– తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు
– సీఎం రేవంత్‌రెడ్డి సూచనతో యూనిఫాం డిజైన్
– తక్కువ ఖర్చుతో అత్యాధునిక సదుపాయాలు
– ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం
– రెవెన్యూ వ్యవస్థ ఆధునీకరణకు కట్టుబడి ఉన్నాం : మంత్రి పొంగులేటి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శక మైన, మెరుగైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మొదటి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 తహసీల్దార్, ఐదు ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలను నిర్మిస్తామని వెల్లడించారు. రెండో విడతలో శిథిలావస్ధలో ఉన్న 170 ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి డిజైన్లకు తుది రూపు ఇస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందేలా ఈ భవనాల నిర్మాణం ఉంటుందని చెప్పారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు ముగింపు పలుకుతామని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో ఎన్ని తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి, శిథిలావస్థ, పాలనకు అనువుగా లేని భవనాలు వివరాలను సేకరించాలి.’అని అధికారులను పొంగులేటి ఆఏశించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదని ఆయన చెప్పారు. ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత కూడా రెవెన్యూ కార్యాలయాలు ప్రజలకు సౌకర్యవంతంగా లేకపోవడం తోపాటు చాలావరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా, ప్రణాళికాబద్ధత లేకుండా మండలాల పునర్విభజన చేపట్టిందనీ, కొన్ని మండలాలు రెండు మూడు జిల్లాల పరిధిలోకి వచ్చే విధంగా రూపొందించిందని వివరించారు. అనేక కార్యాల యాల్లో కనీస వసతుల్లేకపోవడం, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త మండలాలకు అవసరమైన పోస్టులను మంజూరు చేసి పరిపాలనను బలోపేతం చేశామ న్నారు. ప్రజలకు దూరంగా కలెక్టరేట్లను నిర్మించి నిర్వహణను గాలికి వదిలేశారని విమర్శించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వసతులతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలను నిర్మిస్తున్నామని అన్నారు. ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్-మల్కాజిగిరి, పటాన్ చెరులలో భవనాలకు శంకుస్థాపన పూర్తయ్యిందని వివరించారు. గచ్చిబౌలిలో నిర్మాణ పనులు తుది దశలో ఉండి మరికొద్ది నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ఆధునికీకరించి, ప్రజలకు వేగవంతమైన సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి లోకేశ్‌కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.
అద్దె భవనాలకు ముగింపు పలుకుతాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



