ప్రతి మహిళ కదలాలి : పి.కె.శ్రీమతి టీచర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భవిష్యత్ తరాల మెరుగైన జీవితం కోసం నేటి మహిళలు పోరుబాట లో నడవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ అధ్యక్షురాలు పి.కె.శ్రీమతి టీచర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఐద్వా 14వ జాతీయ మహాసభల్లో ఆమె మరోసారి జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఐద్వా ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ, ”మన పూర్వికులు చేసిన పోరాటాల ఫలితంగా గతంలో కన్నా కొంత మెరుగైన జీవితంలోకి వచ్చాం. మన పిల్లలకు ఇంతకన్నా మెరుగైన జీవితాన్ని ఇచ్చేందుకు నేటి మహిళలు హక్కుల కోసం బిగ్గరగా గొంతెత్తాలి” అని పిలుపునిచ్చారు. ఐద్వా ఆవిర్భావం నుంచి అనేక పోరాటాలు చేసిందని తెలిపారు. అంకితభావం, ఐక్యతతో సాగిన పోరాటాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం లింగ సమానత్వ వైఖరితో ముందుకెళ్తుందని తెలిపారు.
మరోవైపు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మనువాద శక్తులు మహిళల జీవించే హక్కును హరించివేస్తున్నాయని విమర్శించారు. జీవించే హక్కుతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, నివాస హక్కుల కోసం భవిష్యత్తులో పోరాటాలు చేయాల్సి ఉందని గుర్తుచేశారు. భారతదేశం అనేక రంగాల అభివృద్ధి సూచికల్లో అత్యంత వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ విధానాలతో కేరళ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంటే, దేశం, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయంటూ తేడాలను వివరించారు. అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళ ఘనత సాధించిందని ఆమె గుర్తుచేశారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు అమలు చేయగలిగినప్పుడు, ఇతర రాష్ట్రాలు ఎందుకు చేయలేవని శ్రీమతి టీచర్ ప్రశ్నించారు.
అందరికీ ధన్యవాదాలు
మహాసభల విజయవంతానికి సహకరించిన వారందరికి శ్రీమతి టీచర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఐద్వా కార్యకర్తలు అంకితభావంతో కష్టపడి పని చేశారని కొనియాడారు. మహాసభల విజయవంతం కోసం అవిశ్రాంతంగా శ్రమించారని ప్రశంసించారు. కేరళలో ఐద్వా 60 లక్షల సభ్యత్వముంటే, తెలంగాణలో దాదాపు 4 లక్షల మంది సభ్యత్వముందని తెలిపారు. అయినప్పటికీ జాతీయ మహాసభలకు మెరుగ్గా ఆతిథ్యమిచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.
భావితరాల కోసం పోరాడుదాం
- Advertisement -
- Advertisement -



