీ సీఎం మాట్లాడిన భాషలో తిరిగి చెబితేనే ఆయనకు అర్థమవుతుందని వాడక తప్పడం లేదని కేటీఆర్‌ తెలిపారు.

దళిత బంధు నిలిపివేతపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. దళితబంధుపై పెట్టిన ఫ్రీజింగ్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ హామీ ఇచ్చినట్టుగా రూ.12 లక్షలతో దళిత బంధును ప్రారంభించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాయనున్నట్టు తెలిపారు. దళితుల జీవితాల్లో సమగ్ర మార్పు తీసుకురావడానికి కేసీఆర్‌ రూ.10 లక్షలతో దళిత బంధును ప్రారంభించారని గుర్తుచేశారు. దానికి మరో రూ.2 లక్షలు కలిపి రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్‌ ఓట్లు వేయించుకుని మోసం చేసిందని కేటీఆర్‌ విమర్శించారు. దేశంలో దళితబంధు, రైతుబంధు వంటి కార్యక్రమాలు చేపట్టిన దమ్మున్న నాయకులు కేసీఆర్‌ అని కొనియాడారు. దళితుల అభివృద్ధి కోసం కళ్యాణలక్ష్మి, గురుకులాలు, దళిత బంధు అమలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ పేరుతో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కి వారిని నిలువున మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలను నిట్టనిలువునా మోసం చేసిందని దుయ్యబట్టారు. 100 రోజుల్లో హామీల అమలుపై నిలదీస్తే కేసులు బనాయించి బెదిరించారనీ, అయినా కాంగ్రెస్‌ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో దళిత బంధు సాధన సమితి నేతలు, దళిత బంధు రాక ఇబ్బందులు పడుతున్న పలువురు దళితులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -