Monday, January 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఫాసిస్టు మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం

ఫాసిస్టు మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం

- Advertisement -

బీజేపీ అంటే బ్రిటీష్‌ జనతా పార్టీ
విభజించి పాలించటం..పేదలను అణగదొక్కటమే ఆ పార్టీ విధానం
సర్‌ పేరుతో పేదల ఓటు హక్కును తొలగిస్తున్నారు
మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి పోరాడుతాం
కాంగ్రెస్‌ చేసిన చట్టాలన్నీ కమ్యూనిస్టుల పోరాట ఫలితమే
వాటిని నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కారు
అంబానీ, అదానీల కోసమే ‘ఉపాధి’కి తూట్లు
సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సీఎం రేవంత్‌ రెడ్డి

ఖమ్మం నుంచి అచ్చిన ప్రశాంత్‌

మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి తెలిపారు. తద్వారా ఫాసిస్టు మోడీ సర్కార్‌ను గద్దె దింపుతామని ఆయన ప్రతినబూనారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కమ్యూనిస్టు పార్టీల నేతలు, వారు చేసిన పోరాటాలు, త్యాగాలను ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాలు, కార్మికులు, రైతుల కోసం నికరంగా పోరాటాలు చేసేది కమ్యూనిస్టులేనని కొనియాడారు.

వారి పోరాటాలు, నినాదాల ఆధారంగా కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పలు చట్టాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దున్నేవాడికే భూమి కావాలని కమ్యూనిస్టులు నినదిస్తే… ఆనాటి ప్రభుత్వం ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ను తీసుకొచ్చిందని వివరించారు. వెట్టిచాకిరీ విముక్తి, కూలి రేట్లు, కూలీల హక్కుల కోసం ఎర్రజెండాలు పోరాడిన నేపథ్యంలో రైతాంగ చట్టాలు, ఎనిమిది గంటల పని విధానం, కనీస వేతనాలు, పంటలకు కనీస మద్దతు ధరలు తదితర చట్టాలకు రూపకల్పన జరిగిందని గుర్తు చేశారు. నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాగించిన పోరాటంలో ఆనాడు నాలుగు వేల మందికి పైగా నేలకొరిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ, హోం మంత్రి పటేల్‌ నేతత్వంలో సైన్యాన్ని దింపి నిజాం రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేశారని తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల్ల గిరిప్రసాద్‌, శేషగిరిరావు, తదితరుల పోరాటాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ప్రజలను విభజించు… పాలించడమే బీజేపీ విధానం
బీజేపీ అంటే బ్రిటీష్‌ జనతా పార్టీ అని సీఎం ఎద్దేవా చేశారు. ప్రజలను విభజించు, పాలించు, పేదలను అణగదొక్కు అనేదే బీజేపీ విధానమని విమర్శించారు. భూమి లేని నిరుపేదల కోసం లెఫ్ట్‌ పార్టీల ఒత్తిడితో యూపీఏ-1 హయాంలో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. దాంతో కూలి రేట్లు పెరిగాయనీ, వలసలు తగ్గాయని చెప్పారు. ఆ చట్టం ఫలితంగా అంబానీ, అదానీలకు తక్కువ వేతనానికి కూలీలు దొరకని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అందుకే మోడీ సర్కారు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఈ రకంగా ప్రధాని మోడీ కార్పొరేట్ల చేతిలో కీలుబొమ్మ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ హయాంలో నెలకొల్పిన ప్రభుత్వరంగ సంస్థలను నేటి బీజేపీ సర్కారు బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెడుతున్నదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను కాపాడుతున్న రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

సర్‌ ప్రక్రియ సరికాదు
‘సర్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం పేదల ఓటు హక్కును తొలగించేందుకు ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు ఓటు హక్కు అనేది గోల్వాల్కర్‌ సిద్ధాంతానికి వ్యతిరేకమని గుర్తు చేశారు. ఆనాడు పేదలకు ఓటు హక్కు ఉండొద్దని గోల్వాల్కర్‌ వాదిస్తే అంబేద్కర్‌ పట్టుబట్టి పేదలకు ఆ హక్కును కల్పించారని వివరించారు. ఇప్పుడు అదే ఓటు హక్కును తొలగించడానికి సర్‌ను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము స్థానికులమంటూ ఆదివాసీలు, గిరిజనులు, పేదలు ఎక్కడి నుంచి ఆధారాలు తీసుకొస్తారని ప్రశ్నించారు. సర్‌ ముసుగులో శాశ్వతంగా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు.

పేదలకు ఓటు హక్కు పోతే రేషన్‌ కార్డుకు వారు దూరమవుతారని హెచ్చరించారు. వారు అన్ని రకాల సంక్షేమ పథకాలకు అనర్హులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల సర్‌ ప్రక్రియ అనేదే సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ప్రజాస్వామిక, లౌకికవాదులు, కాంగ్రెస్‌వాదులు కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ సర్కార్‌ను గద్దె దింపి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టులు, వారి ఉద్యమాల ఫలితంగా ఖమ్మం జిల్లా ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్త్తోందని పేర్కొన్నారు. ఈ కారణం రీత్యా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా వచ్చినా… ఖమ్మంలో ఇద్దరు సర్పంచులను కూడా బీజేపీ గెలిపించుకోలేదని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -