మూసీనది పునరుజ్జీవానికి సహకరించండి
మహానగర మాయగాళ్ల మాటలు నమ్మకండి : పరివాహక ప్రాంత పేదలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మూసీనది పరివాహక ప్రాంత పేద ప్రజలను నష్టపోనీవ్వం… కష్టపడనివ్వమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మూసీనది అంటే ముగ్గురు అన్నట్టుగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ నది పునరుజ్జీవనానికి పేదలు సహకరించాలని కోరారు. మహానగరంలో మహా మామయగాళ్లు ఉంటారనీ, వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. మాయమాటలు చెప్పి ప్రభుత్వ భూములను అగ్గువ, సగ్గువకు అమ్మితే కొనవద్దని సూచించారు. పేదలకు ఎలా మేలు చేయాలో సూచించాలని కోరారు. హైదరాబాద్ అంబర్‌పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం చెరువులో బతుకమ్మలు వదిలి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే బతుకమ్మ పండుగకు నిండుదనం వస్తుందని అభిప్రాయపడ్డారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు తన జీవితాశయంగా ఈ కుంట విముక్తి కోసం పోరాడారని గుర్తు చేశారు.
హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు కొంతమందికి అర్థం కాలేదనీ, మరికొంత మందికి అర్థమైనా కబ్జాలను కాపాడుకునేందుకే ప్రయత్నం చేశారని విమర్శించారు. హైడ్రా ఏర్పాటు చేస్తే చాలా మంది తమ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఒడిదుడుకులు వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. కరోనా తర్వాత వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయన్నారు. ఒకేసారి కుంభవృష్టి కురుస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించుకున్నా మని వివరించారు. హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ రెండు సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునేందుకు మాత్రమే ఏర్పాటు చేయబడిందని గుర్తు చేశారు. వర్షం వస్తే గంటలో మూసీ పరివాహక కాలనీలు జలమయ మవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఒకప్పుడు జీవధారగా ఉన్న మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను విడిపించడం, నాలా లను విస్తరించడం, మూసీ పునరుజ్జీవనం చేయడం తమ ప్రభుత్వం లక్ష్యమని పునరుద్ఘాటిం చారు.
రాజకీయాలకుతీతంగా మూసీ పునరుజ్జీవా నికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘కొంత మందికి పేదరికం ఎక్స్‌కర్షన్ లాంటిది. కానీ తమకు అలా కాదు. పేదరికం విలువ ఏమిటో నాకు తెలుసు’ అని సీఎం వివరించారు. అంబర ్‌పేట మూసీ పరివాహక ప్రాంతాల పేదలకు పునరావాసం కల్పించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా అంబర్‌పేటను అభి వృద్ధి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలి పారు. అంబర్‌పేటలో ప్రభుత్వ కార్యాలయాలు లేకపోవడం విచారకరమన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బతుకమ్మ కుంటకు వి.హన్మంతరావు పేరు పెట్టాలనే స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచనమేరకు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆనాడు హన్మంతరావు సూచన మేరకే ప్రగతిభవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మార్చామని గుర్తుచేశారు. ఆయన గౌరవానికి భంగం కలగకుండా సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తామని సీఎం చెప్పారు.
ఇదొక అద్భుతం ఘట్టం : హైడ్రా కమిషనర్ రంగనాథ్
బతుకమ్మ కుంట పునరుజ్జీవం వంటి అద్భుతం ఘట్టంలో హైడ్రా భాగస్వామికావడం సంతోషకరమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. గతంలో బతుకమ్మ కుంట కబ్జాకు గురై మాయమైందన్నారు. కంపచెట్లు, బీర్ల బాటిల్, చెత్త, చెదారంతో నిండిపోయిందని చెప్పారు. ఇక్కడికి రావాలంటే మాస్కులు పెట్టుకుని వచ్చే పరిస్థితులు ఉండేవన్నారు. బతుకమ్మ కుంట మొత్తం 16 ఎకరాల విస్తర్ణంలో ఉండేదనీ, ప్రస్తుతం ఐదెకరాల్లో మాత్రమే చెరువు పునర్‌జ్జీవం పోసుకుందని వివరించారు. మిగతా భూమిలో పేదలు ఇండ్లు కట్టుకున్నారనీ, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలమేరకు హైడ్రా పేదల జోలికి పోలేదని చెప్పారు.
హైదరాబాద్‌లో రూ.50వేల కోట్ల విలువైన 900 ఎకరాల భూములను హైడ్రా రక్షించిందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నియో జకవర్గ ఇన్‌ఛార్జి రోహిన్ రెడ్డి ఉన్నతాధికారు లతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ప్రజా గాయకులు విమలక్క, కనకవ్వ పాటలు పాడి అలరించారు. అనంతరం హైడ్రా రూపొందించిన ప్రత్యేక పాటను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.