జిల్లాలు, ప్రాజెక్టుల వారీగా సిద్ధంకండి
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం
ఒకటిన ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్
రెండున కృష్ణా జలాలు, మూడున గోదావరిలో వాటాలపై అసెంబ్లీలో చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రానికి సంబంధించిన నీటి వాటాలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తోన్న నేపథ్యంలో ఈనెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆ పార్టీపై ఎదురుదాడికి దిగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాలు, బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఒప్పందాలపై అంకెలు, సంఖ్యలు, గణాంకాలతో సిద్ధం కావాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రిపరేషన్‌లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఎంపీలకు కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇప్పించాలని సీఎం నిర్ణయించారు. ఆ మేరకు అన్ని వివరాలను తెప్పించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన కోరారు. ప్రజా ప్రతినిధులకు అర్థమయ్యేలా సూటిగా, స్పష్టంగా, విడమరిచి చెప్పాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేసినట్టు అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం సూచనల మేరకు కొత్త ఏడాది ప్రారంభం రోజైన జనవరి ఒకటిన హైదరాబాద్ బేగంపేటలోగల ప్రజా భవన్‌లో మంత్రి ఉత్తమ్…పీపీటీ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రజాభవన్ అధికారులు తెలిపారు. పీపీటీకి విధిగా హాజరు కావాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. జనవరి ఒకటిన షరా మామూలుగా ఉండే పార్టీలు, వేడుకలకు వెళ్లాల్సి ఉంటుందని, అందువల్ల ఆ రోజు కాకుండా మరో రోజు పీపీటీ ఇవ్వాలంటూ పలువురు ప్రజా ప్రతినిధులు కోరినప్పటికీ సీఎం తిరస్కరించారని సమాచారం. అసెంబ్లీలో సీరియస్‌గా చర్చించాల్సిన అంశం కాబట్టి, జనవరి ఒకటిన ఎవ్వరికీ మినహాయింపునిచ్చేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది. కాగా జనవరి 2న కృష్ణా జలాలపై, 3న గోదావరి జలాలపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ చర్చలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి చర్చలో పాల్గొంటూ అనేక విషయాలను సోదాహరణంగా వివరించనున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ హీటెక్కటం ఖాయంగా కనబడుతోంది. కాగా ఈనెల 29న శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆ రోజు కార్యకలాపాల తర్వాత జనవరి ఒకటికి ఉభయ సభలు వాయిదా పడనున్నాయి.
నీళ్లపై నిగ్గు తేలుద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



