ఏరియాస్పత్రుల్లో డీసీహెచ్‌ఎస్‌లతో కొందరు సిబ్బంది మిలాఖత్
డ్యూటీ చేయకుండానే జీతాలు ఎత్తుతున్న వైనం
ఉన్నతాధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మీరూ…మేమూ ఒక్కటవుదాం…మేం సంతకాలు పెట్టేస్తాం…జీతాలు చెరి సగం పంచేసుకుందాం…ఇదీ రాష్ట్రంలోని పలు ఏరియాస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సిబ్బంది బాగోతం. విధులకు హాజరు కాని సిబ్బందితో డీసీహెచ్‌ఎస్‌లు మిలాఖత్ అయి ఈ పర్వానికి ద్వారాలు తెరిచారనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర కేంద్రం నుంచి పర్యవేక్షించే అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న తీరు కింది నుంచి పైదాకా లింకు ఉందా? అనే అనుమానాలకు తావిస్తున్నది. కొన్ని ఆస్పత్రుల్లోనైతే సీపీఎఫ్, టీఎస్‌బీఎల్‌ఐసీ, జీపీఎఫ్ చెల్లింపులు కూడా చేయట్లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లా పరకాల ఏరియాస్పత్రి వైద్య విధాన పరిషత్ (డీసీహెచ్‌ఎస్) పరిధిలో రెండు ఆస్పత్రులున్నాయి. అందులో ఒకటి పరకాల ఏరియాస్పత్రి కాగా, మరొకటి కమలాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. పరకాల ఏరియాస్పత్రిలోనే డీసీహెచ్‌ఎస్ కార్యాలయం ఉంది.
ఆ ఆస్పత్రిలోని అకౌంట్ విభాగంలో ఓ సీనియర్ అసిస్టెంట్ పదేండ్లుగా అక్కడే పాతుకుపోయారు. అక్కడ ఆయన చెప్పిందే వేదం అన్నట్టు నడుస్తుందనే చర్చ ఉంది. డ్యూటీకి రాని డాక్టర్లు, కొందరు సిబ్బందితో ఆయన మిలాఖత్ అయినట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో వారు ఆస్పత్రి విధులకు హాజరుకాకపోయినా హాజరైనట్టు చూపుతారనే ఆరోపణ ఉంది. డ్యూటీకి రాకపోయినా పదిపదిహేను రోజులకోసారి సంతకాలు రిజిస్ట్రర్‌లో నమోదవుతూనే ఉంటాయి. ఆ డాక్టర్లు, సిబ్బంది పేరుతో విడుదలయ్యే జీతంలో చేతివాటం ప్రదర్శించే ఆ అధికారులు, సిబ్బంది చెరిసగం పంచుకుంటారనే చర్చ బహిరంగంగానే వినిపిస్తున్నది. అయినా, ఎవరిపైనా చర్యలుండవు. ఇలాంటివి చాలా ఆస్పత్రుల్లో జరుగుతున్నా బయటపెట్టడానికి సిబ్బంది భయపడుతున్నారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల పరిధిలోని రెగ్యులర్ ఉద్యోగులకు జీపీఎఫ్, ఎల్‌ఐసి కట్టట్లేదనే విమర్శా ఉంది. వాస్తవానికి ఉద్యోగుల బేసిక్ పే నుంచి పది శాతాన్ని సీపీఎఫ్ అమౌంట్‌గా కట్ చేస్తున్నారు. ఎల్‌ఐసీ పాలసీ కోసం కూడా కట్ చేస్తున్నారు.
ఆ డబ్బులు జీతాల నుంచి కట్ అవుతున్నప్పటికీ వ్యక్తిగత ఖాతాల్లో జమకావట్లేదని ఉద్యోగులు వాపోతున్నారు. దీనిపై పలు పత్రికల్లో కథనాలు వచ్చినా సదరు అధికారిపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టే ఆయన పలుకుబడి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు సేకరించి రాష్ట్రం ఖజానా నుండి జీతాలు వేస్తున్నది. పరకాల ఏరియాస్పత్రి పరిధిలో పనిచేస్తున్న 12 మంది ఉద్యోగులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలను సదరు అధికారి సరిగా పంపలేదనే విమర్శ బలంగా ఉంది. దీంతో వారికి సంబంధించిన నవంబర్ నెల వేతనం డిసెంబర్ 26న వచ్చిన దుస్థితి. డిసెంబర్ నెల వేతనాలు సైతం ఇలాగే ఆలస్యంగానే అందాయి. గమ్మత్తేటంటే ఆ ఆస్పత్రిలోనే ఔట్‌సోర్సింగ్ విభాగానికి చెందిన కొందరు ఉద్యోగులు విధులు నిర్వర్తించకపోయినా వారి వేతనాలు మాత్రం సకాలంలో పడుతున్నాయి. అందులోనూ నీకు సగం, నాకు సగం అనే కమిట్‌మెంట్ ఉన్నట్టు చర్చ నడుస్తున్నది. ఇదేందని సదరు ఉద్యోగిని ప్రశ్నిస్తే డిప్యూటేషన్ పేరుతో బెదిరిస్తున్నారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
జీపీఎఫ్ జమ కావట్లేదు
ఇలాంటి సమస్యలు ఒక్క పరకాల ఆస్పత్రిలోనే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో రెగ్యులర్ ఉద్యోగులకు జీపీఎఫ్, సీపీఎఫ్, టీజీ ఎల్‌ఐసీ సరిగా కట్టట్లేదనే విషయం మా దృష్టికి వచ్చింది. అంతెందుకు మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న నాకు కూడా జీపీఎఫ్ జమ కావట్లేదు. ఉద్యోగుల డిడక్షన్స్ అమౌంటును వారి వారి అకౌంట్లో సరి చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నాం. రాష్ట్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. -బైరపాక శ్రీనివాస్ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్. వైద్య విధాన పరిషత్ విభాగం కార్యదర్శి
సంతకాలు పెట్టేదాం…జీతాలు పంచేసుకుందాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



