సమ్మె నోటీసును అందజేసిన ఆశాలు
నవతెలంగాణ – దుబ్బాక: 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ అసోసియేషన్ ల జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా ‘ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె’ను జయప్రదం చేయాలని సీఐటీయూ దుబ్బాక పట్టణ కన్వీనర్ కొంపల్లి భాస్కర్, ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు మంజుల కోరారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం దుబ్బాక మండలం రామక్కపేట, తిమ్మాపూర్ లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డా.అదీబా, డా.ఉదయ్ కుమార్ లకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన నోటీసులను అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక సంఘాల ఏర్పాటు, కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం అవుతుందని, తద్వారా ఉద్యోగ భద్రత, ఉపాధిని కోల్పోవడమే కాకుండా కార్మికుల ప్రయోజనాల కొరకు పనిచేసే కార్మిక శాఖ కూడా నిర్జీవమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆరోగ్య రంగాన్ని ప్రైవేటీకరణ చేసే యోచనలో కేంద్ర సర్కార్ ఉందని ఆరోపించారు.పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకనుగుణంగా ఆశా వర్కర్లకు కనీస వేతన నిర్ణయం నేటికీ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ఆశా వర్కర్లకు కనీస వేతనంగా రూ.26,000 చెల్లించి ఉద్యోగ, ఉపాధి, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు సీహెచ్.భాగ్యలక్ష్మి,సంతోష,శారద, చంద్రకళ, భారతమ్మ, శ్యామల, అనిత, లత, వసుంధర పలువురు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES