Tuesday, February 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమన్వయంతో ముందుకెళ్దాం

సమన్వయంతో ముందుకెళ్దాం

- Advertisement -

ఆ ఐదు పంచాయతీలను మాకివ్వండి
తిరుమలలో తెలంగాణకు ఐదెకరాలు కేటాయించండి
ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సహకరించండి
పెద్దవాగు మరమ్మతుల ఖర్చులో 85 శాతం భరించండి
ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీలో మంత్రి తుమ్మల విజ్ఞప్తి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అభివృద్ధి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లం పరస్పరం సహకరించుకుంటూ సమన్వయంతో ముందుకెళ్దామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లో ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. పునర్వవిభజనలో భాగంగా ఏపీకి కేటాయించిన భద్రాచలంలోని ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇచ్చేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండటం వల్ల ప్రజలు పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

ఆ గ్రామాలు గోదావరి నది, అటవీ ప్రాంతాల మధ్య ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంక్లేవ్‌లా మారిపోయాయనీ, జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి ఆ గ్రామాల ప్రజలు దాదాపు 8 గంటలు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, పన్నులు, పరిపాలనా అనుసంధాన లోపం, భద్రతా సమస్యలు వంటి అంశాలు స్థానిక గిరిజన ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. భద్రాచలం రామాలయానికి సంబంధించిన భూభాగాల్లో కొంత భాగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉండటం వల్ల దేవస్థానం పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ, భక్తులకు మెరుగైన సేవలు అందించాలంటే ఆ గ్రామాల విలీనం అవసరమని తుమ్మల అభిప్రాయపడ్డారు.

ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్ట్‌కు అత్యవసరంగా శాశ్వత మరమ్మత్తులు చేపట్టాల్సి ఉందనీ, ప్రాజెక్ట్‌ ద్వారా మొత్తం 16,000 ఎకరాలకు సాగునీరు అందుతుండగా అందులో సుమారు 13,640 ఎకరాలు (85.25 శాతం) ఆంధ్రప్రదేశ్‌లో, 2,360 ఎకరాలు (14.75 శాతం) తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం రూ.92.20 కోట్లు అవసరమని అంచనాలున్నాయనీ, రెండు రాష్ట్రాలకు లబ్ది చేకూరుతున్న క్రమంలో ఖర్చును 85 :15 నిష్పత్తిలో భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గోదావరి వరద రక్షణ కోసం నిర్మించిన భద్రాచలం కరకట్టలోని మూడో స్లూయిస్‌ వద్ద గోడ దెబ్బతిన్న విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. దాన్ని బాగు చేయించకపోతే భవిష్యత్తులో భారీ ప్రమాదానికి దారితీయొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని ప్రస్తావించారు. తక్షణమే సాంకేతిక పరిశీలన చేసి తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, రెండు రాష్ట్రాల సమన్వయంతో శాశ్వత పునరుద్ధరణ చర్యలు ప్రారంభించాలని కోరారు. తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక యాత్రికుల భవనం నిర్మాణానికి సుమారు ఐదెకరాలను కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు వద్ద మంత్రి తుమ్మల ప్రతిపాదించారు. ఖమ్మంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి అవసరమైన భూమి గుర్తింపు పూర్తైందనీ, టీటీడీ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కోరారు. సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్‌, పెనుబల్లి అమరావతి రైల్వే లైన్‌ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -