Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeనేటి వ్యాసంఆదివాసీ స్వయం పాలనకై ఉద్యమిద్దాం

ఆదివాసీ స్వయం పాలనకై ఉద్యమిద్దాం

- Advertisement -

ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపాలంటూ 1994 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి (యుఎన్‌ఓ) జనరల్‌ అసెంబ్లీ పిలుపునిచ్చింది. ఆనాటి నుండి ప్రపంచీకరణ విధానాలతో అడవులు, ఆదివాసుల జీవితాలు మరింత ప్రమాదంలోకి నెట్టబడుతూనే ఉన్నాయి. జల్‌, జంగల్‌, జమీన్‌ల నుండి, భాషా-సంస్కతుల నుండి ఆదివాసు లను పరాయీకరించే పరిస్థితి పెరుగుతూనే ఉంది. అందుకేనేమో కంటి తుడుపు చర్యగానైనా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం భారత్‌లోని పదిన్నర కోట్ల ఆదివాసులకు పెద్దగా ఉపశమనం కలిగించలేకపోతున్నది. పదిహేడవ శతాబ్దం నుండి ఆదివాసుల తిరుగుబాట్లే భారతదేశ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం చేసిన పోరాటాలకు ఎంతో ఊతమిచ్చాయి. తమ నేలమీదనే ఆదివాసీ ప్రజలు పరాయి వాళ్లయి పోతుండడం ప్రపంచవ్యాప్త పరిణామంగా ఉంది. అందుకేనా అన్నట్లు ఆదివాసి దినం జరుపుకునే సందర్భంగా ”ఆదివాసి ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు-ఆహార భద్రత, సార్వభౌమాధికారానికి ఒక మార్గం” అంటూ పిలుపునిచ్చింది.
దిగజారుతున్న ఆదివాసీల పరిస్థితి
తొంబై దేశాల్లో దాదాపు 48 కోట్ల జనాభా (476 మిలియన్లు)తో ఆదివాసులు ప్రపంచ జనాభాలో ఆరు శాతంగా ఉన్నారు. ఒక్క భారత్‌లోనే 705 తెగ జాతులతో మనదేశ జనాభాలో 8.6 శాతంగా పదిన్నర కోట్లకు పైగా షెడ్యూల్డ్‌ తెగల ప్రజలు ఉన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదల్లో 15శాతం ఆదివాసులేనని పలు నివేదికలున్నాయి. ఏడు వేల భాషలు, ఐదు వేల విభిన్న సంస్కతులతో, తెగలతో ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతం నిజమైన భిన్నత్వంతో కూడుకుని ఉంది. అది 28 శాతం భూగోళాన్ని ఆక్రమిస్తే, వారి నివాసం చుట్టూ పదకొండు శాతం అడవులు విస్తరించి ఉన్నాయి. సహజసిద్ధ అడవుల సంరక్షకులుగా, పర్యావరణ పరిరక్షకులుగా, యాభై శాతానికి పైగా ఆహార స్వయం సమద్ధి కలిగిన ఆదివాసులు నేడు కార్పోరేట్ల దాడిలో సర్వం కోల్పోతున్నారు. పరాయీకరణ ప్రధాన సమస్యగా మారిన పరిస్థితిలో, తాము పుట్టి పెరిగిన అడవుల్లోనే మైనారిటీగా మారుతున్నారు. విప్లవ పోరాటాలతో, అనన్య త్యాగాలతో ఆదివాసుల భూమి బదలాయింపు నిరోధక రెగ్యులేషన్‌ వన్‌ ఆఫ్‌ 70 చట్టం, 1996 పెసా చట్టం, రాజ్యాంగంలోని 5,6 షెడ్యూల్స్‌లోని రక్షణలు, 2006 అడవి హక్కుల చట్టం ఏవీ వారిని కాపాడలేకపోతున్నాయి. సరిగ్గా పాడేరులోనే పంప్డ్‌ హౌస్‌ పవర్‌ ప్రాజెక్టుల పేరు మీద గౌతం అదానీ పవర్‌ ప్రాజెక్టు అడవులను, గ్రామాలను కబళించింది. బాక్సైట్‌ తవ్వకాల కార్యక్రమం తలపైన వేలాడుతుంది. పోలవరంలో మునిగిన 200 ఆదివాసీ గ్రామాలకు నేటికీ సరైన పరిహారం లేదు. రక్షణావసరాల పేరు మీద అడవులు, గూడాలు ఖాళీ అవుతుండగా, పెసా చట్టం చిన్నబోయింది. వేలాది సంవత్సరాలు ఆదివాసులు, జంతువులు పశుపక్షాధులతో సహజీవనం చేస్తున్నారు. కానీ నేషనల్‌ పార్కులు, పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాలు, వన్యప్రాణి కేంద్రాలు, నీటి ప్రాజెక్టులు, రవాణా మార్గాలు, ఖనిజాభివద్ధి సంస్థలు, బొగ్గు నిక్షేపాలు, రక్షణావసరాలు అంటూ అడవుల నుండి ఆదివాసుల గెంటివేత సర్వసాధారణమైంది. నూరేండ్లు గా సాగుచేస్తున్న కొందరు ఆదివాసులకు పట్టాలు లేకపోవడం, నూరుశాతం అడవులున్న గ్రామాలను, మండలాలను షెడ్యూల్డు ఏరియా పరిధిలోనికి తేకపోవడంతో ఆదివాసేతర పెత్తందార్ల ఆక్రమణలు పెరగడం, స్మగ్లర్లను వదిలి బొమ్మకొయ్య (ఎర్రచందనం) పేరుతో సామాన్య ఆదివాసులనే వేధించడం సర్వసాధారణమయింది. మైదానాల్లో చేపలవేటపై ఆధారపడ్డ యానాదుల బతుకులు దుర్భ లంగా ఉన్నాయి. కొన్ని దుర్బల జాతులు అంతమయ్యే స్థితిలో ఉన్నాయని నివేదికలున్నాయి.
అత్యంత ఆదిమజాతిగా ప్రసిద్ధిగాంచి, సునామీలను పసిగట్టగలిగిన అండమాన్‌ నికోబర్‌ దీవుల్లోని జారోవా తెగ ప్రజల నివాసాల మధ్య నుండి జంతువుల సఫారీలాగా పర్యాటకుల రోడ్డు నిర్మించారు. మనుషులను జంతువుల్లా చూసే పద్ధతిని 2002లో సుప్రీంకోర్టు నిషేధించింది. అయినా చట్టవిరుద్ధంగా ఇది సాగుతూనే ఉంది. తాజాగా 72వేలకోట్ల వ్యయంతో అక్కడ నిర్మాణం అవుతున్న ఇంటర్నేషనల్‌ కంటైనర్‌ ట్రాన్షిప్మెంట్‌ పోర్ట్‌(ఐసిటిపి) ప్రాజెక్టులు రెండు పురాతన దుర్బల తెగలైన షాప్మెన్‌, నికోబార్‌లు మాయమైపోతున్నాయి.ఇక ఫార్మా ఈస్ట్‌ అండ్‌ కాంటా బేసిన్‌(పిఇకెబి)అనే అదానీ కంపెనీ ఛత్తీస్‌గఢ్‌లోని హస్టేవ్‌ అరాండ్‌ అడవిలో బొగ్గు తవ్వకాలకై ఐదు లక్షల చెట్లను కొట్టేస్తున్నారు. ప్రజాభిప్రాయంతోనే ఇదంతా చేస్తున్నాం అంటున్నా అదంతా బూటకమని ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఘాట్బర్రాతో పాటు కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దాదాపు లక్షల విలువచేసే వందలాది వ్యాపార ఒప్పందాలతో విలువైన ఖనిజ సంపద కార్పొరేట్ల వశం చెయ్యబోతున్నందున అక్కడ మావోయిస్టులతో శాంతి చర్చలను నిరాకరిస్తున్నారు. అక్కడే ఆదివాసుల నరమేధం కొనసాగుతుంది. సంపద కొద్దిమంది చేతుల్లో పడరాదన్న సుప్రీంకోర్టు మాటలు సైతం పెడచెవిన పెట్టబడుతున్నాయి.
అరుణాచల్‌ ప్రదేశ్‌లో వేలాదిమంది ఆదివాసులను నిర్వాసితులను చేసే ఎగువ సియాంగ్‌ బహుళార్ధక సాధక ప్రాజెక్టు(యుఎస్‌ఎంపి)కు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనను అణిచివేస్తున్నారు. అస్సాంలో ఖాజీరంగ ఉద్యానవనం సమీపంలో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలపై అణచివేత సాగుతోంది. ఇక మణిపూర్‌ మారణహోమం నాగా, కుకీ జాతి తెగలను అణిచివేసే దుర్మార్గమైన కుట్ర మాత్రమే. అదే దేశ రక్షణ పేరిట 2023లో అటవి రక్షణ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం చేసిన నూతన చట్టం విదేశీ సరిహద్దుల నుండి వంద కిలోమీటర్ల వైశాల్యాన్ని, పది హెక్టార్లలో ఏదైనా నిర్మాణం చేసుకునే అంశం ఈశాన్య రాష్ట్రాల అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో ఉన్న ఈ ప్రాంతంలో జిల్లాల వారీగా స్వయంపాలన మండళ్లు ఉన్నాయి. కానీ ఆ రాజ్యాంగ రక్షణలు ప్రశ్నార్ధకమైతున్నాయి.
పులుల అభయారణ్యం పేరిట జీవో 49ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల ఆందోళన ఫలితంగా వెనక్కు తగ్గింది. ఆదివాసుల భాష – సంస్కతి వనరుల విధ్వంసం అడవుల నుండి గెంటివేత ప్రపంచవ్యాప్త సమస్యగా మారింది. బ్రెజిల్‌లో వంద ఆదిమ తెగలు అంతర్ధానం అయ్యే స్థితి ఏర్పడ్డది.బ్రిటిష్‌ వలస పాలకులు సహజ అడవులను సరుకుగా మార్చి మొట్టమొదటిసారిగా 1927లో అటవీ చట్టం చేసింది మొదలు అడవులన్నీ పెట్టుబడిదారుల సంపదగా మారాయి. దీనికి అనుగుణంగానే చట్టాలు చేస్తూ వస్తున్న పాల కులు ఆదివాసుల తిరుగుబాటులతోనే కొన్ని సంస్కరణలు తెచ్చారు. కానీ నేడు పచ్చిగా కార్పోరేట్‌ అనుకూల విధానాలతో ప్రజావ్యతిరేక చట్టాలు ఊపందుకుం టున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలతో క్రీస్తుశకం 1260లో బలమైన కాకతీయ సామ్రాజ్యంతోనే పోరాడిన సమ్మక్క సారక్కలు, మొగలాయిలను- రాజాధిరాజులను ఎదిరించిన బిర్సా ముండా, 1940లో నిజాం పాలకులను సవాల్‌ చేసిన కొమ రం భీమ్‌, బ్రిటిష్‌ వాళ్లతో ఎదురొడ్డి పోరాడిన రాంజీ గొండు, అల్లూరి మన్యం పితూరి లాంటివి చరిత్రలోనే కొన్ని రికార్డ్‌ అయినాయి. కానీ ఉరితీయబడ్డ కారం తమ్మన్న (ముఠాదారు) అదేవిధంగా జమీందారు కోరుకొండ సుబ్బారెడ్డిని 1857లో ఉరితీసి రాజమండ్రి కోటలో 1929 వరకు మతదేహాన్ని ఇనుపబోనులో పెట్టి అలాగే ఉంచారు. నేటికీ ప్రజా తిరుగుబాటులను అణిచివేయడం నిరంతరం జరుగుతూనే ఉంది. అందుకే 2019 ఎన్నికల్లో బ్రెజిల్‌ అధ్యక్షుడిగా లిబరల్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జైర్‌ మెస్సియాస్‌ బోల్సో నారో ”ఒక్క ఇంచు కూడా ఆదివాసుల భూమి లాకోనివ్వనని” వాగ్దానం చేసి గెలిచాడు. ఈరోజు లక్షలాది ఎకరాల అటవీ భూములు కార్పొరేట్లమయవుతుంటే ఒక్కరైనా అడ్డుకునే వాళ్లున్నారా? అంటూ రోజు నెత్తురోడుతున్న ఆదివాసి సమాజం ఎదురుచూస్తోంది. అందుకే ఆదివాసులకు సంఘీ భావంగా స్వయంపాలనకై కదం తొక్కుదాం.
(నేడు ఆదివాసి అంతర్జాతీయ దినోత్సవం)
అమర్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img