బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు జీవో
2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ
కోర్టు ఆదేశాల మేరకు గడువులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు
క్యాబినెట్ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం
నేడు అసెంబ్లీ ముందుకు ఘోష్ కమిషన్ నివేదిక
హైకోర్టు విచారణతో సంబంధం లేకుండా ముందుగానే చర్చ
వరద నష్టంపై సెప్టెంబర్ 4న ఉన్నతాధికారులతో సమావేశం
నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్‌కు ఆమోదం
క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను అసెంబ్లీ వేదికగా కడిగి పారేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి… మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. తద్వారా ఆ పార్టీని ఇరకాటంలో పడేయాలని ఆయన వారికి సూచించారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ప్రవేశపెట్టకుండా చూడాలంటూ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామంటూ న్యాయస్థానం తెలిపిన నేపథ్యంలో…ఒకరోజు ముందుగానే (ఆదివారం) సభలో కాళేశ్వరంపై చర్చించటం ద్వారా బీఆర్‌ఎస్‌కు ఎలాంటి అవకాశం లేకుండా చేద్దామంటూ మంత్రివర్గ సమావేశంలో సీఎం వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ఒకవేళ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చినా, అప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదంటూ ఆయన చెప్పినట్టు తెలిసింది. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను…పీసీసీ కమిషన్ అంటూ బీఆర్‌ఎస్ ఎద్దేవా చేయటాన్ని క్యాబినెట్ తీవ్రంగా పరిగణించింది. టిట్ ఫర్ ట్యాట్ అనే పద్ధతిలో గులాబీ పార్టీ వైఖరిని శాసనసభలో ఎండగట్టాలని సీఎం ఈ సందర్భంగా మంత్రులకు చెప్పినట్టు సమాచారం. నివేదికలోని అంకెలు, సంఖ్యలు, గణాంకాలు, వాస్తవ పరిస్థితులను సూటిగా, స్పష్టంగా, ప్రజలకు అర్థమయ్యేలా విడమరిచి చెప్పాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఆయన సూచించారు. సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు పట్టుబడుతున్న బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి దిగాలంటూ రేవంత్, తన మంత్రివర్గ సహచరులకు సూచించారు.
ఈ క్రమంలో ఆదివారం అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. ఆ ప్రతులను సభ్యులందరికీ పంపిణీ చేసి, అనంతరం చర్చను ప్రారంభించనున్నారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అసెంబ్లీలో తీర్మానించే అవకాశం ఉంది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. మరోవైపు క్యాబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంతోపాటు, ఇటీవలి వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవ డంపైనా చర్చించారు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలతోపాటు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజహరుద్దీన్, కోదండరాం పేర్లను క్యాబినెట్ ఆమోదించి, గవర్నర్‌కు సిఫారసు చేసింది. క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. ‘కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జీవో విడుదల చేస్తాం.
ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయి. 2018 పంచాయతీరాజ్ చట్టంలోని 285(ఏ) చట్టానికి సవరణకు ప్రతిపాదించాం. అలాగే 2019 మున్సిపల్ యాక్ట్‌లోని 50 శాతం సీలింగ్ ఎత్తేయడానికి తెచ్చిన ఆర్డినెన్స్‌ను శాసనసభలో ప్రవేశపెట్టి, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుంటాం. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది…’ అని వారు వెల్లడించారు. వర్షాల వల్ల జరిగిన నష్టం అంచనాలపై సెప్టెంబర్ 4న ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇటీవల భారీ విపత్తు వల్ల పంట, ఆస్తి, రహదారులకు పెద్ద మొత్తంలో నష్టం జరిగిందన్నారు. వీటన్నింటిపై చర్చించి సత్వరం చేపట్టాల్సిన పనులపై నిర్ణయం తీసుకోవడంతోపాటు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని వివరించారు.
రాష్ట్రంలో గోశాల పాలసీ, దాని విధివిధానాలపై మంత్రివర్గంలో చర్చించినట్టు తెలిపారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కొలిచే సాంకేతికత, తదితర అంశాలకు సంబంధించిన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్‌కు మంత్రివర్గంలో ఆమోదం తెలిపారు. 2022-23 రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని మంత్రులు తెలిపారు. సీఎంఆర్ కింద ప్రభుత్వానికి 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యం రావాల్సి ఉందన్నారు. గత సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించి విచారణ చేసి, అవసరమైతే మిల్లర్లపై పీడీ యాక్ట్ పెడతామని ప్రకటించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజహరుద్దీన్, కోదండరాం పేర్లను క్యాబినెట్ సిఫార్సు చేసిందని తెలిపారు. మత్స్య కార్మిక సహకార సంఘాల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశమున్నందున పర్సనల్ ఇన్‌చార్జీలను నియమించనున్నట్టు పొంగులేటి, పొన్నం ఈ సందర్భంగా వెల్లడించారు.
కాళేశ్వరంపై బీఆర్‌ఎస్‌ను కడిగేద్దాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES