Tuesday, October 14, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఈ డిస్కంతో జర పైలం!

ఈ డిస్కంతో జర పైలం!

- Advertisement -

శివుడికి మూడు కండ్లుంటాయనీ, వాటిలో సదరు మూడవ కన్ను తెరిస్తే అన్నీ భస్మం అవుతాయనీ పురాణగాథ! ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్‌ చేస్తున్న మూడవ డిస్కం ఈ భూమ్మీద కన్ను తెరిస్తే రాష్ట్ర విద్యుత్‌ రంగం భస్మంకాక తప్పదు. దాన్నుండి సేవలు పొందే ప్రజలు, దానిలో పని చేసే ఉద్యోగులు అందరూ ఇక్కట్లు పాలుగాక మానరు. కలియుగంలో ప్రపంచబ్యాంకు నిజం. దాని ఆదేశిత సంస్కరణలు నిజం. ఆ విషయం పౌరులకు పాలక రాజకీయాలు తెలియనివ్వడం లేదనేది కూడా నిజం. అయితే, ఈ విషయం సామాన్యులకు, కార్మికులు, ఇతర కష్టజీవులకు ఎప్పటికీ అర్థం కాదనేది మాత్రం పచ్చి అబద్ధం.
ఈ 3వ డిస్కం దాని చావు ముహూర్తం వెంటబెట్టుకునే పుట్టబోతోంది. సబ్సిడీ విద్యుత్‌ పథకాలన్నీ ఒకే చోట చేర్చి దాని మెడలో వేస్తారట! ఆ మేరకు రాష్ట్ర విద్యుత్‌ రంగాన్ని ముంచడమో, రాష్ట్ర ప్రభుత్వ బొక్కసాన్ని ఊడ్చేయడమో జరుగుతుంది.
రాజకీయ కుస్తీలు ఎలా ఉన్నా, ఫ్రీ కరెంటు ఇవ్వకపోతే వ్యవసాయం ధ్వంసం అవుతుంది. 2024 డిసెంబరులో గృహజ్యోతి పథకం అమల్లోకొచ్చిన తర్వాత 200 యూనిట్లు దాదాపు ఏడాదిగా వాడుకునే చిన్న కుటుంబీకులు ఆ మేరకు ఇతర సరుకులు కొనుగోలుపై తమ దృష్టి మళ్లించారు. దాంతో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కొంత చలనంలోకొచ్చింది. రాష్ట్రానికి ఆ మేరకు లబ్ది చేకూరింది. మేజర్‌, మైనర్‌ ఇరిగేషన్‌ నీటి సరఫరా మొత్తం కొత్త డిస్కంకే బదిలీ చేస్తారట! జీహెచ్‌ఎంసీతోపాటు, గ్రామీణ మంచినీటి సరఫరా, ఇవన్నీ ఒకే డిస్కం కిందకి రావడంవల్ల ఇప్పటిదాకా క్రాస్‌ సబ్సిడీ ఇచ్చే వినియోగదారు లుండరు. అపుడు టారిఫ్‌లు తడిసి మోపెడవుతాయి. ఆ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఏ పూటకాపూట గీకిగీకి బండి నెట్టుకొస్తున్న ప్రభుత్వం ఇంత పైకమియ్యగలదా?! ఇవ్వలేకపోతే దీన్ని ప్రయివేటు వారికి ”ఫ్రాంచైజ్‌”కిస్తారా? లేదా ఈ నష్టాన్ని చూపించి ”ప్రభుత్వం మోయలేదు కాబట్టి” అనే సాకుతో మిగతా రెంటినీ ప్రయి’వేటు’ వేస్తారా? ఈ 3వ డిస్కంకు పీపీఏలను, ఉద్యోగులను బదిలీ చేస్తారట! చూస్తూ, చూస్తూ మునిగిపోయే పడవలోకి ఏ ఉద్యోగి దూకుతాడు?! ఆప్షన్‌ ఇస్తే వారు వెళ్ళకపోతే బలవంతంగా నెడతారా? దానికి ఉద్యోగులు, వారి సంఘాలు అంగీకరిస్తారా? లేకుంటే కాంగ్రెస్‌ మార్క్‌ దండోపాయాలు ప్రయోగిస్తారా? మూడో డిస్కం పట్టాలే ఎక్కలేదు. విధివిధానాలే ఖరారు కాలేదు. అలాంటప్పుడు ఇప్పుడే దానిపై చర్చెందుకు అనే అధికారులు విద్యుత్‌ సౌధాలో ఉన్నారు. అన్ని అయ్యాక ‘మమ’ అనడం తప్ప చేసేదేముంటుంది? ఏమైనా ఇంత కీలకమైన విషయాన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో చర్చించకుండా ప్రధాన స్టేక్‌ హౌల్డర్లయిన ఉద్యోగ సంఘాలతో మాట్లాడకుండా ”ముఖ్యమంత్రి దిశా నిర్దేశాలేంటి” అనే సందేహం ఎవరికైనా రావడం సహజం. పైగా రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ పంచాయితీ సుప్రీందాకా వెళ్ళిన సంగతి తెలుసుకదా!
