Wednesday, March 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం

- Advertisement -

ప్రజా సంఘాల పిలుపు..ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులను ఖండిస్తూ నిరసన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుదామని పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులను ఖండిస్తూ మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేతలు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌ బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోటా రమేష్‌, అనగంటి వెంకటేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.రజినీకాంత్‌లు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు తమ ఆధీనంలో ఉండాలని అమెరికా ఇతర దేశాలపై దాడులు చేస్తున్నదని విమర్శించారు. పెట్రేగిపోతున్న అమెరికా సామ్రాజ్యవాదం కారణంగా గాజా, పాలస్తీనాపై యుద్ధంతో పాటు రష్యా-ఉక్రెయిన్‌పై నాలుగు సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నదని తెలిపారు. ఈ యుద్ధాల ప్రభావం భారతదేశంపై కూడా పడుతున్నదని చెప్పారు.

మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారనీ, అమెరికాకు ఎగుమతి చేస్తున్నారనీ వెనిజులా దేశ అధ్యక్షులు, మదురోతో పాటు ఆయన భార్య నికోలస్‌ మదురోని కిడ్నాప్‌ చేసి బంధించారని గుర్తు చేశారు. నియంతలా వ్యవహరిస్తున్న ట్రంప్‌ అనేక దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ చేస్తున్న ఆర్థిక యుద్ధం ప్రపంచ శాంతికి అతి పెద్ద ప్రమాదకరమని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా-ఇజ్రాయిల్‌ సామ్రాజ్యవాద కూటమితో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్‌లో ఓ పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో 150 మంది చిన్నారులు, భారతదేశంలో మహా సముద్రంలో ఇరాన్‌ నౌకపై దాడిలో 85 మంది సైనికులు మరణించినా ప్రధాని నరేంద్రమోడీ ఖండించలేదని తప్పుపట్టారు. భారతదేశ సార్వభౌమత్వంపై అమెరికా పెత్తనం కొనసాగిస్తున్నదని తెలిపారు. చమురు నిల్వలు ఉన్న దేశాలు తమ ఆధీనంలో ఉండాలనీ యుద్ధాలు చేస్తూ అమెరికా ఆయుధాలను సరఫరా చేస్తున్నదన్నారు.

అమెరికా వాణిజ్య ఒప్పందాలను భారతదేశ ప్రజానీకం వ్యతిరేకించాలని సూచించారు. ప్రపంచాన్ని వలస పాలనలోకి నెట్టే ప్రయత్నాలను అడ్డుకునేందుకు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళమెత్తాలని సూచించారు. పశ్చిమాసియా దేశాల్లో ఎగుమతులు, దిగుమతులు ఆగిపోతే భారతదేశంలో కూడా తీవ్ర నష్టం జరుగుతుందనీ, ఆ దేశాలకు మన దేశం నుంచి బాస్మతి రైస్‌, చేపలు, కూరగాయలు, పండ్ల ఎగుమతి ఆగిపోయి వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికైనా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాంనాయక్‌, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ నాయక్‌ , టీపీటీఎల్‌ఎఫ్‌ టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు నాగేందర్‌, పాటల గోపి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -