Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిప్రజా రవాణా వ్యవస్థను రక్షించుకుందాం

ప్రజా రవాణా వ్యవస్థను రక్షించుకుందాం

- Advertisement -

దేశంలో డీజిల్‌ ధరలు పెరగడం, పాత బస్‌లనే నడపడం వల్ల మెయింటనెన్స్‌ ఖర్చులు పెరగడం, కొత్త బస్‌ల కొనుగోలు చేయకపోవడం, కొత్త బస్‌లతో ఆగ్యుమెంటేషన్‌ చేయకపోవడం, ప్రయివేటు బస్‌ రవాణా కూడా పెరగడం అనేవి ఆర్టీసిల ఆర్ధిక పరిస్థితి దిగజారడానికి కారణం అని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘నిటి ఆయోగ్‌’ విడుదల చేసిన ‘అన్‌లాకింగ్‌ 200 బిలియన్‌ డాలర్స్‌ అపార్చ్యునిటీ – ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఇన్‌ ఇండియా’ అనే నివేదికలో తెలియజేసింది. ఆర్టీసి విస్తరణను అడ్డుకుంటున్నది పాలకులే. 1989 నుండి ఆర్టీసి విస్తరణను అడ్డుకున్నది కేంద్ర ప్లానింగ్‌ కమీషన్‌యే. అలాగే ఆర్టీసి యాక్ట్‌ ప్రకారం ఆర్టీసీలకు ఇవ్వాల్సిన 1:2 పద్ధతిన మూల ధన పెట్టుబడిని ఇవ్వడం నిలిపివేశాయి. ప్రయివేటు ఆపరేటర్స్‌ ముందుకు రాని చోట మాత్రమే ఆర్టీసిలకు పర్మిట్స్‌ ఇవ్వాలని ఎం.వి. యాక్ట్‌ – 1988లో సవరణ చేసి ప్రయివేటు పోటీని పెంచింది కేంద్ర పాలకులే. ఎం.వి. యాక్ట్‌ సవరణ బిల్లు – 2019ని ముందుకు తెచ్చి అగ్రిగేటర్‌ సంస్థలకుఅవకాశం కల్పించారు. పర్మిట్ల విధానంలో మార్పులు చేశారు. టూరిస్ట్‌ పర్మిట్‌ల పేరుతో ఆర్టీసిలకు పోటీగా స్టేజి కారియర్స్‌గా నడుపుకొనే అవకాశం కల్పించారు. అంతర్జాతీ యంగా ముడి చమురు ధరలు తగ్గినా, భారతదేశంలో డీజిల్‌ ధరలు తగ్గించని ఫలితంగా ప్రజా రవాణా సంస్థలు తీవ్ర ఆర్థిక భారం మోస్తున్నాయి. ఆర్టీసీల నిర్వ హణ వల్ల ఆదాయా నికి, ఖర్చుకు మధ్య వస్తున్న తేడాని రీ-ఎంబర్స్‌ చేయ డం లేదు. ఇవన్నీ గమనించినప్పుడు ఆర్టీసిలు నేడు ఎదుర్కొం టున్న ఆర్ధిక సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని అర్థమవుతున్నది. ఆ విషయాన్ని దాచి పెట్టి ఆర్టీసి పరిస్థితిని అడ్డం పెట్టుకుని, విద్యుత్‌ బస్‌ల పేరుతో ఆర్టీసిలను నిర్వీర్యం చేసి ప్రయివేటు కార్పొరేట్లకు కట్టబెడుతుండటం సరైందికాదు.
కార్పొరేట్లకు దోచిపెడుతున్న పాలకులు
విద్యుత్‌ బస్‌ల విధాన ప్రకటన 2015లో పాలకులు ముందుకు తెచ్చారు. 2019లో ”ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ అండ్‌ హైబ్రిడ్‌ వెహికిల్‌” ఫేమ్‌-1 తీసుకొచ్చారు. కొన్ని పట్టణాల్లో మాత్రమే అమలు చేశారు. ఆ పథకంలో భాగంగా వచ్చినవే మనదగ్గర 2019 నుండి ఎయిర్‌పోర్టుకు నడుస్తున్న విద్యుత్‌ బస్‌లు. ఆ తర్వాత ఫేమ్‌-2ను ముందుకు తెచ్చారు. ఫేమ్‌-1లో యజమానులకు బస్‌ ఖరీదులో సగం (రూ.కోటి) సబ్సిడీగా ఇస్తే, ఫేమ్‌-2లో బస్‌ ఖరీదులో 50శాతం కంపెనీలకు సబ్సిడీగా ఇచ్చారు. ఈ పథకం కింద 5165 బస్‌లు కేంద్ర నిధులతో సమకూర్చారు. ఆ తర్వాత కేంద్ర ఫ్రభుత్వం నేషనల్‌ ఎలక్ట్రికల్‌ బస్‌ల ప్రోగ్రాం (ఎన్‌ఇబిపి) ద్వారా కొన్ని విధాన నిర్ణయాలు మార్చారు. అప్పటివరకు పెట్టుబడులపై సబ్సిడీలు ఇచ్చే పద్ధతిని మార్చి ఆపరేషనల్‌ సబ్సిడీలు ఇచ్చే పద్ధతి ముందుకు తెచ్చారు. అందులో నుండి ముందుకు వచ్చిన పథకమే ‘పీఎం ఈ-బస్‌ సేవా” పథకం. ఈ పథకం కింద 20వేల కోట్లతో 10వేల బస్‌లకు పిపిపి (జిసిసి) పద్ధతిలో తెచ్చి ఆర్టీసిలపై రుద్దారు. అదే తరహాలో ముందుకు తెచ్చిన పథకం ”పీఎం ఈ డ్రైవ్‌” పథకం. 10,900 కోట్లతో ప్రకటించిన ఈ పథకం అమల్లోకి రావలసి ఉంది.అంతేకాక ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పిఎల్‌ఐ) పేరుతో ఆటోమోబైల్‌ ఇండస్ట్రీకి రూ.25,938 కోట్లు, బ్యాటరీ స్టోరేజి కోసం అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ (ఎసిసి)లకు 18,100 కోట్లు, మొత్తం 44,038 కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు.
ఆర్టీసిలను ఆదుకోవడానికి నేరుగా ఒక్క రూపాయి ఇవ్వడానికి ముందుకురాని ప్రభుత్వాలు పర్యావరణం పేరుతో వేల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు లబ్ది చేకూరుస్తున్నాయి. విద్యుత్‌ బస్‌ల నిర్వహణ పేరుతో మనం తిరిగి సష్టించలేని భూమి కూడా కార్పొరేటర్లకు కట్టబెడుతున్నాయి. ఏ ప్రజా రవాణా సంస్థ అయినా ఒక శతాబ్దకాల అవసరాలను దష్టిలో పెట్టుకొని భూమిని సమకూర్చాలి. అదే ముందుచూపుతో ఉమ్మడి ఆర్టీసీ అనేక వేల ఎకరాల భూమిని సమకూర్చింది. ఆర్టీసి మీద అధ్యయనం చేసిన ఐఐటీ బెంగళూరు నివేదికలో కూడా ఆర్టీసి అప్పుల్లో ఉన్నప్పటికి, వేల ఎకరాల భూమిని సమకూర్చుకోవడం గొప్ప విషయమని అంగీకరించింది. హైబ్రీడ్‌ పద్ధతిలో విద్యుత్‌ బస్సుల నడపడంతో పాటు, పూర్తిగా డిపోలను ఖాళీచేసి విద్యుత్‌బస్‌ల సంస్థకు అప్పచెప్పడం కోసం పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 19, తమిళనాడులో 5 డిపోల స్థలాలను ఆ రకంగా ఇవ్వడానికి చూస్తున్నారు. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది.
టిజీఎస్‌ఆర్టీసీలో పరిస్థితి
టిజీఆర్టీసిలో ఇప్పటివరకు 575 విద్యుత్‌ బస్‌లు నడుస్తున్నాయి. నిజామాబాద్‌-2, వరంగల్‌-2, హయత్‌నగర్‌, హెచ్‌సియు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ల నుండి విద్యుత్‌ బస్‌లు నడుపుతున్నారు. హైదరాబాద్‌కు పిఎమ్‌ ఇ-బస్‌ సేవా పధకం క్రింద 2000 బస్‌లు కేటాయించారు. ఈ బస్‌లు వస్తే మొత్తం హైదరాబాద్‌లో విద్యుత్‌ బస్‌లే అవుతాయి. పిఎమ్‌ఇబస్‌ పథకం కింద కిలోమీటర్‌ రూ.24 సబ్సిడీ ఇచ్చినా కి.మీ.కి ఎనిమిది రూపాయలు ఆదాయం కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నది. బస్‌ల సంఖ్య పెరిగితే ఆర్టీసిపై ఆ మేరకు భారం పెరుగుతుంది. దీన్ని ఎలా భర్తీ చేస్తారు? విద్యుత్‌ బస్‌ల వల్ల (జిసిసి పద్ధతి వల్ల) వేలాది మంది కార్మికులు ఉద్యోగాలు ప్రమాదంలో పడ తాయి. గ్యారేజి కార్మికులు, డ్రైవర్లు ప్రధాన బాధితులుగా ఉంటే తర్వాత మిగిలిన క్యాటగిరీలు ఉంటాయి.
డీజిల్‌పై పెడుతున్న ఖర్చును తగ్గించడం కోసం, వాతావరణ, శబ్దకాలుష్యాన్ని తగ్గించడం పేరుతో దేశంలోని ఆర్టీసీల్లో విద్యుత్‌ బస్‌లను కేంద్రం ముందుకు తెచ్చింది. అయితే విద్యుత్‌బస్‌ విధానంలో మౌలిక మార్పులు చేయాలని, ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌) డిమాండ్‌ చేస్తోంది. అలాగే కేంద్రం విద్యుత్‌ బస్‌ల కోసం యజమానులకు ఇస్తున్న సబ్సిడీలను, నిధులను, వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌లను ఆర్టీసిలకు ఇవ్వాలని కోరు తున్నది. ఆర్టీసిలకున్న విలువైన భూములను విద్యుత్‌బస్‌ల పేరుతో ప్రయివేటు సంస్థలకు అప్పచెప్పే విధానం విరమిం చుకోవాలని హెచ్చరిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నిధులను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ 2025 సెప్టెంబర్‌ 12న ‘ఆర్టీసీ పరిరక్షణ దినం’ పాటించాలని పిలుపునిస్తున్నది. ఈ డిమాండ్స్‌తో కూడిన బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరు కావాలని కార్మికులను కోరుతున్నది.ఈ దేశవ్యాప్త కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టిజీఎస్‌ఆర్టీసి స్టాఫ్‌ అండ్‌వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.

ప్రధాన డిమాండ్స్‌

  1. విద్యుత్‌ బస్‌ల విధానంలో మార్పులు చేసి, జిసిసి మోడల్‌ను రద్దు చేయాలి.
  2. విద్యుత్‌ బస్‌లు ఆర్టీసీలే కొని, నిర్వహించేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వాలివ్వాలి.
  3. ఆర్టీసి గ్యారేజీలను అభివృద్ధి చేయాలి, అవసరమైన శిక్షణనిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి
  4. బస్‌ల నిర్వహణలో ఆదాయానికి, ఖర్చుకు మధ్య వస్తున్న తేడాని ప్రభుత్వాలే నిధులివ్వాలి
  5. ఆర్టీసిని ప్రజారవాణా సంస్థగా చూడాలి, ప్రజల అవసరాల మేరకు బస్‌లను సమకూర్చాలి.
  6. అవసరమైన అన్ని పోస్టులలో రిక్రూట్‌మెంట్‌ను జరపాలి.
  7. కాంట్రాక్టు విధానం రద్దు చేసి, అన్ని పోస్టులు రెగ్యులర్‌ పోస్టుల్లో నియమించాలి.
  8. అన్ని క్యాటగిరీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
  9. వేతన ఒప్పందాలు వెంటనే చేసి, అరియర్స్‌తో సహా వెంటనే చెల్లించాలి.
  10. ఆర్టీసి ఆస్తుల నగదీకరణ నిలిపివేసి, వాటిని ఆర్టీసినే అభివృద్ధి చేయాలి.

    వి.ఎస్‌.రావు
    9490098890
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad