తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
మెదక్‌లో రైతు సంఘం, వ్యకాస, కేవీపీఎస్ ఆధ్వర్యంలో సీడ్ బిల్లు ప్రతుల దహనం
నవతెలంగాణ-మెదక్‌టౌన్
సీడ్స్ బిల్లు 2025ను రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పిలుపు ఇచ్చారు. సోమవారం రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలోని సీడబ్ల్యూసీ గోదాం ఎదుట సీడ్ బిల్లు ముసాయిదా ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సీడ్స్ బిల్లు 2025.. భారత విత్తన రంగంపై బహుళజాతి, కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యాన్ని పెంచి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. ఈ చట్టం.. ఆహార భద్రత, విత్తన స్వావలంబన, రాష్ట్ర హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తుందని అన్నారు. విత్తన సరఫరాపై బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ల నియంత్రణ పెంచుతుందని అన్నారు. చౌకగా నాణ్యమైన విత్తనాలను సమయానికి సరఫరా చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేదని విమర్శించారు. రైతుల భద్రత, రైతుల ఆర్థిక భద్రత, లాభదాయకమైన వ్యవసాయాన్ని మోడీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. భారత వ్యవసాయ భవిష్యత్తుకు ప్రమాదాన్ని తెచ్చే ఈ సీడ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.మల్లేశం, నాయకులు గౌరయ్య, అశోక్, శేఖర్, లచ్చ గౌడ్, నరేందర్, యశోద, దుర్గ, కవిత తదితరులు పాల్గొన్నారు.
సీడ్ బిల్లు రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాడుదాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



