Sunday, December 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశ్రామిక విభజనను వ్యతిరేకిద్దాం

శ్రామిక విభజనను వ్యతిరేకిద్దాం

- Advertisement -

2026 కార్మిక సంఘాలకు కీలక ఏడాది
సీఐటీయూ ఖమ్మం జిల్లా కార్యాలయ భవన ప్రారంభోత్సవంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఏకే పద్మనాభన్‌
ఖమ్మంలో కార్మికుల భారీ ర్యాలీ


నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి / ఖమ్మం
శ్రామిక విభజనను వ్యతిరేకిస్తూ.. మిలిటెంట్‌ పోరాటాలకు కార్మికులు సమాయత్తం కావాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ ఏకే పద్మనాభన్‌ పిలుపునిచ్చారు. 2026 ఏడాది శ్రామికలోకానికి కీలక సంవత్సరం అవుతుందన్నారు. మోడీ ప్రభుత్వ శ్రామిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న చేపట్టనున్న దేశవ్యాప్త సాధారణ సమ్మెను విజయవంతం చేయాలని అన్నారు. ఖమ్మంలో నూతనంగా నిర్మించిన సీఐటీయూ జిల్లా కార్యాలయం (బీటీ రణదివే) భవనాన్ని పద్మనాభన్‌ శనివారం ప్రారంభించారు. అంతకుముందు ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి నిర్వహించిన ర్యాలీలో సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కా రాములు, పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య తదితరులతో కలిసి పాల్గొన్నారు. యూనియన్‌ జెండాను సీనియర్‌ నాయకులు పి.రాజారావు ఆవిష్కరించిన అనంతరం భవనాన్ని పద్మనాభన్‌ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

వర్గపోరాటాల్లో సీఐటీయూ పాత్ర భిన్నం
బీటీ రణదివే పేరుతో ఉన్న స్మారక భవనాన్ని ప్రారంభించే అవకాశం రావటాన్ని గౌరవంగా భావిస్తున్నానని పద్మనాభన్‌ అన్నారు. సీఐటీయూ అన్ని ట్రేడ్‌ యూనియన్ల వంటిది కాదన్నారు. వర్గపోరాటాలు నిర్వహించటంలో దీని పాత్ర భిన్నమైనదని, సవాళ్లతో కూడుకున్నది అన్నారు. అనేక సవాళ్లను 1974 ఎమర్జెన్సీ సమయంలో, పీవీ నర్సింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణల సమయం, నయా ఉదారవాద ఆర్థిక విధానాల సమయంలో సీఐటీయూ అనేక సవాళ్లు ఎదుర్కొందని వివరించారు. మోడీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో కార్మికులంతా మిలిటెంట్‌గా పాల్గొనాలని కోరారు. శ్రామికులను విభజించే విధానాన్ని కేంద్రం కొనసాగిస్తోందని, మతపరమైన విధానాలను తీసుకొచ్చి విభజనకు పాల్పడుతోందని అన్నారు. సంయుక్త కిసాన్‌ మంచ్‌ పేరుతో అన్ని కార్మిక సంఘాలు కలిసి పోరాటం చేస్తున్నాయన్నారు. కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు విమర్శించారు.

వేతన కుదింపుకే ఉపాధిహామీ ఎత్తివేత
ఉపాధిహామీ చట్టాన్ని ఎత్తివేస్తే పట్టణాలపై ఒత్తిడి పెరిగి కూలి రేట్లను తగ్గించొచ్చనే పెట్టుబడిదారీ ఆలోచనను మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందని వ్యవసాయ కార్మికసంఘం అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. ఉపాధిహామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ కార్మికులది మాత్రమే కాదని, రైతులు, కార్మికులందరిదీ అని సూచించారు. కార్మిక కోడ్‌లతో వ్యవసాయ కార్మిక చట్టాలన్నీ రద్దవుతాయని తాము ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. జీరామ్‌జీ చట్టంతో ఉపాధి ఉండకపోగా కార్పొరేట్లు ఎంట్రీ ఇస్తారని తెలిపారు. హిట్లర్‌ లాంటివాళ్లే ఎర్రజెండాను చూసి ఆత్మహత్య చేసుకున్నారని, ఏదో ఒకరోజు నరేంద్రమోడీకి కూడా ఆ గతి పడుతుందని హెచ్చరించారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్దన్‌ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, బి.మధు, రాష్ట్ర నాయకులు జ్యోతి, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వజ్రాల శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ పిన్నింటి రమ్య, సీఐటీయూ జిల్లా ఆఫీస్‌బేరర్లు పెరుమాళ్లపల్లి మోహన్‌రావు, వై.విక్రమ్‌, ముదాం శ్రీనివాసరావు, చలమల విఠల్‌రావు, జిల్లా ఉపేందర్‌, బి.కోటేశ్వరి, బండారు యాకయ్య, ముత్తేమాల ప్రసాద్‌, ఎం.తిరుమలాచార్యులు, మల్లూరు చంద్రశేఖర్‌, జలారపు మంగమ్మ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -