Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలురాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

- Advertisement -

ఎంపీలు ఆత్మప్రభోదానుసారం ఎన్నికల్లో ఓటు వేయాలి
ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
53 ఏండ్లు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేశా : జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి విజయం కోసం పార్లమెంటు సభ్యులు ఆత్మప్రభోదానుసారం ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి కోరారు. దేశంలో రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందనీ, ఇండియా కూటమి దానికి భిన్నంగా రిజర్వేషన్ల పెంపు, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నదని తెలిపారు. ఈ విధానాల ప్రాతిపదికగానే ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పరిచయ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగింది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్‌, జూపల్లి కృష్ణారావు, పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు సహా సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సభకు అధ్యక్షత వహించారు. జాతీయ రాజకీయాల్లో తెలుగు నేల నుంచి నీలం సంజీవరెడ్డి, పి.వి నరసింహారావు, జైపాల్‌రెడ్డి, వెంకయ్య నాయుడు వివిధ దశలు, సందర్భాల్లో క్రియాశీల పాత్ర పోషించారని సీఎం చెప్పారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి ఉనికి ప్రశ్నార్థకమైందన్నారు. దేశంలో అత్యధిక జనాభా మాట్లాడే రెండో భాషగా తెలుగు ఉందనీ, జాతీయ రాజకీయాల్లో కూడా తెలుగువారికి అంతటి గుర్తింపు ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు వ్యక్తిని ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బలపరిచి, జాతీయ స్థాయిలో తెలుగుజాతి గౌరవం పెరిగేలా చూడాలని తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల అధ్యక్షులు చంద్రబాబునాయుడు, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కే చంద్రశేఖర్‌రావు, పవన్‌కళ్యాణ్‌లను కోరారు. తెలుగు రాష్ట్రాల నుంచి 42 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని కోరారు. ఉప రాష్ట్రపతిగా ధన్‌కడ్‌ రాజీనామా తర్వాత దేశ పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

18 ఏండ్లకు వయోజన ఓటు హక్కుతో రాజీవ్‌గాంధీ ప్రజాస్వామ్యంలో అందరినీ భాగస్వామ్యం చేశారనీ, కానీ ఇప్పుడు ఓట్ల చోరీతో నెగ్గాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి 53 ఏండ్లుగా రాజ్యాంగానికి లోబడి వివిధ హోదాల్లో పనిచేశారని వివరించారు. ప్రజస్వామ్య, రాజ్యాంగ హక్కులకు భంగం వాటిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంబేద్కర్‌ విధానాలపై సంపూర్ణ విశ్వాసం కలిగిన జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి పెద్దల సభను నడిపిస్తే అది తెలుగువారికి గొప్ప గౌరవంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలు మసకబారుతున్న సమయంలో తన వంతు కర్తవ్యంగా గళమెత్తుతున్నానని తెలిపారు. 53 ఏండ్లుగా నిబద్ధతతో రాజ్యాంగ స్ఫూర్తితో పని చేశాననీ, తాను ఏ రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి పదవికి పోటీపడుతున్నాననీ, తనకు ఓటు వేయాలని వ్యక్తిగతంగా పార్లమెంటు సభ్యులందర్నీ కోరతానని అన్నారు. ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్న క్లిష్ట పరిస్థితుల్లో రాజ్యాంగ రక్షణ అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ సభ్యులను ఉద్దేశించి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి రాసిన లేఖను సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్కమార్క, ఎంపీ మల్లురవి, పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌లు విడుదల చేశారు.

విధానాల నడుమే పోటీ : సీపీఐ జాతీయ నాయకులు కే నారాయణ
ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాజ్యాంగం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం కాపాడేవారికీ, వాటిని ఖూనీ చేసేవారికి మధ్య జరుగుతున్నాయని సీసీఐ జాతీయ నాయకులు కే నారాయణ అన్నారు. ఉప రాష్ట్రపతిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఎన్నికైతే న్యాయం గెలుస్తుందని చెప్పారు.

హక్కులు కాపాడుకునే ఎన్నిక సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
రాజ్యాంగం స్థానంలో మనువాదం తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందనీ, దాన్ని వ్యతిరేకిస్తూ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. అన్ని రంగాల్లో అసమానతలు, మూఢవిశ్వాసాలు, మతాల మధ్య వైరుధ్యాలు, దేశ సంపద దోపిడీకి గురవుతున్న ప్రస్తుత తరుణంలోఉప రాష్ట్రపతి ఎన్నిక ఎంతో కీలకమని తెలిపారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని ఇండియా కూటమితో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు సైతం తమ అభ్యర్థిగా ఎంచుకున్నాయనీ, దీనితో 65 శాతం మంది ప్రజల మద్దతు లభించినట్టవుతోందని విశ్లేషించారు. తమపార్టీ తరఫున జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి అభినందనలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad