గాంధీ పేరు మార్పు సరిగాదు
వాటా నిధుల్ని తగ్గించడమంటే కేంద్రం పక్కకు తప్పుకోవడమే
రాముడి పేరు పెట్టి పేదల పొట్ట గొట్టడం సబబు కాదు
చట్టపరిరక్షణకు ఐక్య పోరాటాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నిరసన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రం ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి నిర్వీర్యం చేసే కుట్రను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న నరేగా పేరును వీబీ-జీ-రామ్-జీగా మార్చడాన్ని తప్పుబట్టారు. ఇలా చేయడ మంటే గాంధీని అవమానపర్చడమేనన్నారు. దాన్ని యధావిధిగా చట్ట రూపంలోనే ఉంచి నిధులను పెంచాలనీ, గాంధీ పేరును మార్చొద్దని డిమాండ్ చేశారు. ఆ చట్టం పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు చేస్తామని ప్రకటించారు. ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సీపీఐ(ఎం)ఆధ్వర్యంలో వీబీ జీ రామ్ జీ-2025 బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ బిల్లు ప్రతులను దహనం చేశారు. ‘ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలి…వీబీ జీ రామ్ జీ-2025 బిల్లును వెనక్కి తీసుకోవాలి…మోడీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలి’ అని నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు.
నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి జాన్‌వెస్లీ మాట్లాడుతూ వామపక్ష పార్టీల పోరాటాలు, అప్పటి యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడితో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ వచ్చిందని గుర్తుచేశారు. వ్యవసాయ పనులు లేనప్పుడు, కరువుల వంటి ప్రకతి వైపరీత్యాల సమయంలో కూలీలకు ఉపాధి ఎంతో ఇతోధికంగా అండగా నిలిచిందనీ, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. అలాంటి చట్టాన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా నిధులను తగ్గిస్తూ ఏటేటా నిర్వీర్యం చేస్తూ పోతున్నదని విమర్శించారు. ఇప్పుడు తాజాగా ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్ – రోజ్‌గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు ((వీబీ జీ రామ్ జీ బిల్లు)-2025ను తీసుకురావాలనుకోవడం దుర్మార్గమన్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి, దాని స్థానంలో వీబీ జీ రామ్ జీ అనే సంక్షిప్త నామాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకించారు. పథకానికి రాముడి అర్థం వచ్చేలా పేరు పెట్టి పేదల పొట్టగొట్టేలా నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమని విమర్శించారు.
డిమాండ్‌ను తీర్చడానికి బడ్జెట్ కేటాయింపులు పెంచడం తప్పనిసరి అనీ, అయితే కేంద్ర ప్రభుత్వం 90 శాతం ఉన్న తన వాటాను 60 శాతానికి కుదించడం అంటే చట్టాన్ని నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వనరులను దెబ్బతీస్తూ 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కేంద్రం ముసాయిదా బిల్లులో పెట్టడం దుర్మార్గమన్నారు. పనిదినాలు పెంచుతామని కేంద్రం చెప్పిన దాంట్లో చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్రం నిబంధనలతో కోట్లాది మంది తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని ఎత్తిచూపారు. ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలనీ, పనిదినాలను 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. అసలు చట్టంలోని నిబంధనలను నీరుగార్చడానికి, దాని ద్వారా హామీ ఇవ్వబడిన పని హక్కును పరిమితం చేయడాన్ని ఎత్తిచూపారు. మోసపూరిత బిల్లును తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యకమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్, రాష్ట్ర నాయకులు వెంకట్రాములు, భూపాల్, బి.ప్రసాద్, ఆశయ్య, శ్రీరాంనాయక్, ఉడుత రవీందర్, ఎం.శ్రీనివాస్, బాబూరావు, వెంకటేశ్, కోట రమేశ్, విజయ్, పద్మ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.



