ప్రజల ఐక్యతను బలోపేతం చేద్దాం
తమిళనాడులో 9 రోజులు..300 కి.మీ సీపీఐ(ఎం) పాదయాత్ర ప్రారంభం
మయిలాడుతురై : మతతత్వానికి వ్యతిరేకంగా..రాష్ట్ర హక్కుల కోసం తమిళనాడులో సీపీఐ(ఎం) పాదయాత్రను ప్రారంభించింది. తొమ్మిది రోజుల పాటు 300 కిలోమీటర్ల జరిగే ఈ పాదయాత్ర తరంబాడి తాలూకాలోని తిల్లాయడిలో ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ‘మత విద్వేషాన్ని నిర్మూలిద్దాం : ప్రజల ఐక్యతను బలోపేతం చేద్దాం : రాష్ట్ర హక్కులను కాపాడుకుందాం’ అని ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కార్యకర్తలు నినాదాలు చేశారు. గ్రామంలోని వల్లియమ్మాళ్ మెమోరియల్ వద్ద మహాత్మా గాంధీ, థిల్లయాడి వల్లియమ్మాళ్ విగ్రహాలకు సీపీఐ(ఎం) నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించిన తరువాత పార్టీ జిల్లా విభాగం ఈ పాదయాత్రను ప్రారంభించింది. పాదయాత్ర లక్ష్యాలను వివరించడానికి తిల్లాయడి మండపం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పార్టీ యూనియన్ కార్యదర్శి ఎ రవిచంద్రన్ అధ్యక్షత వహించారు.
ఈ సభలో తమిళనాడు సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.శామ్యూల్‌రాజ్, జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసన్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి సింగరవెళన్ ప్రసంగించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా యూనియన్ కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శలు, పార్టీ సభ్యులు, మద్దతుదారులు పాల్గొన్నారు. బాణసంచా కాల్చడం, కార్యకర్తల నినాదాల మధ్య కె.శామ్యూల్ రాజ్ ఎర్ర జెండాను ఎగురవేసి పాదయాత్రను ప్రారంభించారు. తొలిరోజున తిల్లయాడి నది ఒడ్డు, తిరువిడైకళి, కొంగరాయన్ మండ పం, ఎరవంచెరి, తిరువిలైయట్టం, అరుంబాక్కం, పనం గుడి, నల్లడై గూండా సాగి ఇలుప్పూర్ వద్ద బహిరంగ సభతో తొలిరోజు పాదయాత్ర ముగిసింది.



