తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకమే
అసెంబ్లీలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయాలి
మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బహిరంగ సభలు : ఫామ్‌హౌస్‌లో నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం
నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి/మర్కుర్
తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించాల్సిందేనని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన నేతలు హాజరైనట్టు తెలిసింది. అర్ధరాత్రి వరకు ఈ సమావేశం కొనసాగింది. పార్టీ నేతల నుంచి అందిన సమాచారం ప్రకారం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణపైనే ఎక్కువ సేపు చర్చించినట్టు తెలిసింది. ఈ నెల 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిలదీయాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మూడు చోట్ల వేర్వేరుగా బహిరంగ సభలు జరపాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరి స్తున్న వైఖరిని ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్రమంతా తిరగాలని అనుకున్నారు. ఈనెల 29న శాసనసభకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది స్పష్టత రాలేదు. హాజరవుతారు అని నాయకులు అంటున్నారు. ‘పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలం గాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కాంగ్రెస్‌ది నాటి నుంచీ తెలంగాణ పట్ల ఎప్పుడు ద్రోహమే. తెలంగాణను బీఆర్‌ఎస్ తప్ప మరే ఇతర పార్టీ పట్టించుకోవటం లేదు.’ అని నేతలతో కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు ప్రజల్లోకి వెళ్లాలని, తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్‌ఎస్‌పైనే ఉందని ఆయన తెలిపారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరించాలన్నారు.