ఒకే లైన్‌పై వ్యవసాయ కనెక్షన్లు, గృహజ్యోతి కనెక్షన్లు, హెచ్‌టి కనెక్షన్లు ఉంటే ఏ విధంగా విడగొడ్తారు? ఈఆర్‌సీ వ్యవసాయ ఫీడర్లను వేరుచేయా లని చెప్పబట్టి 20 ఏండ్లయింది. అది అమల్లోకే రాలేదు. ఇప్పటిదాకా ప్రధాన కొనుగోలుదారైన దక్షిణమధ్య రైల్వే డిస్కంల నుండి విద్యుత్‌ కొనుగోలు తగ్గించి ”ఓపెన్‌ యాక్సెస్‌”లో కొనుక్కుంటోంది. ఇతర అనేక హెచ్‌టి వినియోగదారులూ ఆ బాటనే నడుస్తున్నారు. ఫలితంగా డిస్కాంల ఆదాయం తగ్గిపోతోంది. ఉద్యోగుల జీతాలు, లైన్లు, సబ్‌ స్టేషన్లు నిర్వహణ కు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ స్థితిలో విడిగా ఒక డిస్కం, అదీ సబ్సిడీ వినియోగదారులున్న డిస్కం నిర్వహణ సాధ్యంకాదని నిపుణులు అంటున్నారు.
కేసీఆర్‌కు కాళేశ్వరం కార్పొరేషన్‌లాగా, అప్పులు తెచ్చుకునేందుకు ఇదొక ఏర్పాటా అనే సందేహం వ్యక్తం చేసేవారూ ఉన్నారు. విద్యుత్‌ సంస్కరణల అమలుకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ ఘోరమైన వైఫల్యాలే!
సంస్కరణల పేరుతో విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటు వారి చేతిలో పెట్టే ప్రక్రియ ఈ శతాబ్ద ప్రారంభంకంటే ముందునుండే జరుగుతోంది. మొదట్లో దానికి పసుపు రంగేస్తే దానిలో నుండి బుల్లెట్లు దూసుకొచ్చి మారణహోమం సృష్టించాయి. నేడు కాషాయం కట్టుకుని నానా వగలూ పోతోంది. మూడు రంగులదీ అదే దారి! అదే నేడు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్య. విద్యుత్‌ పంపిణీ ప్రాంతాల వారీగా ఉండాలనేది 1948 ఎలక్ట్రిసిటీ సప్లరు యాక్ట్‌ చెప్పింది. దేశ అనుభవమూ అదే. ప్రభుత్వ సబ్సిడీతోపాటు క్రాస్‌ సబ్సిడీ పొందే వాటన్నింటినీ కలిపి ఒక డిస్కం చేయడమంటే దీని ఉద్దేశ్యమేంటి? ఏదైనా ‘దూరాలోచనుందా?’
”ఎవరు జీవించి ఉన్నట్లు?” అనే యక్షుడి ప్రశ్నకు చనిపోయిన తర్వాత కూడా ఎవరి పేర్లు, ఎన్నాళ్లు ఈ లోకంలో వినపడుతుందో అన్నాళ్లు వారు జీవించి ఉన్నట్లు” అనేది ధర్మరాజు సమాధానం. ప్రపంచబ్యాంకు విధానాలు వచ్చిన తర్వాత.. చనిపోవాల్సిన పనిలేదు. భారతం అంటే దుర్యోధనుణ్ణి, రామాయణం అంటే రావణాసురుడ్ని గుర్తుపెట్టుకోవడం లేదా? విద్యుత్‌ సంస్కరణలంటే సత్తెనపల్లి రామకిృష్ణ గుర్తురావడానికి ముందే చంద్రబాబు నాయుడు గుర్తుకురాడా?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -