బీసీసీఐ కొత్త అధ్యక్షుడు మిథున్ మన్హాస్
కొత్త కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
నవతెలంగాణ-ముంబయి
భారత దేశవాళీ క్రికెట్ లెజెండ్, జమ్ము కశ్మీర్ స్టార్ మిథున్ మన్హాస్ (45) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 37వ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆదివారం ముంబయి వాంఖడెలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన బోర్డు 94వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో 2025-28 కాలానికి కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లోధా సంస్కరణల తర్వాత వరుసగా మూడోసారి ఓ క్రికెటర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవాజిత్ సైకియా, సంయుక్త కార్యదర్శిగా ప్రభుతేజ్ సింగ్ భాటియా, కోశాధికారిగా మాజీ క్రికెటర్ రఘురామ్ భాట్‌లు ఎన్నికయ్యారు. ‘ప్రపంచంలో ఉత్తమ క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిగా ఎన్నికవటం గౌరవంగా భావిస్తున్నాను.
ఇదో పెద్ద బాధ్యత. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు నిబద్దతతో పని చేస్తాను. క్రికెటర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా నా పనితీరే ఈ పదవి దక్కేందుకు దోహదం చేసింది. జమ్ము కశ్మీర్ క్రికెట్ బోర్డులో 4 ఏండ్లు పని చేయగా.. ఈ సమయంలో ఏడు సార్లు ఆ జట్టు దేశవాళీ టోర్నీ నాకౌట్ దశకు చేరుకుంది. అడ్మినిస్ట్రేటర్‌గా పట్టుదలతో పని చేస్తానని ఇదే రుజువు’ అని అధ్యక్ష బాధ్యతల స్వీకరించిన అనంతరం మిథున్ మన్హాస్ అన్నాడు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రతినిధులుగా అరుణ్ సింగ్ ధుమాల్, కైరుల్ జమాల్ మజుందార్.. అపెక్స్ కౌన్సిల్‌కు జైదేవ్ నిరంజన్ షా ఎన్నికయ్యారు.
సెలక్షన్ కమిటీలో ఓజా
సీనియర్ సెలక్షన్ కమిటీలో ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్‌లు ఎంపికయ్యారు. అజిత్ అగార్కర్ సారథ్యంలోని కమిటీలో శివ్ సుందర్ దాస్, అజరులు ఇప్పటికే సభ్యులుగా కొనసాగుతున్నారు. మహిళల సెలక్షన్ కమిటీకి అమిత శర్మ చైర్మెన్‌గా ఉండగా.. శ్యామ, సులక్షణ నాయక్, జయ శర్మ, స్రవంతి నాయుడులు సభ్యులుగా ఎంపికయ్యారు. జూనియర క్రికెట్ కమిటీ చైర్మెన్‌గా శరత్.. సభ్యులుగా హర్విందర్ సోది, పాతిక్ పటేల్, కృష్ణ మోహన్, రణదేబ్ బోస్‌లు ఎంపికయ్యారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కమిటీకి జయేశ్ జార్జ్ చైర్మెన్‌గా ఉండనుండగా.. ఆఫీస్‌బేరర్లు సహా మధుమతి లెలె, సంజరు, పలని, అరుణ్‌లు సభ్యులుగా ఉంటారు. మౌలిక సదుపాయాల కమిటీకి రోహన్ జైట్లీ చైర్మెన్‌గా ఎంపికవగా.. ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి సానా సతీశ్ బాబు, అనిరుధ్ చౌదరి సహా ఆఫీస్ బేరర్లు సభ్యులుగా ఉంటారు.