– ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభను జయప్రదం చేద్దాం : ప్రముఖ సినీ నిర్మాత రాజ్ కందుకూరి, సినీ దర్శకులు బాబ్జి
– మహాసభ జానపద ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
ప్రజాకళలను ప్రోత్సహిస్తూ.. ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ప్రముఖ సినీ నిర్మాత రాజ్ కందుకూరి, సినీదర్శకులు బాబ్జి పిలుపునిచ్చారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర మూడో మహాసభ సందర్భంగా నిర్వహించనున్న జానపద ఉత్సవాల పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలింనగర్‌లో సోమవారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సినిమా రంగానికి మహానటులైన అల్లు రామలింగయ్య, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, మాదాల రంగారావులాంటి ఎంతోమందిని అందించింది ప్రజానాట్యమండలి అని గుర్తుచేశారు. ప్రజానాట్యమండలిలో పనిచేసే నాయకత్వం నుంచి ”మాభూమి” వంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయన్నారు. పీడిత, తాడిత ప్రజల సమస్యలపై స్వరాన్ని వినిపిస్తూ కళారూపాల ద్వారా సమాజాన్ని ప్రజానాట్యమండలి చైతన్యవంతం చేస్తోందని తెలిపారు. ఈ మహాసభను విజయవంతం చేయడంలో ప్రజా కళాకారులు, సినీ ప్రముఖులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
అభ్యుదయ సినిమాలు నిర్మించడంలో, ఆ సినిమాల్లో నటించడంలో ప్రజానాట్యమండలిలో పనిచేసిన ఎందరో నటులే ముందున్నారన్నారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, రైతుల సమస్యలు, మహిళల హక్కుల కోసం తమ కళారూపాల ద్వారా పోరాడిన సంస్థ ఇదన్నారు. సమానత్వం, సామరస్య తతో కూడిన సమాజం నిర్మాణమే ప్రజానాట్య మండలి లక్ష్యం అని చెప్పారు. మహాసభను విజయవంతం చేయడంలో హైదరాబాద్ ప్రజలు, సినీ ప్రముఖులు చురుకైన పాత్ర పోషించాలని నిర్వాహకులు కోరారు. రాష్ట్ర నలుదిక్కుల నుంచి దాదాపు 600 మంది ప్రతినిధులు మూడ్రోజుల జానపద ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి మహాసభ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.మారన్న, కోశాధికారి కళ్యాణ్, ప్రజానాట్యమండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కొండూరి భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు రాము, హైదరాబాద్ నగర కమిటీ సభ్యులు క్రాంతి కుమార్, ప్రజా సంఘాల నాయకులు ఎన్.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాకళలను ప్రోత్సహిద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

