Friday, May 9, 2025
Homeప్రధాన వార్తలుసైన్యానికి అండగా ఉందాం

సైన్యానికి అండగా ఉందాం

- Advertisement -

– ఈ సమయంలో రాజకీయాలకు తావు లేదు
– అత్యవసర విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు
– మంత్రులు, అధికారులందరూ అందుబాటులో ఉండాలి
– రక్త, ఆహార నిల్వలను సిద్ధం చేయండి
అసత్య వార్తలను అడ్డుకోవడానికి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి : ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మనమందరం సైన్యానికి అండగా ఉందామంటూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాజకీయాలకు, పార్టీలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, డీజీపీ జితేందర్‌, హౌమ్‌ సెక్రటరీ రవి గుప్తా, ఆర్మీ, పోలీస్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి మీడియా ప్రతినిధులతో కొద్ది సేపు మాట్లాడారు. దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలన్నారు. అత్యవసర సర్వీస్‌ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేసినట్టు ప్రకటించారు. మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని కోరారు. రక్తం, ఆహారం, అత్యవసర ఔషధాల నిల్వలను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అసత్య వార్తలను అడ్డుకునేందుకు వీలుగా ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అలాంటి వార్తలను ప్రచారం చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్‌ మీడియాలో అనవసరమైన ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం ఈ సందర్భంగా హెచ్చరించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుంచి అనధికారికంగా వచ్చి రాష్ట్రంలో నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో బెడ్ల అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలనీ, రెడ్‌ క్రాస్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సైబర్‌ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు.
ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దనీ, అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏవైనా అనుమానాలుంటే వెంటనే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. అసత్యవార్తల వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందని సీఎం హెచ్చరించారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూంకి అనుసంధానించాలని ఆయన ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాలు, సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతను పెంచాలన్నారు. హైదరాబాద్‌లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర, ఐటీ సంస్థల దగ్గర భధ్రతను పెంచాలని ఆదేశించారు. హైదరాబాద్‌ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలనీ, అవసరమైతే పీస్‌ కమిటీ లతో మాట్లాడాలని సూచించారు. రౌడీషీట్‌ నేపథ్యం ఉన్నవారు, పాత నేరస్తుల పట్ల పోలీస్‌ శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -