గాంధీజీ విగ్రహం వద్ద సిఐటియు, రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ
నవతెలంగాణ – బోనకల్
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి కొత్తగా తీసుకొచ్చిన వి బి జి రాంజీ బిల్లుతో పేద కూలీల పొట్టను కొట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందని సిఐటియు మండల కన్వీనర్ గుగులోత్ నరేష్, సిఐటియు కోకన్వీనర్ బోయినపల్లి వీరబాబు, తెలంగాణ రైతు సంఘం మండల నాయకులు, రావినూతల గ్రామ ఉపసర్పంచ్ దొండపాటి సత్యనారాయణ విమర్శించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల పరిధిలోనే రావినూతల ఉన్నత పాఠశాలలో ఉన్న మహాత్మ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు నష్టం కలిగించే వి బి జి రాంజీ బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా 2005లో కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. మతోన్మాదం, కార్పోరేట్, పెట్టుబడిదారి, దోపిడి విధానాలకు వ్యతిరేక ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుంటామని గాంధీ విగ్రహం సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు.
ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సంఘటిత, అసంఘటిత, అమాలీ కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ పంతు గ్రామీణ వైద్య ల సంఘం జిల్లా నాయకులు డాక్టర్ కొంగర గోపి, జిఎంపిఎస్ జిల్లా నాయకులు జోనిబోయిన గురవయ్య, పంచాయతీ పాలకవర్గ సభ్యులు షేక్ పటాన్ అఫ్జల్, ధరావత్ కృష్ణ, రైతు సంఘం, సిఐటియు నాయకులు వట్టికొండ రమేష్, మచ్చ గురవయ్య, తాళ్లూరు ఏసు, రైతు సంఘం గ్రామ అధ్యక్షులు షేక్ నన్నేసాబ్, తదితరులు పాల్గొన్నారు.



