Wednesday, May 7, 2025
Homeతాజా వార్తలుకార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

- Advertisement -

– 20న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి: సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-భువనగిరి

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలంటూ.. మే 20న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్నిరంగాల కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని తిరందాసు గోపి మీటింగ్‌ హాల్‌లో మంగళవారం జరిగిన సీఐటీయు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం కార్మికుల హక్కులను కాలరాస్తోందని, గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి.. 4లేబర్‌ కోడ్‌లను తీసుకొస్తోందని విమర్శించారు. వాటిల్లో కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయన్నారు. 8గంటల పని విధానాన్ని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ.. కార్మికోద్యమం, కార్మిక ఐక్యతపై దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికోద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోందని వివరించారు. ఈ క్రమంలో కార్మిక ఐక్య పోరాటలను ఉధృతం చేయడంలో భాగంగా.. మే 20న దేశవ్యాప్త సమ్మెలో ప్రతి కార్మికుడూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్షకార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ పాషా, గొరిగే సోములు, జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ, తుర్కపల్లి సురేందర్‌, సుబ్బురి సత్యనారాయణ, గడ్డం ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -