విజయవాడ పుస్తక మహోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ
విజయవాడ : ఆంగ్ల మాధ్యమ ప్రభావం నుండి తెలుగు భాషను కాపాడుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ అన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 36వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ప్రధాన అతిథిగా హాజరైన ఆయన శుక్రవారం సాయంత్రం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జస్టిస్ శ్రీ నరసింహ మాట్లాడుతూ ప్రతి మంచి పుస్తకానికీ తనదైన వ్యక్తిత్వం, జీవలక్షణం ఉంటాయన్నారు. చాలా పుస్తకాలు అల్పాయువులని, కొన్ని పుస్తకాలు చిరాయువులని తెలిపారు. పుస్తకాలు పాఠకులతో తమదైన బాంధవ్యాన్ని పెంపొందించుకుంటా యన్నారు. తన విద్యాభ్యాసమంతా ఆంగ్లమాధ్యమం లో జరిగినా తండ్రి సూచనల మేరకు తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నానని తెలిపారు. పుస్తకాలు చదవడం అనే సంస్కృతిని తర్వాతితరాలకు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు.
సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె.రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ తెరలపై పుస్తకాలను చదవడం అంత రసవత్తరమైన అనుభవం కాదన్నారు. అందుకే నిజమైన పాఠకులంతా మళ్లీ పుస్తకాలవైపు మళ్లుతున్నారని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో పుస్తక మహోత్సవానికి స్థలం కేటాయించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ పుస్తక ప్రచురణకర్తలు… రచయితలకు పురుడుపోసే మంత్రసానిలాంటివారని పేర్కొన్నారు. ఆధునిక ఎలక్ట్రానిక్ మాధ్యమాలు పుస్తకాలకు ప్రత్యామ్నాయాలు కాలేవన్నారు. ఆత్మీయ అతిథిగా హాజరైన సిపిఐ జాతీయ నాయకులు కె.నారాయణ మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమమే స్వాతంత్య్రోద్య మానికి దారి తీసిందని గుర్తుచేశారు. స్వరాజ్య మైదానాన్ని పుస్తక మహోత్సవానికి, ప్రజలకు దూరం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ పత్రికా సంపాదకులు కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ పుస్తక పఠనం పట్ల యువతలో ఆసక్తి పెరుగుతోందన్నారు. పాత్రికేయులు, కవి అప్పరసు కృష్ణారావు మాట్లాడుతూ అనాదిగా సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న ఘనత పుస్తకాలకే దక్కుతుందని, సమాజం, శాస్త్రవిజ్ఞానం, వ్యవస్థల పనితీరును, పరిణామక్రమాన్ని అద్దం పడుతూనే భవితకు మార్గదర్శనం చేయగల శక్తి పుస్తకాలకు ఉందని పేర్కొన్నారు. పుస్తక మహోత్సవ కమిటీ కార్యదర్శి కె.లక్ష్మయ్య స్వాగతోపన్యాసం చేశారు. కన్వీనర్ డి.విజయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. అధ్యక్షులు టి.మనోహర్ నాయుడు వందన సమర్పణ చేశారు.
తెలుగును కాపాడుకుందాం
- Advertisement -
- Advertisement -



