ఇతర రాష్ట్రాలను ఉదహరిస్తూ, హైకోర్టులో మన వాదనలు బలంగా వినిపిద్దాం
బీసీ రిజర్వేషన్లపై నేడు విచారణ
రాజకీయంగానే రాష్ట్రపతి, గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు
మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి ముందస్తు సమాలోచనలు
న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, సిద్దార్థ దవేకు పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుని అసెంబ్లీలో తీర్మానం వరకూ పార్టీ తరపున, ప్రభుత్వం తరపున చేసిన అన్ని ప్రయత్నాలనూ హైకోర్టుకు నివేదిద్దాం…’ అని ముఖ్యమంత్రి రేవంత్… మంత్రివర్గ సహచరులకు, కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ట్రిబుల్ టెస్ట్ (సామాజిక ఆర్థిక కులగణన సర్వే, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు,జీవో విడుదల) కూడా పాసయ్యామంటూ న్యాయస్థానానికి విడమరిచి చెప్పాలని ఆయన సూచించారు. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టేసిన సంగతి విదితమే. కాగా బుధవారం ఈ అంశం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ మంత్రులు, కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రిజర్వేషన్లపై హైకోర్టులో తీర్పు ఏ విధంగా రావచ్చు? అది అనుకూలంగా వస్తే ఏం చేయాలి? ప్రతికూలమైతే ఎలా స్పందించాలి? అనే అంశాలపై సీఎం ఈ సందర్భంగా వారితో సుదీర్ఘంగా సమాలోచనలు చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనే విషయాన్ని కోర్టుకు నివేదించాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు బలమైన వాదనలు వినిపించేందుకు వీలుగా సుప్రీంకోర్టులో కేసును వాదించిన న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, సిద్దార్థ దవేలను రప్పించాలని కోరారు. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక కుల గణన, దాంతోపాటు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు, అనంతరం అసెంబ్లీలో తీర్మానించిన విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. ఆ మేరకే జీవో ఇచ్చిన విషయాన్నీ ప్రస్తావించారు.
ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అమలు విధానాన్ని ఏకరువు పెట్టాలన్నారు. తాము ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కులగణనను చేపట్టామనీ, తదనుగుణంగా రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేయాలంటూ కేంద్రాన్ని, రాష్ట్రపతిని కోరామని తెలిపారు. అయితే రాజకీయంగా తమను ఇరుకున పెట్టేందుకే అటు రాష్ట్రపతిగానీ, ఇటు ప్రధానిగానీ అపాయింట్‌మెంట్ ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ గవర్నర్ కూడా ఇదే రకంగా వ్యవహరించటం శోచనీయమన్నారు. మరోవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవటం మూలాన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు, ఇతర సాయాలు నిలిచిపోయాయని సీఎం రేవంత్ గుర్తు చేశారు. దీంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అంశాలన్నింటినీ సింఘ్వీ, దవే ప్రభుత్వం తరపున హైకోర్టు ముందుంచటం ద్వారా బలమైన వాదనలు వినిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. దీంతో సీఎం ఏకీభవించినట్టు తెలిసింది. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే ఏం చేయాలనే దానిపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. అలాంటప్పుడు బీసీల ప్రయోజనాల కోసం అవసరమైతే సుప్రీంకోర్టు గడప తొక్కటానికి కూడా వెనుకాడొద్దంటూ రేవంత్ సూచించినట్టు అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద బుధవారం వెలువడబోయే హైకోర్టు తీర్పు కోసం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ సర్కారు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ప్రజల్లో కూడా ఇది తీవ్ర చర్చనీయాంశం కానుంది.