Wednesday, July 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎల్‌ఐసీని బలోపేతం చేసుకుందాం

ఎల్‌ఐసీని బలోపేతం చేసుకుందాం

- Advertisement -

– ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను అడ్డుకుందాం
– కార్మిక సంఘాల హక్కుల కోసం విశాల ఐక్యవేదికగా పోరాటాలు
– లేబర్‌కోడ్‌లను వెనక్కి తీసుకోవాల్సిందే : ఏఐఐఈఏ ప్లాటిన జూబ్లీ వేడుకల్లో ఆ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ మిశ్రా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సంస్థ ప్రగతితోనే ఉద్యోగుల భవిష్యత్తు అన్న దాన్ని గుర్తించి ఎల్‌ఐసీ బలోపేతం కోసం అందులోని ఉద్యోగులందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(ఏఐఐఈఏ) ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ మిశ్రా పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను అడ్డుకునే పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం లేబర్‌ కోడ్‌లను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కార్మిక సంఘాల హక్కుల కోసం విశాల ఐక్యవేదికగా పోరాటాలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ డివిజన్ల ఆధ్వర్యంలో ఏఐఐఈఏ ప్లాటీనం జూబ్లీ వేడుకలను నిర్వహించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీకాంత్‌ మిశ్రా మాట్లాడుతూ..ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలను రద్దు చేసి ఇన్సూరెన్స్‌ సంస్థలను ఒకే సంస్థగా జాతీయకరించాలనే విషయంలో ఏఐఐఈఏ విజయవంతమైందన్నారు. ఎల్‌ఐసీ ప్రభుత్వ రంగ సంస్థగా 1956 సెప్టెంబర్‌ ఒకటిన ఆవిర్భవించేలా చేయడంలో ఏఐఐఈఏ పాత్రను గుర్తుచేశారు. చంద్రశేఖర్‌ బోస్‌, సరోజ్‌ చౌధరి, సునిల్‌ మైత్ర, ఎన్‌.ఎం. సుందరం, ఆర్‌.పి. మన్‌చంద వంటి నేతల త్యాగాలను స్మరించుకున్నారు. ఆ తర్వాత అమానుల్లా ఖాన్‌, కె.వేణుగోపాల్‌ దార్శనికతతో ఒక కట్టుదిట్టమైన సంఘంగా నేటికీ అందరి మన్ననలను అందుకుంటున్నదని చెప్పారు. యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. ఏఐఐఈఏ 75 ఏండ్లలోకి అడుగుపెడుతున్న, సిల్వర్‌ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఎల్‌ఐసీ ప్రతి ఉద్యోగి కూడా నాలుగు అంశాలపై దృష్టి పెట్టి పనిచేయాలని కోరారు. ఒకవైపు ఎల్‌ఐసీ సంస్థను బలోపేతం చేసుకుంటూనే మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఎల్‌ఐసిని ప్రభుత్వరంగంలో కొనసాగించేందుకు నిరంతర పోరాటాలు చేయాలన్నారు. లేబర్‌ కోడ్‌ల ద్వారా కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న మోడీ సర్కారు కుట్రలను తిప్పికొట్టేందుకు విశాల ఐక్యవేదిక ద్వారా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ విరమణ చేసినవారు యూనియన్లకు ప్రాతినిధ్యం వహించకూడదనేది దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఏఐఐఈఏ నాయకులు వి.రమేశ్‌, రవీంద్రనాథ్‌, జి.తిరుపతయ్య, గిరిధర్‌, మద్దిలేటి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -